శనివారం 28 నవంబర్ 2020
Medchal - Oct 30, 2020 , 08:30:59

వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ పథకానికి విశేష స్పందన

వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ పథకానికి విశేష స్పందన

కాప్రా : నల్లా బిల్లుల బకాయిల వసూలు కోసం జలమండలి ప్రవేశపెట్టిన వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ పథకానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఎంతో కాలంగా పేరుకుపోయిన బకాయిలను ఓటీఎస్‌ పథకం ద్వారా పాత బకాయిలను వినియోగదారులు  చెల్లిస్తున్నారు. ఈ పథకంలో భాగంగా నల్లా బిల్లుల బకాయిలపై వడ్డీలను పూర్తిగా రద్దు చేస్తూ, అసలు బిల్లులను చెల్లించాలని ప్రకటించడంతో పెద్దమొత్తంలో పాతబకాయిలు వసూలయ్యాయి. కాప్రా సర్కిల్‌లో మొత్తం రూ. 16కోట్ల నల్లా బిల్లుల బకాయిలు ఉండగా, ఓటీఎస్‌ పథకం ద్వారా రూ. 6.2 కోట్లు బిల్లులు వసూలయ్యాయి. మొత్తం 39 వేల నివాస, కమర్షియల్‌ నల్లా కనెక్షన్ల నుంచి బకాయిలు వసూలయ్యాయి. జలమండలి వడ్డీ నష్టపోయినప్పటికీ, పాత బకాయిలను 40 నుంచి 50శాతం మేర వసూలు చేయగలిగారు. కొన్ని బకాయిలు వివాదాలతో కూడి ఉండటంతో వాటి వివరాలను అధికారులు డిస్ప్యూట్‌ కమిటీకి పంపించారు. 

మొత్తం నల్లా కనెక్షన్లు 39వేలు..

కాప్రా సర్కిల్‌ పరిధిలోని కాప్రా, ఏఎస్‌రావునగర్‌, చర్లపల్లి, హెచ్‌బీకాలనీ, మల్లాపూర్‌, నాచారం తదితర ఆరు డివిజన్లను జలమండలి నీటి సరఫరాకు సంబంధించి రాధిక సెక్షన్‌, కైలాసగిరి సెక్షన్లుగా విభజించారు. కాప్రా, ఏఎస్‌రావునగర్‌, చర్లపల్లి డివిజన్లు రాధిక సెక్షన్‌ పరిధిలో ఉండగా, హెచ్‌బీకాలనీ, మల్లాపూర్‌, నాచారం సెక్షన్లు కైలాసగిరి పరిధిలోకి వస్తాయి. ఈ రెండు సెక్షన్లలో మొత్తం 39వేల కనెక్షన్లు ఉండగా వీటి నుంచి ప్రతి నెలా రూ.2 కోట్ల మేర నీటి రుసుము డిమాండ్‌ ఉంది. సగటున ప్రతినెల రూ.1.7 కోట్లమేర నీటి రుసుము వసూలవుతుంది. కొన్నేండ్లు దాదాపు  20 వేల నల్లా కనెక్షన్ల నుంచి రూ.16కోట్ల  బిల్లులు పేరుకుపోయాయి. ఆ బిల్లుల వసూలు జలమండలికి కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ స్కీం ప్రకటించింది. మొదటి దశలో సెప్టెంబర్‌ 15 వరకు తుది గడువు విధిస్తే స్పందన తగినంతరాలేదు. అయితే గడువును అక్టోబర్‌ 31వరకు పొడిగించడంతో బకాయిదారులు ఈ అవకాశాన్ని చాలా వరకు వినియోగించుకున్నారు. బకాయిలు కట్టలేకపోవడంతో గతంలోనే డిస్‌ కనెక్షన్‌ అయిన వారు కూడా ఈ సదుపాయాన్ని ఉపయోగించుకొని కనెక్షన్‌ను తిరిగి పునరుద్ధరించుకుంటున్నారు.