సోమవారం 06 ఏప్రిల్ 2020
Medchal - Mar 19, 2020 , 03:57:25

‘దిల్‌' భూముల కబ్జా

‘దిల్‌' భూముల కబ్జా

-కేసులు పెడుతున్నా మారని అక్రమార్కుల వైఖరి  

-కఠిన చర్యలు తీసుకుంటాం : తహసీల్దార్‌ 

దుండిగల్‌, నమస్తేతెలంగాణ : అది కోట్లాది రూపాయల విలువ చేసే ప్రభుత్వ స్థలం. బాలానగర్‌-నర్సాపూర్‌ ప్రధాన రహదారి పక్కనే ఉన్న ఈ స్థలం గజం ధర రూ.50వేల పైచిలుకే ఉంటుంది. కొన్నేండ్ల కిందట ఈ స్థలాన్ని అప్పటి ప్రభుత్వం దిల్‌ సంస్థకు అప్పగించింది. తదనంతరం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించడం, ఈ స్థలాన్ని తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నట్లు ఊహాగానాలు వెల్లువెత్తాయి. దీంతో ఆ స్థలాన్ని రెవెన్యూ అధికారులు గానీ, దిల్‌సంస్థకు చెందిన ప్రతినిధులు గానీ సంరక్షణపై పట్టించుకోకపోవడంతో సదరు స్థలంపై కబ్జాదారుల కన్నుపడింది. అనుకున్నదే తడవుగా కబ్జాదారులు ముఠాలుగా ఏర్పడి ఎవరికి తోచినంత వారు ఆక్రమించి అమాయకులకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే.. కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గం గాజులరామారం రెవెన్యూ పరిధి, సూరారం కాలనీ, సాయిబాబానగర్‌లోని సర్వే నం.49/ 6-8లోని 11 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని పదేండ్లకిందట అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం దిల్‌సంస్థకు అప్పగించింది. కాలక్రమంలో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించడం, తదనంతరం ఇక్కడ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది. సదరు స్థలాన్ని ప్రభుత్వం తిరిగి స్వాధీనంలోకి తీసుకుందని ఊహాగానాలు వెలువడ్డాయి. అదే సమయంలో అటు రెవెన్యూ అధికారులు, ఇటు దిల్‌ సంస్థ ప్రతినిధులు సైతం సదరు స్థలాన్ని పరిరక్షించే విషయంలో నిర్లక్ష్యం వహించారు. ఫలితంగా కబ్జాదారులు రెచ్చిపోయారు. ఎవరికి వారుగా ఆక్రమించి అమాయకులకు అంటుగడుతూ సొమ్ము చేసుకుంటున్నారు.  

అడ్డుకునేందుకు వెళితే దాడులు : ఆక్రమణకు గురైన అనంతరం కండ్లు తెరిచిన దిల్‌ సంస్థ ప్రతినిధులు పది రోజుల క్రితం పోలీసులు, రెవెన్యూ అధికారుల సాయంతో కూల్చివేతలకు శ్రీకారం చుట్టారు. సదరు నిర్మాణాల్లో నివాసముంటున్న ప్రజలను రెచ్చగొట్టి అధికారులపై దాడులు చేసేలా పురిగొలిపినట్లు తెలుస్తుంది. దీంతో అధికారులు నామమాత్రంగా కూల్చివేతలు చేపట్టి చేతులు దులుపుకోవడంతోపాటు పలువురిపై దుండిగల్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. బాలానగర్‌ జోన్‌ డీసీపీ పద్మజా సైతం సదరు స్థలాలను మూడురోజలు క్రితం పరిశీలించారు. కాగా, స్థలం హద్దులు గుర్తించిన అధికారులు మిగిలిన స్థలంలో ఇటీవల బోర్డులు సైతం ఏర్పాటు చేశారు. కానీ వారం రోజుల్లోపే అధికారులు ఏర్పాటు చేసిన బోర్డులను తొలిగించి అక్రమార్కులు రాత్రికి, రాత్రే నిర్మాణాలు చేపడుతూ అధికారులకు సవాలు విసురుతున్నారు.  

కఠిన చర్యలు తీసుకుంటాం : తహసీల్దార్‌

ఈ విషయమై కుత్బుల్లాపూర్‌ తహసీల్దార్‌ గౌరీవత్సలను వివరణ కోరగా, సర్వేనం. 49లోని స్థలం పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నాం. ఇందులో భూకబ్జాలకు పాల్పడుతున్న ఐదుగురిపై కేసులు కూడా పెట్టాం. దిల్‌ భూముల రక్షణకు తహసీల్దార్‌ కార్యాలయం నుంచి ఇద్దరు వీఆర్‌ఏలు, దిల్‌సంస్థల నుంచి నలుగురు ఫీల్డ్‌స్టాప్‌తోపాటు మరో ఇద్దరు పోలీసులు 24గంటలు కాపలా ఉంటున్నారు. బోర్డులు తొలిగించిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటాం.


logo