బుధవారం 02 డిసెంబర్ 2020
Medchal - Oct 20, 2020 , 10:30:38

లోతట్టు ప్రాంతాలు జలమయం కాకుండా చర్యలు

లోతట్టు ప్రాంతాలు జలమయం కాకుండా చర్యలు

పీర్జాదిగూడ : పీర్జాదిగూడ నగరపాలక సంస్థ పరిధిలోని డివిజన్లలో లోతట్టు ప్రాంతాలు వరదలతో జలమయం కాకుండా చర్యలు తీసుకుంటామని మేయర్‌ జక్క వెంకట్‌రెడ్డి అన్నారు. ఈ మేరకు రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ సూచనల మేరకు సోమవారం పీర్జాదిగూడ కార్పొరేషన్‌ కార్యాలయంలో రెవెన్యూ, ఇరిగేషన్‌, మున్సిపల్‌ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్‌ మాట్లాడుతూ  వర్షాలకు ముంపు ప్రాంతాల్లో చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. నగరపాలక పరిధిలోని అన్ని చెరువులు, కుంటలకు సంబంధించి ఎఫ్‌టీఎల్‌, మత్తడి డిజైన్‌లతో పాటు ప్రతి మత్తడిపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టడానికి అవకాశాలను పరిశీలించి ప్రణాళికా తయారు చేయాలని అధికారులకు సూచించారు. అవసరమైన మేరకు రోడ్లు తవ్వి భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను బలపర్చాలని కోరారు. 

పక్కాగా ప్రణాళిక తయారు చేయాలి..

ఉప్పల్‌ డిపో నుంచి బండి గార్డెన్‌ ద్వారా పీర్జాదిగూడ చెరువు వరకు అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ నిర్మాణం, చెరువుల చుట్టూ వాకింగ్‌ ట్రాక్‌ , కార్పొరేషన్‌లో చెరువులకు వచ్చే వరద నీరు, డ్రైనేజీ నీరును నేరుగా మూసీలో చేరవేసేందుకు ప్రణాళిక తయారు చేయాలన్నారు. పీర్జాదిగూడ ప్రధానరోడ్డును 100 ఫీట్లు , పాత బస్తీలో 80 ఫీట్ల రోడ్డు విస్తరణకు ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరదనీరు, పోచమ్మకుంట చెరువులోకి వచ్చే వరదనీరును అరోరా కళాశాల ప్రక్క నుంచి మూసీలోకి చేరే విధంగా ప్రణాళికా సిద్ధం చేయాలని తెలిపారు. 

ఎఫ్‌టీఎల్‌లో పట్టా, రిజిస్టర్‌ అయిన ప్రైవేట్‌ భూముల వివరాలను తెలుసుకోవాలన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ముంపునకు గురై ఇల్లు కూలిన వారికి రూ. లక్ష , పాక్షికంగా దెబ్బతిన్న వారికి రూ.52 వేలు, నిత్యావసర సామగ్రికి రూ. 3,800  , నీటిలో చిక్కుకున్న కుటుంబాలకు నిత్యావసర సరుకులు, 4వేల కిట్లు అందజేయాలన్నారు. కార్యక్రమంలో కమిషనర్‌ శ్రీనివాస్‌, తహసీల్దార్‌ ఇస్తేరి అనిత, డిప్యూటీ మేయర్‌ కుర్ర శివకుమార్‌గౌడ్‌, టౌన్‌ప్లానింగ్‌ ఆఫీసర్‌ రాజకుమార్‌, ఏఈ మహిపాల్‌, ఇరిగేషన్‌ అధికారులు పరమేశ్‌, ఆర్‌ఐ ఫణీందర్‌, పావనీ,ముంపు ప్రాంతాల కార్పొరేటర్లు , కో ఆప్షన్‌ సభ్యులు పాల్గొన్నారు.