ఆదివారం 17 జనవరి 2021
Medchal - Nov 28, 2020 , 04:22:42

గులాబీ జెండా ఎగురవేస్తాం

గులాబీ జెండా ఎగురవేస్తాం

  • వేల కోట్లతో ఆరేండ్లలోనే నగరాభివృద్ధి
  • సబ్బండవర్గాల సంక్షేమానికి కేసీఆర్‌ సర్కార్‌ పెద్దపీట
  • బీజేపీ ఆరాచకాలను ప్రజలు తిప్పికొడతారు..
  • టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు భారీ మెజార్టీ ఖాయం
  • కుత్బుల్లాపూర్‌ డివిజన్‌ టీఆర్‌ఎస్‌ ఎన్నికల ఇన్‌చార్జి,  నిజామాబాద్‌ డీసీసీబీ చైర్మన్‌ పోచారం భాస్కర్‌రెడ్డి
  • డివిజన్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కూన పారిజాతతో కలిసి కాలనీల్లో ప్రచారం

ఆరవై ఏండ్లుగా ప్రతిపక్షాలు చేయలేని అభివృద్ధిని టీఆర్‌ఎస్‌ సర్కార్‌ అధికారంలోకి వచ్చిన ఆరేండ్లలోనే చేసి చూపించింది.. సబ్బండవర్గాల సంక్షేమానికి సీఎం కేసీఆర్‌ పెద్ద పీట వేయడంతో నగరంలో వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టాం.. బీజేపీ ఆరాచకాలను ఓట్లతోనే ప్రజలు తిప్పికొడతారు.. టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించుకొని గ్రేటర్‌లో గులాబీ జెండాను ఎగురవేస్తాం.. అని కుత్బుల్లాపూర్‌ డివిజన్‌ టీఆర్‌ఎస్‌ ఎన్నికల ఇన్‌చార్జి, నిజామాబాద్‌ డీసీసీబీ చైర్మన్‌ పోచారం భాస్కర్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన ‘నమస్తే తెలంగాణ’తో ముచ్చటించారు. కాగా, పలు కాలనీల్లో డివిజన్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కూన పారిజాతతో కలిసి ప్రచారం చేశారు. - కుత్బుల్లాపూర్‌ 

గత ప్రభుత్వాల హయాంలో పల్లెలన్నీ సమస్యలతో స్వాగ తం పలికేవని, టీఆర్‌ఎస్‌ హయాంలో ప్రస్తుతం పచ్చని పంట పొలాలతో విలసిల్లుతున్నాయని పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. మిషన్‌ కాకతీయ, ఉచిత కరెంట్‌తో రైతాంగానికి సీఎం కేసీఆర్‌ పెద్దపీట వేశారన్నారు. పల్లెల్లో గ్రామగ్రామాన మొక్కలు నాటి, చెరువు ఆయకట్టలను మరమ్మతులు చేస్తూ ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించేలా ప్రత్యేక చొరవ తీసుకున్న ఘనత కేసీఆర్‌దేనన్నారు. ఆసరా పింఛన్లు, రూపాయికే కిలో బియ్యం, వైద్య ఆరోగ్య ఖర్చులకు సీఎం సహాయనిధితోపాటు గ్రామగ్రామాన కార్పొరేట్‌ వైద్యాన్ని అందించేందుకు బస్తీ దవాఖానలు ఏర్పాటు చేశారన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా భూమి ఉన్న ప్రతి ఒక్కరికి రైతు బంధు పథకం అందించి ఆదర్శంగా నిలిచార న్నారు. దీనికి తోడు రైతుబీమా ద్వారా రూ.5లక్షల బీమా సౌకర్యాన్ని కల్పించి ఇంటికి పెద్దన్నలా సీఎం కేసీఆర్‌ ఆదుకుంటున్నారని గుర్తు చేశారు.

విశ్వ నగరంగా హైదరాబాద్‌

సీఎం కేసీఆర్‌ హయాంలోనే హైదరాబాద్‌ విశ్వ నగరంగా మారిందన్నారు. స్థానికేతరులకు సైతం రాష్ట్ర ప్రభుత్వం అందిం చే సంక్షేమ పథకాలను అందిస్తున్నామని చెప్పారు. కుత్బుల్లాపూర్‌ డివిజన్‌లో ఇప్పటికే సీసీ రోడ్లు, డ్రైనేజీలు, మంచి నీటి పైపు లైన్లను వేసి అనేక ఏరియాల్లో బస్తీ దవాఖానలు, కమ్యూనిటీటి హాళ్లు, పార్కులను సుందరీకరించామని చెప్పారు. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ సహకారంతో ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌, ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశారన్నారు. డివిజన్‌లో 500 మందికి పైగా లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కు లు పంపిణీ చేశారని, 1,200 పిం ఛన్లు అందిస్తున్నట్లు చెప్పారు. సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా రూ.70లక్షలకు పైగా నిధులు మంజూరు చేసి పేదలకు అండగా నిలిచామని తెలిపారు. వరద బాధితులకు ఇంటింటికీ రూ.10వేల సాయాన్ని అందించామని, ఎన్నికల తర్వాత మిగిలిన వారికి సాయం అందించేందు కు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. 

త్వరలో నోటరీ భూములకు  హక్కుదారులు

కుత్బుల్లాపూర్‌లో ఏండ్ల తరబడి ఉంటున్న ప్రజలకు ఇప్పటి పూర్తి హక్కుదారులుగా గుర్తించబడలేదన్నారు. వారు ఏదైనా నిర్మాణాలు చేసుకుందామని బ్యాంకులకు వెళ్లితే చెల్లని పరిస్థితి ఉందన్నారు. ఇలాంటి క్రమంలో సీఎం కేసీఆర్‌ తీసుకొచ్చిన ధరణి పథకం ద్వారా ఇక్కడ నివసించే ప్రతి ఒక్కరికి పక్కా హక్కుదారుడిగా గుర్తిస్తూ జీవో ఏర్పాటుకు త్వరలోనే తగిన ప్రణాళికలను ప్రభుత్వం రూపొందిస్తుందన్నారు. వాజ్‌పేయినగర్‌, దత్తాత్రేయనగర్‌, అంబేద్కర్‌నగర్‌, ఎన్టీఆర్‌ నగర్‌, రామకృష్ణానగర్‌, చెరుకుపల్లికాలనీ వాసులకు ఎన్నికల అనంతరం పక్కాగా వారికి హక్కును కల్పించేందుకు ప్రభుత్వం జీవోను తీసుకొస్తుందని చెప్పారు.

బీజేపీతో ఏం జరుగుతుంది...? 

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ర్టానికి చేసిందేమి లేదని, ఇప్పుడు నగరంలో గెలిస్తే ఏం సాధిస్తారని ఆయన  ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌ హయాంలో జరిగిన అభివృద్ధి, ఇంకా మిగిలిన అభివృద్ధి నిర్మాణ పనులు, ఇతర సంక్షేమ పథకాలు, ఎవరెవరికి ప్రభుత్వ సంక్షేమాలు అందాలనే దానిపై పూర్తి అవగాహన ఉన్న టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులను గెలిపించుకుంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. కేవలం ఎన్నికల సమయంలో ప్రజల్లోకి వచ్చి ఆది చేస్తాం.. ఇది చేస్తామని గొప్పలు చెప్పుకుంటున్న బీజేపీ నేతలు.. కేంద్రం నుంచి డివిజన్లలో జరిగిన అభివృద్ధిపై ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. కేవలం నాలుగు ఓట్ల కోసమే నగరాన్ని అల్లకల్లోలం చేస్తామని రెచ్చగొడుతున్న బీజేపీ నేతలు అధికారంలోకి వస్తే ప్రజలను నిలువు దోపిడీ చేయరనే రుజువేందని ప్రశ్నించారు.

అభివృద్ధికి పట్టం కట్టండి

కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలు టీఆర్‌ఎస్‌ పార్టీకి పట్టం కట్టాలని పోచారం భాస్కర్‌రెడ్డి పిలుపునిచ్చారు. ప్రస్తుతం అభివృద్ధికి, అక్రోశానికి మధ్య ఎన్నికలు జరుగుతున్నాయని తెలిపారు. బీజేపీకి ఓటేస్తే మతోన్మాదానికి వేసినట్లేనన్నారు. కుత్బుల్లాపూర్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కూన పారిజాతను భారీ మెజార్టీతో గెలిపించుకొని డివిజన్‌ను మరింత ఆదర్శంతంగా తీర్చిదిద్దుకోవాలని ఆయన ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.