మంగళవారం 31 మార్చి 2020
Medchal - Mar 19, 2020 , 04:08:52

750 మందిపై నిఘా

750 మందిపై నిఘా

-క్వారంటైన్‌లో ఉన్న వారి ఇండ్లల్లో ప్రత్యేక బృందాల తనిఖీ

-‘కరోనా’ వ్యాప్తి చెందకుండా జీహెచ్‌ఎంసీ పకడ్బందీ చర్యలు

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : చైనా, ఇటలీ, ఇరాన్‌, మలేషియా, అమెరికా తదితర 14 కరోనా ప్రభావిత దేశాల నుంచి నగరానికి వచ్చిన వారిపై అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. మంగళవారానికి ఈ తరహా వ్యక్తులు 750 మందిని గుర్తించిన అధికారులు వారుండే ఇండ్లపై ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేశారు. వారు బయట తిరగకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఆయా దేశాల నుంచి నగరానికి వస్తున్న వారికి అధికారులు విమానాశ్రయంలోనే పరీక్షలు నిర్వహిస్తూ జాగ్రత్త చర్యలు సూచిస్తున్నారు. కనీసం 14 రోజులపాటు ఇంటి నుంచి బయటకు రాకుండా హోమ్‌ క్వారంటైన్‌ చేసుకోవాలని కోరుతున్నారు. ఇలా ఇప్పటి వరకు కరోనా ప్రభావిత దేశాల నుంచి 750 మంది నగరానికి వచ్చినట్లు గుర్తించిన అధికారులు ప్రత్యేక బృందాల ద్వారా వారి యోగక్షేమాలు తెలుసుకోవడంతోపాటు వారు క్వారంటైన్‌లో ఉన్నారా? లేక బయట తిరుగుతున్నారా? అనేది పరిశీలిస్తున్నారు. దీని కోసం ఇప్పటికే జీహెచ్‌ఎంసీ, వైద్య-ఆరోగ్య, పోలీసు తదితర విభాగాలతో వార్డుల వారీగా 150 బృందాలను ఏర్పాటు చేసిన విషయం విదితమే.

 విదేశాల నుంచి వచ్చినవారు ఇండ్ల నుంచి బయటకు వెళ్లకుండా ఉండేలా చర్యలు చేపట్టారు. 14 కరోనా ప్రభావిత దేశాల నుంచి వచ్చిన 750 మంది ఇండ్లను బుధవారం ఈ బృందాలు తనిఖీ చేసి వారికి జాగ్రత్త చర్యలు సూచించినట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు. ఈ 750 మందిలో ఎవ్వరికీ కరోనా లక్షణాలు లేవని, ముందు జాగ్రత్త చర్యగానే వారిని క్వారంటైన్‌లో ఉండాలని సూచించినట్లు వారు పేర్కొన్నారు. ఒకవేళ ఎవరైనా క్వారంటైన్‌ కాకుంటే వారిని ఐసోలేషన్‌ సెంటర్లకు తరలించనున్నట్లు తెలిపారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని అన్ని సర్కిళ్లలోనూ వీరు ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ నెలాఖరు వరకు కరోనాపై ప్రచారపర్వం, జాగ్రత్త చర్యలు కొనసాగుతాయని, అనంతరం పరిస్థితిని బట్టి తదుపరి నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటుందని అధికారులు వివరించారు. ఉన్నత చదువులు, ఉద్యోగాలు, వ్యాపారం, పర్యాటకం తదితర వాటి కోసం ఆయా దేశాలకు వెళ్లి కరోనా కారణంగా వారు తిరిగి స్వదేశానికి చేరుకుంటున్నట్లు తెలిపారు.

విస్తృతంగా ఐఈసీ కార్యకలాపాలు

కరోనా జాగ్రత్త చర్యల పట్ల ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు ఇన్ఫర్మేషన్‌-ఎడ్యుకేషన్‌-కమ్యూనికేషన్‌ (ఐఈసీ) కార్యకలాపాలను మరింత విస్తృతం చేసినట్లు జీహెచ్‌ఎంసీ తెలిపింది. ఇందులో భాగంగా ఇంటింటికీ కరపత్రాల పంపిణీ చేయడంతోపాటు నగరమంతా హోర్డింగులను ఏర్పాటు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. అంతేకాకుండా పారిశుధ్య కార్మికులందరికీ రక్షణ సామగ్రితో కూడిన కిట్‌లను పంపిణీ చేసినట్లు తెలిపారు. 


logo
>>>>>>