ఆదివారం 29 నవంబర్ 2020
Medchal - Oct 15, 2020 , 10:17:36

నిండుకుండను తలపిస్తున్న శామీర్‌పేట చెరువు

నిండుకుండను తలపిస్తున్న శామీర్‌పేట చెరువు

శామీర్‌పేట : ప్రకృతి పులకరింపుతో శామీర్‌పేట చెరువులోకి వరద పరవళ్లు తొక్కుతున్నది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు చెరువు సుమారు 5 ఏండ్ల తర్వాత నిండుకుండను తలపిస్తున్నది. దుండిగల్‌, మేడ్చల్‌ మండలాల నుంచి ఎగువప్రాంతం గుండా వరదనీరు దిగువకు ప్రవహిస్తుండటంతో గంట గంటకు నీటి మట్టం పెరుగుతూనే ఉంది. శామీర్‌పేట పెద్ద చెరువు నీటి మట్టం 32 అడుగులు కాగా ప్రస్తుతం 27 అడుగులకు చేరింది. 2008లో చెరువు అడుగులు దాటగా 2016వ సంవత్సరం 32 అడుగుల వద్ద నీటి మట్టం వద్ద ఆగిపోయింది. ఈ ఏడు వర్షాలు ఎక్కువగా ఉండడంతో కచ్చితంగా చెరువు నిండుతుందని మండల ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

నిండిన 70 చెరువులు..

ఉమ్మడి శామీర్‌పేట మండల పరిధిలోని చెరువులు, కుంటలు పొంగిపొర్లుతున్నాయి. రత్నబాయిచెరువు, మై సమ్మకుంట, మల్కచెరువు, మటన్‌చెరువు, పొన్నల్‌ ఆనెకట్ట, లక్ష్మాపూర్‌ చెరువు, కొల్తూర్‌ చెరువు, ఉద్దెమర్రి చెరువులతో పాటు ఉమ్మడి శామీర్‌పేట మండలంలోని 70 చెరువులు, కుంటలు ఆనకట్టలు నిండి ప్రవహిస్తున్నాయి.

0.4 టీఎంసీ..

హైదరాబాద్‌ సంస్థానంగా పరిపాలన సాగిన రోజుల్లో శామీర్‌పేట ప్రాంతం నిజాం పరిపాలన వ్యవస్థలో ఉండేది. ఈ ప్రాంత ప్రజల దాహార్తి తీర్చడంతోపాటు వ్యవసాయానికి నీటిని అందించేందుకు హిమాయత్‌సాగర్‌, గండిపేట చెరువు, ఇబ్రహీంపట్నం చెరువులతోపాటు శామీర్‌పేట చెరువును నాటి ప్రభుత్వం తవ్వించింది. 0.4 టీఎంసీ కెపాసిటీతో 1200 ఎకరాల విస్తీర్ణం, 2500 ఎకరాల ఆయకట్టుతో మూడు తూములు, అలియాబాద్‌, శామీర్‌పేట గ్రామాల అలుగులుగా (మూడు అలుగులు) ఏర్పాటు చేసి శామీర్‌పేట పెద్ద చెరువును నిర్మించారు.