మంగళవారం 26 మే 2020
Medchal - May 13, 2020 , 00:09:18

గుర్రపుడెక్కతో బయోగ్యాస్‌

గుర్రపుడెక్కతో బయోగ్యాస్‌

  • మొదటి దశలో 52 చెరువుల శుద్ధికి కార్యప్రణాళిక
  • దశలవారీగా అన్ని చెరువుల్లోనూ పనులు
  • ఇక దోమలకు చెక్‌.. డ్రోన్లతో యాంటీ లార్వా ఆపరేషన్‌ 
  • జీహెచ్‌ఎంసీకి ఐఐసీటీ సహకారం..

ఐఐసీటీ సహకారంతో నగర చెరువుల్లో పేరుకుపోయిన గుర్రపుడెక్క ద్వారా బయోగ్యాస్‌, కంపోస్ట్‌ ఉత్పత్తి చేసేందుకు జీహెచ్‌ఎంసీ సన్నాహాలు చేస్తున్నది. దీనికోసం మొదటి దశలో 52 చెరువులను ఎంపిక చేశారు. దశలవారీగా అన్ని చెరువులనూ శుద్ధిచేయాలని నిర్ణయించారు. దీనివల్ల గుర్రపు డెక్క తొలగిపోయి దోమల సమస్య అదుపులోకి వస్తుందని జీహెచ్‌ఎంసీ భావిస్తున్నది. 

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : గ్రేటర్‌లో సుమారు 185 చెరువులు ఉండగా, అవి మురుగునీటితో నిండిపోయాయి. అంతేకాదు, గుర్రపుడెక్కతో కప్పుకొని దోమల ఉత్పత్తి కేంద్రాలుగా మారిపోయాయి. ముఖ్యంగా మలేరియా వంటి సీజనల్‌ వ్యాధులకు దోమలు ప్రధాన కారణం కావడంతో వర్షాకాలానికి ముందే దోమల నివారణ చర్యలకు జీహెచ్‌ఎంసీ శ్రీకారం చుట్టింది. గత ఆదివారం నుంచి ప్రతి ఆదివారం పది నిమిషాలపాటు ఇండ్లలో నిల్వ ఉన్న నీటిని శుభ్రం చేసుకోవాలనే కార్యక్రమాన్ని మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో తాజాగా గుర్రపు డెక్కను తొలిగించేందుకు జీహెచ్‌ఎంసీ ఓ కార్యప్రణాళికను సిద్ధం చేసింది. ఇటీవలే అధికారులు నగరంలోని చెరువులను ప్రత్యక్షంగా పరిశీలించి గుర్రపుడెక్క సమస్య అత్యధికంగా ఉన్న 52 చెరువులను గుర్తించారు. మొదటిదశలో వీటిని పూర్తిగా శుద్ధి చేయాలని నిర్ణయించారు. అయితే గుర్రపు డెక్క ద్వారా బయోగ్యాస్‌, కంపోస్ట్‌ ఎరువు తయారు చేసేందుకు ఐఐసీటీ ముందుకొచ్చింది. దీంతో జీహెచ్‌ఎంసీ చెరువుల్లో గుర్రపుడెక్కను తొలిగించి ఐఐసీటీకి సరఫరా చేయాలని నిర్ణయించింది. మొదటి దశలో 52 చెరువుల్లో గుర్రపుడెక్క తొలిగింపు చర్యలు చేపడుతామని, అనంతరం మిగిలిన చెరువుల్లో సైతం పనులు చేపడుతామని ఓ ఉన్నతాధికారి తెలిపారు. చెరువులు శుభ్రం కావడమే కాకుండా దోమల నివారణకు కూడా ఈ చర్య దోహదపడుతుందని పేర్కొన్నారు.

  డ్రోన్లతో యాంటీ లార్వా ఆపరేషన్‌

దోమల నివారణ కార్యప్రణాళికలో భాగంగా చెరువులతోపాటు మూసీలో సైతం డ్రోన్లతో యాంటీ లార్వా ఆపరేషన్లు చేపట్టాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. సమస్య అధికంగా ఉన్న ప్రాంతాల్లోని అన్ని చెరువుల్లో ముందుగా డ్రోన్లతో ఈ ఆపరేషన్‌ చేపట్టాలని, చెరువులు, కుంటల్లో గంబూసియా చేపలను, ఆయిల్‌ బాల్స్‌ను వదలాలని నిశ్చయించారు. అలాగే, మరింత సమస్యాత్మక ప్రాంతాల్లో మస్కట్‌ మిషన్లను కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.


logo