గురువారం 03 డిసెంబర్ 2020
Medchal - Oct 28, 2020 , 08:36:18

ఆదర్శంగా ఐకానిక్‌ ప్లాంటేషన్‌

 ఆదర్శంగా ఐకానిక్‌ ప్లాంటేషన్‌

మేడ్చల్‌  : హరితహారంలో భాగంగా చేపట్టిన ఐకానిక్‌ ప్లాంటేషన్‌లో నాటిన మొక్కలు పచ్చదనంతో ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు హరితహారం పథకంలో భాగంగా రోడ్డు ప్రక్కన, ఖాళీ స్థలాల్లో ఐకానిక్‌ (పెద్ద పెద్ద) మొక్కలను నాటి ప్రత్యేక చర్యలు చేపట్టడంతో మంచి ఫలితాలు వస్తున్నాయి. ఐకానిక్‌ ప్లాంటేషన్‌ కోసం మొక్కలు నాటేందుకు నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో అధికారులు, పంచాయతీ పాలకవర్గాలు ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగుతున్నారు. రెండేండ్లుగా ఏపుగా పెరిగిన సుమారు 6 ఫీట్ల ఎత్తున్న మొక్కలతో ప్లాంటేషన్‌ చేపడుతున్నారు. పెరిగిన పెద్ద మొక్కలతో చేపడుతున్న ఈ పథకంతో మొక్కలు కూడా తొందరగా పెరిగి పచ్చని వాతావరణాన్ని అందిస్తున్నాయి. ఈ మొక్కలతో వంద శాతం ఫలితాలు ఉండటంతో పాలకవర్గాలు కూడా ఐకానిక్‌ ప్లాంటేషన్‌కు మొగ్గుచూపుతున్నాయి.

ఐదు మండలాల్లో నాటిన మొక్కలు..

నియోజకవర్గంలోని 5 మండలాల్లో ఐకానిక్‌ ప్లాంటేషన్‌ చేపట్టి మొక్కల సంరక్షణ చేపడుతున్నారు. మేడ్చల్‌ మండలంలో 2019-20వ సంవత్సరంలో 6200 మొక్కలు, ఈ యేడు 6800 మొక్కలు నాటారు. అదే విధంగా శామీర్‌పేట మండలంలో మొత్తం 10 గ్రామాలకు 8 గ్రామాల్లో  2019-20 సంవత్సరంలో 6 వేల మొక్కలు నాటగా, 2020-21 సంవత్సరంలో 10 వేల మొక్కలు నాటారు. 

   మూడుచింతలపల్లి మండలంలో 13 గ్రామాలు ఉండగా 10 గ్రామాల్లో ఐకానిక్‌ ప్లాంటేషన్‌ 2019-20 సంవత్సరంలో 9 వేల మొక్కలు నాటగా 2020-21 సంవత్సరంలో 11 వేల మొక్కలు నాటారు. శామీర్‌పేట మండలంలో 6 వేల మొక్కలు, పంచాయతీల్లో  కీసర మండలంలోని 10 పంచాయతీల్లో 12,774 మొక్కలు, 2021లో 4,750 మొక్కలు నాటారు. ఘట్‌కేసర్‌ మండలంలో అవుషాపూర్‌లో గత ఏడాది 800 మొక్కలు నాటారు. 

పచ్చదనంతో ఆహ్లాదం..

ఐకానిక్‌ ప్లాంటేషన్‌లో చేపట్టిన మొక్కలు ఏపుగా పెరిగి పచ్చదనాన్ని పంచుతున్నాయి. గ్రామాల్లో రోడ్డుకు ఇరు ప్రక్కల, ఖాళీ స్థలాల్లో నాటిన మొక్కలు ఏపుగా పెరిగి ప్రయాణికులకు ఆహ్లాదాన్ని అందిస్తున్నాయి. ప్లాంటేషన్‌లో నాటిన ప్రతి మొక్క బతుకడంతో ఐకానిక్‌ ప్లాంటేషన్‌ ఆదర్శంగా నిలుస్తున్నది.