శనివారం 04 ఏప్రిల్ 2020
Medchal - Mar 19, 2020 , 04:17:28

ట్రావెల్‌ రంగానికి ‘కరోనా’ దెబ్బ

ట్రావెల్‌ రంగానికి ‘కరోనా’ దెబ్బ

- కోవిడ్‌ -19తో వందల కోట్లు డమాల్‌

- అంతర్జాతీయ పర్యటనలు రద్దుతో మార్కెట్‌ డీలా

- వైరస్‌ దాటికి పర్యాటకం విలవిల

- దేశీయ విమానయానంపై ప్రభావం

- హనీమూన్‌లకు వెళ్లేందుకు జంటల నిరాసక్తత

- శక్తి పీఠాలకు యథావిధిగా బుకింగ్స్‌

- సీజన్‌లో డిమాండ్‌ తగ్గుముఖం

కరోనా దెబ్బకు విమానయానం విలవిలలాడుతున్నది. ప్రతినెలా సుమారు రూ.200 కోట్ల వ్యాపారం జరుగుతుండగా కోవిడ్‌ -19 ప్రభావంతో ఒక్కసారిగా 80 శాతంపైగా తగ్గిపోయింది. విదేశీ, దేశీయ పర్యటనలకు వెళ్లేందుకు మంచి సీజన్‌ అయినప్పటికీ, విమానయాన సంస్థలు ప్యాకేజీలు తగ్గించిప్పటికీ ఎవరూ ఆసక్తి చూపడంలేదు. ఇంతకుముందే బుక్‌ చేసుకున్న వారుసైతం రద్దు చేసుకుంటున్నారు. కొన్ని దేశాలు విసాలను కూడా రద్దు చేస్తుండగా వీటి ప్రభావం పర్యటనలపై పడుతున్నది. ఇదిలా ఉండగా ఏసీ బస్సులు, రైళ్లలో ప్రయాణించేందుకు అనాసక్తి కనబరుస్తున్నారు. దీంతో దక్షిణమధ్య రైల్వేసైతం అనేక రైళ్లను రద్దుచేస్తున్నట్లు సమాచారం.

సిటీబ్యూరో, చందానగర్‌, (నమస్తే తెలంగాణ): ప్రపంచాన్ని భయపెట్టిస్తున్న కరోనా వైరస్‌ దెబ్బకు ట్రావెల్స్‌ రంగం కుదేలవుతుంది. చైనాలో పుట్టిన ప్రాణాంతక కరోనా వైరస్‌ ప్రపంచమంతా విస్తరిస్తున్న నేపథ్యంలో అనేక దేశాల రాకపోకలు స్తంభించాయి. చైనా తర్వాత దక్షిణ కొరియా, ఇటలీ, ఇరాన్‌లతో కలిపి ప్రపంచవ్యాప్తంగా 160కి పైగా దేశాలకు కరోనా విస్తరించింది. భారతదేశంలోని మహారాష్ట్ర, కెరళ, హర్యాన, ఢిల్లీ, కర్ణాటక, ఇతర రాష్ర్టాలతో పాటు తెలంగాణలోనూ కరోనా పాజిటీవ్‌ కేసులు పెరుగుతుండటంతో ఆ ప్రభావం పర్యాటక రంగంపై పడుతున్నది. కేంద్ర ప్రభుత్వం పలు దేశాలకు రాకపోకలను రద్దు చేయడంతో పాటు ఇతర దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఏయిర్‌పోర్టులోనే ఐసోలేషన్‌ ప్రక్రియ చేపడుతుండటంతో ప్రయాణికులు తమ టూర్‌లను రద్దు చేసుకుంటున్నారు.

సమ్మర్‌ వెకేషన్స్‌కి నగర ప్రజలు దూరం...

ప్రతి ఏటా మార్చి చివరి నుంచి జూన్‌ రెండో వారం వరకు నగర ప్రజలు సమ్మర్‌వెకేషన్స్‌ కోసం సుదూర ప్రాంతాలకు వెళ్తుతుంటారు. విదేశాలతో పాటు దేశంలో అనేక శీతల ప్రదేశాలకు ప్రయాణమవుతుంటారు. ముఖ్యంగా కులుమనాలి, జమ్మూకశ్మీర్‌, ఊటి, కొడైకెనాల్‌, కూర్గ్‌, గోవాలతో పాటు అనేక ప్రాంతాల బూకింగ్స్‌ ఫిబ్రవరి నుంచే జోరందుకుంటాయి. అయితే కరోనా దెబ్బతో ఈ ఏడాది బుక్సింగ్‌ పూర్తిగా నిలిచిపోయాయి. తప్పని పరిస్థితి అయితే తప్పా దూరప్రాంతాలకు వెళ్లొద్దనే ఆలోచనలో ప్రజలు ఉన్నందున, ఆ ప్రభావం ట్రావెల్స్‌ రంగంపై పడుతున్నది. నగరంలోని కొన్ని ట్రావెల్స్‌ రోజుకు వందల బుకింగ్స్‌ చేసేవారు ప్రస్తుతం ఆ సంఖ్య డబుల్‌ డిజిట్‌కు చేరుకోకపోవడం విడ్డూరం. 

ఏసీ ప్రయాణంపై అనాసక్తి.. రైళ్ళు, బస్సుల్లో తగ్గిన రద్దీ

కరోనా కూల్‌ వాతావరణంలో విజృంభిస్తుందన్న ప్రచారం ఉండటంతో ఏసీ ప్రయాణంపై ప్రయాణికులు అనాసక్తి కనబరుస్తున్నారు. ఏసీ స్లీపర్‌క్లాస్‌లకు బుకింగ్‌లు తగ్గుతున్నాయి. అదేవిధంగా ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో జరిగే బుకింగ్స్‌ కూడా తగ్గుతున్నాయి. తగిన బుకింగ్స్‌ లేకపోవడంతో చాలా రైళ్లను దక్షిణమధ్య రైల్వే రద్దు చేస్తున్నది. రద్దీ ప్రదేశాల్లో కూడా ఉండకూడదనే ఉద్దేశ్యంతో చాలా మంది ప్రయాణానికే మొగ్గు చూపుతున్నారు. ఇక ఆర్టీసీ ఏసీ బస్సుల్లో కూడా రద్దీ తక్కువగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. రాజధాని, గరుడప్లస్‌ వంటి బస్సుల్లో తక్కువ ఓఆర్‌ నమోదవుతున్నది. రాష్ట్రంలోనే తిరుగుతున్న ఏసీ బస్సులే కాకుండా షిర్డీ, ముంబాయి, తిరుపతి, అమరావతి, విశాఖపట్నం, నెల్లూరు, బెంగళూరు, చెన్నైకి నడుపుతున్న బస్సుల్లో చాలా ట్రిప్పులను రద్దు చేసినట్లు తెలిపారు. సూపర్‌లగ్జరీ, డీలక్స్‌, ఎక్స్‌ప్రెస్‌ బస్సులకు గిరాకీ పెరుగుతున్నట్లు చెప్పారు. ఇక ప్రైవేట్‌ బస్సుల అసోసియేషన్‌ అధ్యక్షుడు గోవిందరాజు మాట్లాడుతూ ప్రతీరోజు నగరం కేంద్రంగా వందకుపైగా బస్సులు వేర్వేరు రూట్లలో ఇతర రాష్ర్టాలకు బయలుదేరుతాయని, ప్రస్తుతం 15 నుంచి 20 బస్సులు కూడా వెళ్ళడం లేదని అన్నారు. ఇక వివాహాలకు కూడా ఏసీ బస్సుల డిమాండ్‌ లేదని అన్నారు.

విమానయానానికి వందల కోట్ల నష్టం

 హైదరాబాద్‌ నుంచి ఇతర దేశాలకు, దేశంలోని ఇతర ప్రాంతాలకు వెళ్ళేవారి సంఖ్య దారుణంగా పడిపోయింది. పర్యాటకులు విదేశీ విమానయానానికి మొగ్గు చూపకపోతుండటంతో ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు మార్కెట్‌కు సుమారు వందల కోట్ల రూపాయల నష్టం జరిగింది. కేవలం హైదరాబాద్‌ కేంద్రంగా విదేశీ, దేశీయ విమానయానాల వ్యాపారం ప్రతీనెలా రూ.180 నుంచి రూ.200 కోట్ల వరకు జరుగుతుండేది. కరోనా వ్యాధి ప్రబలుతుందనే ప్రచారం ఊపందుకోవడంతో విదేశీ ప్రయాణాలను చాలా మంది వాయిదా వేసుకుంటున్నారు. కొంత మంది పర్యటన రద్దు చేసుకుంటున్నారు. ముఖ్యంగా శ్రీలంక , సింగపూర్‌, హాంకాంగ్‌, బ్యాంకాక్‌, దుబాయ్‌, మలేషియా, యూరఫ్‌, అమెరికా, ఇంగ్లాండ్‌ వంటి దేశాల పర్యటనకు తరుచూ వెళ్ళే పర్యాటకులు సైతం వాయిదాలు వేసుకుంటున్నారు. 

ఫిబ్రవరి 2న హాంగ్‌కాంగ్‌లో ఉండాల్సింది

మా ఆర్‌ఓ ప్రాడక్ట్స్‌కు సంబంధించిన ముడిసరుకు కొనుగోలు కోసం ఫిబ్రవరిలో చైనా మీదుగా హాంగ్‌కాంగ్‌ వెళ్లాల్సి ఉండే. కానీ కరోనా వైరస్‌ ప్రతాపంతో నా ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నా. మా కస్టమర్స్‌ ఈ జాప్యాన్ని అర్థం చేసుకుంటారని బావిస్తున్నా.

- పిడుగు శివ ప్రసాద్‌, హెచ్‌ఎం వాటర్‌ కంపోనెంట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అధినేత

భారీ ప్రాజెక్ట్‌కు కరోనా దెబ్బ

ఒక భారీ ప్రాజెక్ట్‌ కోసం గత నెల బీజింగ్‌ పట్టణానికి వెళ్లాల్సి ఉండే. ఈ క్రమంలో టికెట్‌, విసా అన్ని సిద్ధమయ్యాయి. కానీ కరోనా ఎఫెక్ట్‌తో వెళ్లలేని పరిస్థితి. మా సంస్థకు మంచి పేరు తెచ్చిపెట్టే ప్రాజెక్ట్‌ లభిస్తుంది అనుకునే సమయంలో కరోనా దెబ్బతీసింది.

-బ్రాహ్మణపల్లి కిశోర్‌కుమార్‌, ప్రాజెక్ట్స్‌ మేనేజర్‌, అవన్‌ ఇంజినీరింగ్‌ డ్రాఫ్టింగ్‌ సర్వీస్‌.

క్యాన్సలేషన్స్‌ చూస్తుంటే భయమేస్తున్నది...

కరోనా దెబ్బతో మా వ్యాపారం పూర్తిగా దెబ్బతిన్నది. గతంలో బుక్‌ చేసుకున్న వారు జనవరి రెండో వారం నుంచి తమ టూర్‌ ప్యాకేజీలను రద్దు చేస్తూ వస్తున్నారు. ఇప్పుడైతే కొత్త బుకింగ్‌లే లేవు. ఈ పరిస్థితి ఇంక ఎంతకాలం కొనసాగుతుందో అర్థం కావడం లేదు. 

- ఎస్‌.రామకృష్ణ, గ్రీన్‌ వెకేషన్స్‌ ఎల్‌ఎల్‌సీ, హిమాయత్‌నగర్‌.

ఇస్తాంబుల్‌, బాకు టూర్‌ క్యాన్సల్‌...

నా స్నేహితుడి పుట్టిన రోజు వేడుకల కోసం జూన్‌లో ఇస్తాంబుల్‌, బాకు(అజర్‌బాయ్‌జాన్‌) వెళ్లేందుకు మంచి టూర్‌ ప్యాకేజీ బుక్‌ చేసుకున్నాం. ఇంతలో కరోనా ప్రపంచమంతా దుమ్ము రేపుతుంది. పరిస్థితుల వల్ల టూర్‌ క్యాన్సల్‌ చేసుకోవాల్సి వస్తున్నందుకు చింతిస్తున్నాం.

- వొట్ర కిశోర్‌, చందానగర్‌. 

ట్రావెల్‌ ఏజెంట్స్‌కు కోలుకోలేని దెబ్బ

కరోనా వైరస్‌ క్రమంగా ప్రపంచమంతటా విస్తరిస్తుండటం బాధాకారం. ఇప్పటికే ఆన్‌లైన్‌ బుకింగ్స్‌తో కలవరపడుతున్న ట్రావెల్‌ ఏజెంట్స్‌కు కరోనా వైరస్‌తో కోలుకోలేని దెబ్బ పడింది. మంచి సీజన్‌ అయిన సమ్మర్‌లో ఇలాంటి పరిస్థితులు తలెత్తడం దురదృష్టకరం. 

- సాయిబాబు బద్దం, ప్రధాన కార్యదర్శి, ఏపీ-తెలంగాణ, ట్రావెల్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా.


logo