సోమవారం 30 నవంబర్ 2020
Medchal - Oct 31, 2020 , 05:56:46

చైతన్య దీపికలు.. రైతు వేదికలు

చైతన్య దీపికలు.. రైతు వేదికలు

మేడ్చల్‌, నమస్తే తెలంగాణ: ఊరు పక్కనే అర ఎకరం స్థలం... దాని చుట్టూ పచ్చని చెట్లు... ఆ చెట్ల నీడన సేద తీరేందుకు రచ్చబండల్లాంటి వసతులు...  అధునాతన ఫంక్షన్‌ హాల్‌ను తలపించేలా ఆకుపచ్చని భవంతి... విశాలమైన మీటింగ్‌ హాల్‌... ఎదురుగా గోడలపై శ్రమజీవుల చిత్రాలు. ఆ చిత్రాల ముందు ఓ వేదిక. .. ఇలా సకల హంగులతో రైతు వేదికలు అద్భుతంగా సిద్ధమవుతున్నాయి. ఒక్కో వేదిక కోసం రూ.22 లక్షలు (గ్రామీణాభివృద్ధి శాఖ జాతీయ ఉపాధి హామీ నుంచి రూ.10లక్షలు, తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ శాఖ నుంచి రూ.12లక్షల) వెచ్చించి అధునాతన సౌకర్యాలతో నిర్మిస్తున్నారు. మేడ్చల్‌ జిల్లాలో తొలుత తొమ్మిది వేదికల నిర్మాణం కోసం జిల్లా పంచాయతీరాజ్‌, ఆర్‌అండ్‌బీ ఇంజినీరింగ్‌ విభాగాలకు నిర్మాణ బాధ్యతలను అప్పగించారు. కీసర, యాద్గార్‌పల్లి, ఏదులాబాద్‌, మూడుచింతలపల్లి, ప్రతాపసింగారం ప్రాంతాల్లో భవన నిర్మాణ పనులు పూర్తయ్యాయి. మిగిలిన రాయిళ్లపూర్‌, పూడూరు, అలియాబాద్‌, లాల్‌గడిమలక్‌పేట ప్రాంతాల్లో మాత్రం 90 శాతం పనులు పూర్తయ్యాయి.