బుధవారం 25 నవంబర్ 2020
Medchal - Oct 24, 2020 , 06:22:28

ఆర్థిక సహాయంతో.. బాధితులకు భరోసా

ఆర్థిక సహాయంతో.. బాధితులకు భరోసా

ఘట్‌కేసర్‌ : ముంపు ప్రాంతాల ప్రజలకు ఆర్థిక సహాయం అందజేసి సీఎం కేసీఆర్‌ ఆదుకుంటున్నారని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. ఘట్‌కేసర్‌ మున్సిపాలిటీ పరిధిలో వరద నీటిలో ఇండ్లు మునిగిపోయిన 4వందల మంది బాధితులకు రూ. 10 వేల ఆర్థిక సహాయం, రేషన్‌ కిట్‌లను జిల్లా కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు, చైర్‌పర్సన్‌ ముల్లి పావనీ జంగయ్య యాదవ్‌తో కలిసి మంత్రి అందజేశారు.  ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వరద ప్రాంతాల పరిస్థితిని ప్రభుత్వం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు అండగా ఉండి ప్రభుత్వం చేయూతనిచ్చిందని తెలిపారు.వైస్‌చైర్మన్‌ పలుగుల మాధవరెడ్డి, టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు బి. శ్రీనివాస్‌గౌడ్‌, ప్రధాన కార్యదర్శి బర్ల రాధాక్రిష్ణ ముదిరాజ్‌, రైతు సొసైటీ అధ్యక్షుడు సింగిరెడ్డి రాంరెడ్డి, మాజీ అధ్యక్షుడు శ్రీనివాస్‌ గౌడ్‌, కౌన్సిలర్లు, కో-ఆఫ్షన్‌ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఆదుకుంటాం ఆందోళన  వద్దు : మేయర్‌  

 పీర్జాదిగూడ : వరద బాధితులు ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని, సీఎం కేసీఆర్‌ ఆర్థిక సహాయం అందజేస్తున్నారని పీర్జాదిగూడ మేయర్‌ జక్క వెంకట్‌రెడ్డి అన్నారు. ఈ మేరకు శుక్రవారం నగరపాలక పరిధిలోని 1, 3, 8,18వ డివిజన్‌లోని లోతట్టు ప్రాంతాల వరద బాధితులకు రూ.10వేలు, రేషన్‌ కిట్లను కార్పొరేటర్లతో కలిసి అందజేశారు.  అనంతరం నగరపాలక పరిధిలోని మొదటి డివిజన్‌లో వరద ముంపు ప్రాంతం ప్రగతినగర్‌ కాలనీలో అధికారులతో కలిసి పర్యటించారు.  కార్యక్రమంలో డిప్యూటీ మేయర్‌ కుర్ర శివకుమార్‌గౌడ్‌,  కార్పొరేటర్లు శారద ఈశ్వర్‌రెడ్డి, కుర్ర షాలినీ శ్రీకాంత్‌గౌడ్‌, మద్ది యుగేందర్‌రెడ్డి పాల్గొన్నారు.  

 ఆర్థిక సహాయం అందజేసిన  అదనపు కలెక్టర్‌  

 జవహర్‌నగర్‌ : ముంపు బాధితులకు అన్ని విధాలుగా అండగా నిలిచి ఆదుకుంటామని జిల్లా అదనపు కలెక్టర్‌ జాన్‌శ్యాంసన్‌ అన్నారు. శుక్రవారం జవహర్‌నగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని లోతట్టు ప్రాంతాల్లో అదనపు కలెక్టర్‌, కార్పొరేషన్‌ డిప్యూటీ మేయర్‌ రెడ్డిశెట్టి శ్రీనివాస్‌, కమిషనర్‌ నేతి మంగమ్మతో కలిసి పర్యటించారు. అనంతరం బాధితులకు ఆర్థిక సహాయం అందజేశారు. వరద ముంపు బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తుందని తెలిపారు. 

 నాగారం మున్సిపాలిటీలో..

 మేడ్చల్‌ కలెక్టరేట్‌  : బాధితులందరికీ పరిహారం అందిస్తామని ప్రత్యేక అధికారి వినోద్‌కుమార్‌ అన్నారు.శుక్రవారం నాగారం మున్సిపాలిటీలో ముంపు ప్రాంతాల్లో వరద బాధితులకు మూడవ రోజు రూ.10 వేలు, నిత్యావసర సరుకులను అందజేశారు. 225 మంది బాధితులలో ఇప్పటి వరకు 110 మంది బాధితులకు ఆర్థిక సహాయం అందజేశామని తెలిపారు.  కార్యక్రమంలో కౌన్సిలర్లు పంగ హరిబాబు, శ్రీనివాస్‌ గౌడ్‌,  మున్సిపల్‌, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

బోడుప్పల్‌ కార్పొరేషన్‌ పరిధిలో..

 బోడుప్పల్‌ : వరద బాధితులందరినీ ప్రభుత్వం అదుకుంటుందని మున్సిపల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సత్యనారాయణ అన్నారు.  శుక్రవారం బోడుప్పల్‌ నగరంలోని 17వ డివిజన్‌ వినాయకనగర్‌ ముంపు ప్రాంతాల్లో మేయర్‌ బుచ్చిరెడ్డి, కమిషనర్‌ ఎన్‌ శంకర్‌తో కలిసి పర్యటించి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అనంతరం మేయర్‌ సామల బుచ్చిరెడ్డి మాట్లాడుతూ వర్షాలతో వచ్చే సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. మంత్రి మల్లారెడ్డి, కలెక్టర్‌ ఆదేశాల మేరకు దాదాపు రూ.70 కోట్లతో  భూగర్భడ్రైనేజీ, వరదనీరు నేరుగా మూసీలోకి పంపడానికి డీపీఆర్‌ సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో స్పెషల్‌టీం అధికారి పద్మావతి, మేనేజర్‌ సురేశ్‌రెడ్డి, ఏసీపీ నాగిరెడ్డి, స్థానిక కార్పొరేటర్‌ పోగుల నర్సింహారెడ్డి,  నాయకులు పాల్గొన్నారు.