శనివారం 06 జూన్ 2020
Medchal - May 07, 2020 , 00:21:17

పోలీసన్నకు సలాం: మంత్రి మల్లారెడ్డి

పోలీసన్నకు సలాం: మంత్రి మల్లారెడ్డి

బోయిన్‌పల్లిలో పోలీసులకుసత్కారం, భోజన ఏర్పాట్లు

కంటోన్మెంట్‌, నమస్తే తెలంగాణ : లాక్‌డౌన్‌ అమలులో కంటికి కునుకులేకుండా శ్రమిస్తున్న  పోలీసుల సేవలు అమోఘమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. లాక్‌డౌన్‌ అమలులో పోలీసుల పాత్ర సవాల్‌గా మారిందన్నారు. బుధవారం బోయిన్‌పల్లి చెక్‌పోస్టు (మేడ్చల్‌ రహదారిపైన) వద్ద  విధులు నిర్వహిస్తున్న పోలీసులను మంత్రి ఘనంగా సత్కరించి, భోజనాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడారు. పోలీసులు 24 గంటలు కంటికి నిద్ర లేకుండా రోడ్ల మీద పహారా కాస్తున్నారని తెలిపారు. ఇలాంటి సేవలు అందిస్తున్న పోలీసులకు ఏం చేసినా తక్కువేనన్నారు. కరోనాను నియంత్రించేందుకు దేశంలోనే  మన రాష్ట్రం అత్యున్నత విధానాలు అవలంభిస్తుందన్నారు.  వైరస్‌ నిర్మూలనకు సీఎం కేసీఆర్‌ ప్రత్యేక కృషి చేస్తున్నారని వివరించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ టీఎన్‌ శ్రీనివాస్‌, బోర్డు సభ్యుడు పాండుయాదవ్‌, బేగంపేట ఏసీపీ నరేశ్‌రెడ్డి, బోయిన్‌పల్లి ఇన్‌స్పెక్టర్‌ అంజయ్య, కార్యక్రమ నిర్వాహకులు జక్కుల త్రిశూల్‌రెడ్డి, టింకుగౌడ్‌ పాల్గొన్నారు.  

 వీడియో జర్నలిస్టులకు మర్రి చేయూత

 జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి అన్నారు. బుధవారం బోయిన్‌పల్లిలోని తన నివాసంలో హైదరాబాద్‌లో పనిచేస్తున్న 50 మంది వీడియో జర్నలిస్టులకు రాజశేఖర్‌రెడ్డి బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కరోనా వైరస్‌ను లెక్కచేయకుండా సమాజహితం కోసం పనిచేస్తున్న జర్నలిస్టులను ప్రతి ఒక్కరూ ఆదుకోవాలన్నారు. కార్యక్రమంలో  తెలంగాణ వీడియో జర్నలిస్ట్‌ అసోసియేషన్‌ (టీవీజేఏ) అధ్యక్షుడు ప్రకాశ్‌, ప్రధాన కార్యదర్శి వనం నాగరాజు పాల్గొన్నారు.


logo