సోమవారం 18 జనవరి 2021
Medchal - Nov 27, 2020 , 05:52:57

అభివృద్ధికి పట్టం కట్టండి

అభివృద్ధికి పట్టం కట్టండి

గాజులరామారం: టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో  కాలనీలు, బస్తీల్లో జరిగిన అభివృద్ధిని చూసి కారు గుర్తుకు ఓటేయాలని కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గాజులరామారం డివిజన్‌ పరిధిలోని దేవేందర్‌నగర్‌, పోచమ్మబస్తీ, బతుకమ్మ బండలో ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు తో కలిసి గురువారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వాల పాలనలో దేవేందర్‌నగర్‌లో కనీస సౌకర్యాలు లేక ప్రజలు ఇబ్బందులకు గురైనట్లు తెలిపారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మురికి వాడల అభివృద్ధికి కోట్లాది రూపాయల ఖర్చు చేస్తున్నదన్నారు. మిషన్‌ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరు, సీసీ రోడ్లు, భూగర్భ్ర డైనేజీ నిర్మాణం, వీధి దీపాలు, బస్తీల్లో అంగన్‌వాడీ కేంద్రాలు, బస్తీ దవాఖానలు వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టినట్లు తెలిపారు. డివిజన్‌లో మరింత మరింత అభివృద్ధి జరుగాలంటే టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి రావుల శేషగిరిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

గులాబీ జెండా ఎగురవేయాలి

గ్రేటర్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించుకొని గులాబీ జెండాను ఎగురవేయాలని కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌ పేర్కొన్నారు. గురువారం ఆయన జగద్గిరిగుట్ట డివిజన్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కొలుకుల జగన్‌తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జగద్గిరిగుట్ట చివరి బస్టాప్‌లో ని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన ప్రచార కార్యక్రమంలో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమం పురుడు పోసుకున్నప్పటి నుంచి నేటి వరకు జగద్గిరిగుట్ట డివిజన్‌ ప్రజలు కేసీఆర్‌కు అండగా ఉంటున్నారన్నారు. గడిచిన ఐదేండ్లలో డివిజన్‌ అభివృద్ధికి రూ.50 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. మరో రూ.20 కోట్ల అభివృద్ధి పనులకు ఇటీవలే శంకుస్థాపన చేశామని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ హయాంలో జగద్గిరిగుట్టలో రూ.17కోట్లతో రిజర్వాయర్‌ను నిర్మించి తాగునీటి కష్టాలను తీర్చామని గుర్తు చేశారు. రూపాయికే నల్లా కనెక్షన్‌ ఇచ్చి ఇంటింటికీ రోజు విడిచి రోజు నీటిని సరఫరా చేస్తున్నామని పేర్కొన్నారు. డిసెంబర్‌ 1 నుంచి పూర్తి ఉచితంగా నీటిని సరఫరా చేయనున్నట్లు తెలిపారు. 

అల్లర్లు సృష్టించేందుకు కుట్ర

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలకు అండగా ఉంటే.. మత విద్వేశాలను రెచ్చగొట్టి ఓట్లు దండుకోవాలని బీజేపీ చూస్తున్నదని విమర్శించారు. ప్రశాంతతకు నిలయమైన హైదరాబాద్‌ నగరంలో అలజడి సృష్టించి ప్రజల మధ్య చిచ్చుపెట్టాలని చూస్తున్న బీజేపీ నేతలకు ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలన్నారు. కారు గుర్తుకే ఓటు వేసి టీఆర్‌ఎస్‌ జగద్గిరిగుట్ట అభ్యర్థి కొలుకుల జగన్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.