గురువారం 02 ఏప్రిల్ 2020
Medchal - Mar 19, 2020 , 04:10:48

‘మార్చి 31’ గడువు సాధ్యమేనా?

‘మార్చి 31’ గడువు సాధ్యమేనా?

-నెలాఖరు దాటినా రిజిస్ట్రేషన్‌ చేయాల్సిందే

-బీఎస్‌4 వాహనాల విషయంలో..

-ఎదురవుతున్న సాంకేతిక సమస్య

-స్పష్టత ఇవ్వని ఆర్టీఏ ఉన్నతాధికారులు

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: బీఎస్‌ 4 వాహనాల రిజిస్ట్రేషన్‌ మార్చి 31వ తేదీలోగా పూర్తిచేయాల్సిందే.ఇది రవాణాశాఖ నుంచి అందుతున్న ఆదేశాలు. డీలర్లు చేస్తున్న పెద్ద ఎత్తున చేస్తున్న ప్రచారం.కానీ మోటార్‌ వెహికల్‌ చట్టం ప్రకారం గడువుదాటినా బీఎస్‌4 వాహనాన్ని రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చని చెబుతున్నది. ఈ విషయాన్ని  గవర్నమెంట్‌ ఆఫ్‌ తెలంగాణ స్టేట్‌ ట్రాన్స్‌పోర్డు డిపార్ట్‌మెంట్‌ వెబ్‌సైట్‌లో మోటారు వెహికల్‌ చట్టం స్పష్టం చేస్తున్నది. ఐతే దీని ఆధారంగా గడువుదాటినా వాహనాలను రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. చట్టం ప్రకారం ఏ వాహనం కొనుగోలు చేసినా ఇన్‌వాయిస్‌ జారీ అయిన 30 రోజుల వరకు వాహనాన్ని రిజిస్ట్రేషన్‌ చేసుకునే వీలుంది. మోటారు వెహికల్‌ చట్టాన్ని అనుసరించి టీఆర్‌జారీ అయ్యాక సంవత్సరం తర్వాత కూడా పర్మినెంట్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకునే వీలు మోటారు వాహనాల చట్టంలో పొందుపరుచబడ్డాయి. వీటిని స్వయంగా రవాణాశాఖ వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు. 30 రోజుల్లోగా ఐతే ఎటువంటి అపరాధ రుసుము లేకుండా రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. మూడు నెలల వరకైతే అపరాధ రుసుము రూ.25, 6 నెలలలోపు రిజిస్ట్రేషన్‌ చేసుకుంటే రూ.50 అపరాధ రుసుము,  9 నెలల లోపైతే రూ.75 ఒక సంవత్సరం ఆపైన ఐతే రూ.100 అపరాధ రుసుముతో టీఆర్‌ నంబరు ఉన్న ప్రతీ వాహనాన్ని రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం మార్చి నెల దాటిన తర్వాత బీఎస్‌4 వాహనాల రిజిస్ట్రేషన్‌ లేదని స్పష్టంగా ఉన్నప్పటికీ మోటర్‌ వెహికల్‌ యాక్ట్‌(ఎంవీఏ) మాత్రం టెంపరరీ రిజిస్ట్రేషన్‌ జనరేట్‌ అయితే ఎప్పుడైనా రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చని చెబుతున్నది. ఈ విషయంపై కొత్తగా బాధ్యతలు తీసుకున్న కమిషనర్‌ వద్ద రవాణాశాఖ అధికారులు చర్చలు జరిపినా దీనిపై ఇప్పటివరకు కిందిస్థాయి వరకు ఆదేశాలు అందలేదు. ఈ విషయంపై స్పష్టత ఇవ్వకపోవడంతో డీలర్లు  మార్చి నెలలో కూడా అమ్మకాలు సాగిస్తున్నారు.

కొనసాగుతున్న వాహన అమ్మకాలు

గడువు ముగుస్తున్నప్పటికీ డీలర్లు తమ వద్ద ఉన్న బీఎస్‌4 వాహనాలను ఇంకా విక్రయిస్తున్నారు. ఈ నెలలో ఏ తేదీన వాహనాన్ని విక్రయించినా  టీఆర్‌(టెంపరరీ రిజిస్ట్రేషన్‌) జనరేట్‌ చేసిన తేదీ నుంచి నెలరోజుల్లోగా అపరాధ రుసుము లేకుండా చేసుకోవచ్చనే ఉద్దేశంతో డీలర్లు అమ్మకాలు సాగిస్తున్నారు. డిస్కౌంట్లు ఇస్తామంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ అమ్మకాలు కొనసాగిస్తున్నారు. మార్చి చివరి వరకు అమ్మకాలు కొనసాగిస్తే కొనుగోలు చేసిన వారి పరిస్థితేంటనే చర్చ కూడా జరుగుతున్నది. ఈ వ్యవహారం మరో సమస్యకు  దారితీస్తుందని రవాణాశాఖకు చెందిన  పేరు రాయడానికి ఇష్టపడని ఓ సీనియర్‌ అధికారి ఆవేదన వ్యక్తం చేశారు. 


logo