గురువారం 26 నవంబర్ 2020
Medchal - Oct 31, 2020 , 08:08:39

ముంపు ప్రాంతాల్లో .. అభివృద్ధి పనులు చేపట్టాలి

ముంపు ప్రాంతాల్లో .. అభివృద్ధి పనులు చేపట్టాలి

పీర్జాదిగూడ : ముంపు ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపట్టాలని పీర్జాదిగూడ మేయర్‌ జక్క వెంకట్‌రెడ్డి అన్నారు. ఈ మేరకు శుక్రవారం మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయంలో మేయర్‌ అధికారులు, కాంట్రాక్టర్లు, వార్డు ఆఫీసర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శానిటేషన్‌, వీధి దీపాలు, రోడ్ల మరమ్మతులు వివిధ అంశాలపై అధికారులతో చర్చించారు. అనంతరం అధికారులను ఉద్దేశించి మేయర్‌ మాట్లాడుతూ ఇటీవల కురిసిన వర్షాలతో ముంపు కాలనీల్లో కొట్టుకుపోయిన రోడ్లను గుర్తించి వెంటనే మొరం పోయించి మరమ్మతులు చేయించాలన్నారు. ఆయా కాలనీల వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పారిశుధ్య పనులు చేపట్టాలని తెలిపారు. రోడ్లలో పేరుకుపోయిన బురదను తొలగించి బ్లీచింగ్‌ పౌడర్‌ను చల్లాలని, నల్లానీరు సప్లయ్‌ లేని ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా మంచినీటిని అందించాలని సూచించారు. ముంపు ప్రాంతాల్లో వర్షాలకు పాడైన భూగర్భ డ్రైనేజీ మ్యాన్‌హోల్స్‌ పైకప్పులను గుర్తించి మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రతి కాలనీ శుభ్రంగా ఉండేలా చూడాలని, వీధి దీపాలు లేని చోట నూతన విద్యుత్‌ దీపాలను ఏర్పాటు చేయాలని చెప్పారు. హరితహారం కార్యక్రమంలో నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాలని, ఆయా కాలనీల్లోని ఖాళీ ప్లాట్లలో నిల్వ ఉన్న నీటిలో ఆయిల్‌ బాల్స్‌ వేయించాలని అధికారులకు సూచించారు. సీజనల్‌ వ్యాధులు ప్రభలే అవకాశం ఉందని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.

 ముంపు ప్రాంతాల్లో పర్యటించిన మేయర్‌ 

నగరపాలక పరిధిలోని 20 డివిజన్‌లోని ముంపు ప్రాంతాల్లో స్థానిక కార్పొరేటర్‌ కౌడె పోచయ్యతో కలిసి మేయర్‌ పర్యటించారు. వరదలకు కొట్టుకుపోయిన రోడ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముంపు ప్రాంతాల్లో వీలైనంత త్వరగా పాడైన రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వరద బాధితులకు ఆర్థిక సహాయం అందిందా ? లేదా ? అని స్థానికులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో కమిషనర్‌ శ్రీనివాస్‌, ఏఈ మహిపాల్‌, స్థానిక నాయకులు, కార్యకర్తలు, కాలనీవాసులు పాల్గొన్నారు.