సోమవారం 30 మార్చి 2020
Medchal - Mar 19, 2020 , 04:13:58

ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం..మోసం

ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం..మోసం

రూ. 20 కోట్ల ప్రాజెక్ట్‌ అంటూనమ్మబలికాడు..

రూ.58లక్షలు దోచుకున్న సైబర్‌ మోసగాడు 

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ఓ యువతికి పరిచయం అయిన ఒక యువకుడు సాప్ట్‌వేర్‌ కంపెనీ పెడుతున్నానంటూ నమ్మించి రూ. 58.5 లక్షలు మోసం చేశాడు.బాధితురాలి నుంచి రూ. 8.5 లక్షలు తీసుకోగా, ఆమె ద్వారా పరిచయం అయిన వారి బంధువులు ఇద్దరి వద్ద నుంచి రూ.50 లక్షలు స్వాహా చేశాడు. అయితే బుధవారం తనను హర్ష అనే వ్యక్తి రూ. 8.5 లక్షలు మోసం చేశాడంటూ బాధితురాలు సీసీఎస్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసుల కథనం ప్రకారం.. లోయర్‌ ట్యాంక్‌బండ్‌కు చెందిన ఓ యువతికి ఇన్‌స్టాగ్రామ్‌లో హర్ష అనే పేరుతో ఒక గుర్తుతెలియని వ్యక్తి పరిచయం అయ్యాడు. ఇద్దరు కొన్నాళ్లు స్నేహంగా చాటింగ్‌ చేశారు. ఇలా కొన్ని రోజుల తరువాత అత్యవసరంగా డబ్బులు అవసరమున్నాయని హర్ష రెండు మూడు సార్లు రూ. 10వేల చొప్పున తీసుకొని, వాటిని తిరిగి ఇచ్చేశాడు. దీంతో ఆ యువతికి అతనిపై నమ్మకం బాగా పెరిగింది. 

రూ. 20 కోట్ల ప్రాజెక్ట్‌ అంటూ....!

 కొన్ని రోజుల తరువాత తనకు రూ.20 కోట్ల ప్రాజెక్ట్‌ వచ్చిందని,సాప్ట్‌వేర్‌ కంపెనీ పెట్టానంటూ ఈ సంతోషాన్ని నీకే ముందుగా చెబుతున్నానంటూ నమ్మించాడు.కంపెనీ సీఈఓగా నేను వ్యవహరిస్తున్నానని,అయితే భాగస్వా ముల నుంచి కొంత ఆర్థిక సహాయం అడిగానని, వారి నుంచి రాలేదని ఆవే దన వ్యక్తం చేశాడు. తనకు కొద్దిగా పెట్టుబడి పెడితే వచ్చేదాంట్లో లాభాలు పంచడం కానీ, ఇచ్చిన డబ్బుకు రెట్టింపు ఇవ్వడం చేస్తానంటూ మాయ  మాటలు చెప్పాడు. అతని మాయమాటలకు బోల్తా పడ్డ యువతి, అతడు సూచించినట్లు రెండు దఫాలుగా రూ.8.5 లక్షలు అతడి బ్యాంకు ఖాతాలకు బదిలీ చేసింది.అంతటితో ఆగకుండా ఎవరైనా తన ప్రాజెక్ట్‌కు భాగస్వాములు ఉంటే మీ వాళ్లను పరిచయం చేయమంటూ హర్ష అడిగాడు. భారీగా లాభాలు వస్తాయి..చేతిలో ప్రాజెక్ట్‌ ఉందంటూ నమ్మబలికాడు. దీంతో ఆ యువతి నగర శివారు ప్రాంతంలో ఉండే తమ బంధువులిద్దరినీ పరిచయం చేసింది. వారితోను హర్ష ఇన్‌స్టాగ్రామ్‌లో చాటింగ్‌ చేశాడు. వారిద్దరి నుంచి కూడా రూ. 50లక్షలు స్వాహా చేశాడని బాధితురాలు పోలీసులకు తెలిపింది. అయితే తనను గుర్తుతెలియని వ్యక్తి రూ.8.5 లక్షలు మోసం చేశాడంటూ బుధవారం ఆమె సైబర్‌ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉండగా ఇక్కడ బాధితులు ఎవరు కూడా సైబర్‌ఛీటర్‌ను నేరుగా కలువలేదు. కేవలం ఇన్‌స్టాగ్రామ్‌లో చాటింగ్‌తోనే గుడ్డిగా నమ్మి లక్షల రూపాయలు పొగొట్టుకున్నారు. 


logo