శనివారం 05 డిసెంబర్ 2020
Medchal - Oct 20, 2020 , 10:37:11

ఆందోళన వద్దు.. అప్రమత్తంగా ఉండండి

ఆందోళన వద్దు.. అప్రమత్తంగా ఉండండి

కుత్బుల్లాపూర్‌, అక్టోబర్‌19: కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గం పరిధిలో జీడిమెట్ల ఫాక్స్‌ చెరువు నిండుకుండలా మారింది. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియని అయోయయ పరిస్థితి నెలకొన్నది. మరో రెండు, మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్నది. సోమవారం ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌, ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు, మున్సిపల్‌ శాఖ అడ్మినిస్ట్రేషన్‌ డైరెక్టర్‌ ఎన్‌.సత్యనారాయణ, డీసీపీ పద్మాజారెడ్డి, కూకట్‌పల్లి జోనల్‌ కమిషనర్‌ మమత, డీసీ మంగతాయారు, పేట్‌ బషీరాబాద్‌ సీఐ రమేశ్‌ సందర్శించి తగిన ముందస్తు చర్యలపై చర్చించారు. ఎఫ్‌టీఎల్‌ ప్రాంతాల్లో నివాసాల్లో ఉన్న ప్రజలను పూర్తిగా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, దీనికి తోడు చెరువు కిందవైపు ఉన్న జనాన్ని సైతం అప్రమత్తం చేసేలా అధికారులు సమష్టిగా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలెవ్వరూ ఆందోళనకు గురికారాదని చెరువులో నీటిని మళ్లించేందుకు తగిన సమయం పడుతుందని, అందుకు ప్రజలు సహకరించాలని కోరారు. ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.  

ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలి

కుత్బుల్లాపూర్‌: వాతావరణ శాఖ ఇచ్చిన సూచనల మేరకు కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గంలో మరో 48 గంటల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని, ప్రజలెవ్వరూ ఆందోళనకు గురికాకుండా ముందస్తుగా అప్రమత్తంగా ఉండాలని కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌ కోరారు. సోమవారం కుత్బుల్లాపూర్‌ డివిజన్‌ పరిధిలో మోడీబిల్డర్స్‌, గణేశ్‌నగర్‌, రాంరెడ్డినగర్‌ లోతట్టు ప్రాంతాల్లో టీఆర్‌ఎస్‌ డివిజన్‌ అధ్యక్షుడు కేఎం గౌరీశ్‌తో కలిసి పర్యటించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. రాబోయే 48 గంటల్లో కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గం వ్యాప్తంగా భారీ వర్షం ప్రభావం ఉందని, ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అధికారయంత్రాంగం, ప్రజాప్రతినిధులు ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటారని, ఎలాంటి సమస్యా ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని కోరారు.

వరద బాధితులకు అండగా ప్రభుత్వం 

గాజులరామారం : వరద బాధితులకు తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్‌, రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు అన్నారు. సోమవారం గాజులరామారం డివిజన్‌ పరిధిలోని రావినారాయణరెడ్డినగర్‌లో వరద బాధితుల కోసం జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని  కార్పొరేటర్‌ రావుల శేషగిరిరావుతో కలిసి వారు ప్రారంభించారు. అనంతరం వరద బాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో డీసీ రవీందర్‌కుమార్‌, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ ఆనంద్‌, డాక్టర్‌ మమత, డివిజన్‌ టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు విజయ్‌రామిరెడ్డి, నాయకులు ఇంద్రసేనగుప్త, కస్తూరి బాల్‌రాజు, హుస్సేన్‌, కమలాకర్‌, సాయి ప్రతాప్‌, పరుష శ్రీనివాస్‌యాదవ్‌, అబిద్‌, ఇబ్రహీం, లక్ష్మణ్‌, వార్డు సభ్యులు మసూద్‌, అజయ్‌ప్రసాద్‌గుప్త, సురేశ్‌, మహిళ నాయకురాలు సంధ్యారెడ్డి పాల్గొన్నారు.