శనివారం 28 నవంబర్ 2020
Medchal - Nov 21, 2020 , 06:56:46

కారు జోరును ఆపలేరు

కారు జోరును ఆపలేరు

  • భాగ్యనగరం మళ్లీ టీఆర్‌ఎస్‌కే
  • మంత్రి చామకూర మల్లారెడ్డి

మేడ్చల్‌ రూరల్‌ : భాగ్యనగరంలో కారు జోరును ఆపలేరని, నగరంలో మరోసారి గులాబీ జెండా ఎగురడం ఖాయమని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి పేర్కొన్నారు. కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గంలోని రెండు డివిజన్ల ప్రచార బాధ్యతలను చేపట్టిన మంత్రి మల్లారెడ్డికి శుక్రవారం గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ మైసమ్మగూడలో ప్రజాప్రతినిధులు, నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్‌ ఎంతో పురోగతి సాధించిందన్నారు. రోడ్లు బాగయ్యాయని, కరెంట్‌, నీళ్ల సమస్య తీరిందని చెప్పారు. ప్రభుత్వం ఫ్లైఓవర్లను నిర్మించి, ట్రాఫిక్‌ సమస్యను తొలగించిందన్నారు. 

బస్తీ దవాఖానలతో నిరుపేదల వైద్యం సమస్య సమసిసోయిందని తెలిపారు. దుర్గంచెరువుపై నిర్మించిన తీగల వంతెన తెలంగాణకే తలమాణికంగా నిలిచిందన్నారు. గతంలో ఎప్పుడూ ఇంత అభివృద్ధి హైదరాబాద్‌లో జరుగలేదని తెలిపారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలే టీఆర్‌ఎస్‌ను మళ్లీ భారీ మెజార్టీతో గెలిపిస్తాయని ఆయన ధీమా వ్యక్తంచేశారు. ప్రజల్లో టీఆర్‌ఎస్‌పై పూర్తి నమ్మకం ఉందని చెప్పారు. కార్యకర్తలు క్రమ శిక్షణగల సైనికుల్లా పనిచేసి, పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి చామకూర మహేందర్‌రెడ్డి, నియోజకవర్గంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల చైర్‌పర్సన్‌లు ఎంపీపీలు, జడ్పీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.