సోమవారం 25 జనవరి 2021
Medchal - Dec 02, 2020 , 04:11:01

సామాన్యులే ఓటెత్తారు..

సామాన్యులే  ఓటెత్తారు..

  • కాలనీల్లో ఖాళీ..బస్తీల్లో బారులు 
  • ఓటేసేందుకు ముందుకొచ్చిన కూలీలు, చిరువ్యాపారులు 
  • ఉదయం నుంచే గుంపులు గుంపులుగా కేంద్రాల వద్దకు.. 
  • యువత, విద్యాధికుల నిరుత్సాహంపై విమర్శల వెల్లువ

మేడ్చల్‌,నమస్తేతెలంగాణ : ఓటేసేందుకు చదువురాని వారు, కూలీలు, చిరువ్యాపారులు ముందుకొస్తే..బాగా చదువుకొని, ఉద్యోగాలు చేస్తున్న వారు మాత్రం బద్ధకించారు. పోలింగ్‌ కేంద్రం దగ్గరలో ఉన్నా మనకెందుకెలా..అన్న భావన ఉండడంతో పోలింగ్‌ శాతం దారుణంగా పడిపోయింది. రాజ్యాంగబద్ధంగా సమకూరిన ఓటు హక్కును విద్యాధికులు, ఉద్యోగులు, యువజనులతోపాటు మేధావులు విస్మరిస్తుంటే..నగరంలోని సామాన్యులు ప్రతీసారి ప్రజాస్వామిక చైతన్యాన్ని ఎలుగెత్తి చాటుతున్నారు. విల్లాలు, గేటెడ్‌ కమ్యూనిటీ నివాసులు, ఐటీ ఉద్యోగులు పోలింగ్‌ రోజును సెలవురోజుగా భావించి ఎంజాయ్‌  చేస్తే.. రోజు కూలీలు మాత్రం ఓటు వేసి చైతన్యాన్ని తట్టిలేపుతున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో మొత్తం 150 డివిజన్లలో సుమారు 74,67,256 ఓటర్లుండగా, (పురుషులు-38,89,637, మహిళలు-35,76,941, ఇతరులు-678) వీరి సౌకర్యార్థం రాష్ట్ర ఎన్నికల సంఘం సుమారు 9,101 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేసింది. నగరంలో ఆకాశాన్నంటే భవనాలున్న ప్రాంతాల్లో ఓటింగ్‌ తక్కువ నమోదైతే.. అదే బస్తీల్లో ఉదయం నుంచే బారులు తీరి ఓటెయ్యడతో అధికంగా పోలింగ్‌ నమోదైంది. ఐటీ కారిడార్లతోపాటు విల్లాలు, గేటెడ్‌ కమ్యూనిటీ కాలనీలు ఉన్న ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కొన్ని పోలింగ్‌ కేంద్రాల్లో ఎన్నికల సిబ్బంది నిద్రపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.  logo