గురువారం 03 డిసెంబర్ 2020
Medchal - Oct 28, 2020 , 08:32:37

జరిమానా విధించినా...

జరిమానా విధించినా...

ప్రధాన రోడ్లపై భారీ వాహనాలు, ఆటోలు ఇష్టానుసారంగా నిలుపడంతో ద్విచక్ర వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నాగారం, రాంపల్లి, అహ్మద్‌గూడ ప్రాంతాల్లో ప్రధానరోడ్డు మార్గాలు కావడంతో నిత్యం వేల సంఖ్యలో భారీ వాహనాలు, ఆటోలు, మట్టి, కంకర,చెత్త లారీలు, ద్విచక్ర వాహనాలు నడుస్తున్నాయి.

మేడ్చల్‌ కలెక్టరేట్‌ :  పలు జిల్లాల నుంచి వచ్చే వాహనాలు నాగారం మీదుగా నగరానికి రాకపోకలు సాగిస్తుండడంతో భారీగా ట్రాఫిక్‌ అవుతున్నది. దీనికి తోడు రోడ్లపై లారీలు, ఆటోలు నిలుపడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. నాగారంలోని ఎస్‌వీనగర్‌, మున్సిపల్‌ కార్యాలయం వద్ద, దమ్మాయిగూడ , రాంపల్లి చౌరస్తా, సత్యనారాయణ కాలనీ, ఆర్‌ఎల్‌ నగర్‌, రాంపల్లి, అహ్మద్‌గూడలోని ప్రధాన రోడ్లపై ఆటోలు నిలుపుతున్నారు. రాంపల్లి చౌరస్తా, అహ్మద్‌గూడలో చెత్త లారీలు రోడ్డుపై నిలుపడంతో ద్విచక్ర వాహనదారులు, ప్రజలు పలు ఇబ్బందులు పడుతున్నారు.  ట్రాఫిక్‌ పోలీసులు రోడ్లపై నిలిపిన వాహనాలకు భారీగా జరిమానాలు విధించినప్పటికీ ఆటోలు, చెత్త, మట్టి లారీలు రోడ్లపై నిలుపుతూనే ఉన్నారు. జరిమానా విధించినప్పటికీ ధోరణి మార్చుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. రోడ్లపై వాహనాలు నిలుపుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.


స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తాం..

ప్రధాన రోడ్లపై నిలిపే వాహనాలకు జరిమానాలు విధించేందుకు స్పెషల్‌ డ్రైవ్‌ను నిర్వహిస్తాం. రోడ్లపై నిలిపే వాహనదారులకు జరిమానా విధించినప్పటికీ మార్పు రావడం లేదు. పార్కింగ్‌ స్థలాల్లో మాత్రమే వాహనాలను పార్క్‌ చేయాలి. రోడ్డుపై పార్క్‌ చేయకూడదు. రోడ్డుపై నిలిపే ప్రతి వాహనానికి జారిమానా విధించడంతో పాటు  చర్యలు తీసుకుంటాం. - రాములు,ట్రాఫిక్‌ సీఐ,కుషాయిగూడ.