శుక్రవారం 04 డిసెంబర్ 2020
Medchal - Nov 01, 2020 , 05:13:02

నాడు మురికివాడలు.. నేడు అభివృద్ధివైపు అడుగులు

నాడు మురికివాడలు.. నేడు అభివృద్ధివైపు అడుగులు

గ్రేటర్‌లో అతిపెద్ద డివిజన్‌. అత్యధిక ఓటర్లు, అత్యధిక మురికివాడలు ఉన్న డివిజన్‌. అదే కుత్బుల్లాపూర్‌ సర్కిల్‌ పరిధిలోని సుభాష్‌నగర్‌(130 డివిజన్‌). ఇక్కడిప్రజలు నిత్యం సమస్యలతో సావాసం చేస్తుంటారు. గడిచిన ఐదేండ్ల ముందు ఎక్కడ చూసినా పొంగుతున్న డ్రైనేజీలు, పందులు, వీధికుక్కల సంచారం, గుంతలు, బురదమయమైన రోడ్లు ఇలా అనేక సమస్యలు దర్శనమిచ్చేవి. కానీ ఇప్పుడు అంతా మారిపోయింది. స్థానిక ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌, ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు సహకారంతో డివిజన్‌ కార్పొరేటర్‌ దేవగారి శాంతిశ్రీ ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి కాలనీల అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. రూ.కోట్లాది నిధులు తీసుకువచ్చి ప్రతీ బస్తీకి డ్రైనేజీ, రోడ్లు, మంచినీటి సరఫరా తదితర మౌలిక వసతులు కల్పించి సమస్యల రహిత కాలనీలుగా మార్చారు. 

జీడిమెట్ల : సుభాష్‌నగర్‌ డివిజన్‌ పరిధి సూరారం కాలనీలో పలు అభివృద్ధి పనులు పూర్తి కావడంతో స్థానిక ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సూరారం కాలనీలో మొదటి ఓం జెండా, రెండో ఓం జెండా, భవానినగర్‌, బ్రాహ్మణ బస్తీ, వీడీఆర్‌ స్ట్రీట్‌, సీజీఎం చర్చ్‌ తదితర ప్రాంతాలలో  గత ఐదేళ్లలలో రూ.8 కోట్లతో సీసీ రోడ్లు, భూగర్భ డ్రైనేజీ నిర్మాణం, రోడ్డు ప్యాచ్‌ వర్క్‌ పనులు అధికారులు చేపట్టారు. రూ.36లక్షలు ఎంపీ, ఎమ్మెల్యే నిధులతో వికలాంగుల కోసం సూరారం కాలనీలో లూయిస్‌ బ్రెయిలీ భవనం నిర్మించారు. ఈ భవనం అందులకే కాకుండా సూరారంకాలనీ పరిధిలోని బస్తీల వాసులకు సమావేశాలు, మినీ ఫంక్షన్లు చేసుకోవడానికి ఉపయోగపడుతున్నది. మిషన్‌ భగీరథ పథకంలో భాగంగా ఇంటింటికి నల్లా కనెక్షన్లు ఇచ్చి మెరుగైన తాగునీటి సరఫరా చేస్తుండడంతో మహిళల కష్టాలు తీరాయి. 

జీవన్‌ వికాస్‌ వెల్ఫేర్‌  డెవలప్‌మెంట్‌ అసోసిమయేషన్‌ ఆధ్వర్యంలో..

సూరారం కాలనీలో జీవన్‌ వికాస్‌ వెల్ఫేర్‌ డెవలప్‌మెంట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో రూ.12 లక్షల జీహెచ్‌ఎంసీ నిధులతో సీసీ రోడ్డు నిర్మాణం, రోడ్డు ప్యాచ్‌ వర్క్‌, ఓపెన్‌ నాలాపై బండలు ఏర్పాటు చేశారు. 

అభివృద్ధి జరుగుతున్నది

30 యేండ్లలో కాని అభివృద్ధి పనులు సూరారం కాలనీలో నేడు కొనసాగుతున్నాయి. సూరారం కాలనీ సాయిబాబానగర్‌ లింక్‌రోడ్డు నిర్మాణం కావడంతో రవాణా సౌకర్యం మెరుగుపడింది. జీవన్‌ వికాస్‌ వెల్ఫేర్‌ డెవలప్‌మెంట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జీహెచ్‌ఎంసీ నిధులతో అభివృద్ధి పనులు చేస్తున్నాం. - బల్లెం శ్యామ్‌, జీవన్‌ వికాస్‌ వెల్ఫేర్‌ డెవలప్‌మెంట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు,  సూరారం కాలనీ 

సమస్యలు తీరాయి

గత 35 యేండ్లుగా సమస్యలతో సహవాసం చేశాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తరువాత విశాలమైన రోడ్లు ఏర్పాటయ్యాయి. తరచూ మురుగునీటి సమస్య తలెత్తేది. భూగర్భ డ్రైనేజీ నిర్మాణ పనులు చేపట్టడంతో ఆ సమస్య తీరింది. వికలాంగుల కోసం లూయిస్‌ బ్రెయిలీ భవనం నిర్మించడం సంతోషంగా ఉంది.  - వంగాల నరేందర్‌రెడ్డి, వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ డిజెబుల్డ్‌ ప్రధాన కార్యదర్శి, సూరారం కాలనీ