బుధవారం 01 ఏప్రిల్ 2020
Medchal - Mar 16, 2020 , 02:53:35

నీకు నేను..నాకు నువ్వు..

నీకు నేను..నాకు నువ్వు..

వివిధ కారణాలతో ఒంటరైన జీవితాలు..వృద్ధాప్యంలో తోడును కోరుకుంటున్నాయి. అర్థం చేసుకునే మనసు ఉంటే చాలు.. ‘నీకు నేను.. నాకు నువ్వు’..అంటూ.. జీవిస్తామంటున్నాయి. నేనున్నానంటూ.. ఆప్యాయంగా పలుకరించే భాగస్వామి కోసం పరితపిస్తున్నాయి. అలాంటి వారి కోసం ఎల్డర్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో ఏవీ కాలేజీలో ఆదివారం నిర్వహించిన పెద్దల స్వయంవరానికి విశేష స్పందన వచ్చింది. ఈ వేడుకకు అనేక మంది తరలివచ్చి....తాము ఎదుర్కొంటున్న సమస్యలు, మనోభావాలను వ్యక్తపరిచారు. తమకు బాసటగా నిలిచే తోడు కోసం అన్వేషించారు.

  • వృద్ధాప్యంలో తోడు కోసం అన్వేషణ
  • ఎల్డర్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో పెద్దల స్వయంవరానికి విశేష స్పందన
  • తరలివచ్చిన 300 మంది పురుషులు, 20 మందికి పైగా మహిళలు

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: ఎల్డర్స్‌ క్లబ్‌ ఇంటర్నేషనల్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో దోమలగూడలోని ఏవీ కాలేజీలో ఆదివారం పెద్దల స్వయంవరం వేడుకగా జరిగింది. ఈ కార్యక్రమానికి 50 ఏండ్లు పైబడిన  300 పురుషులు, 20 మందికి పైగా మహిళలు హాజరయ్యారు. తమ తోడు కోసం అన్వేషించారు. 


అభిప్రాయాలు కలిసి...

పెద్దల స్వయంవరంలో ఉప్పల్‌కు చెందిన విజయమ్మ, బాగ్‌లింగంపల్లికి చెందిన రిటైర్డ్‌ ఇంజినీర్‌ ఈశ్వర్‌ప్రసాద్‌ అభిప్రాయాలు కలిసి ఒక్కటయ్యారు. ఈ స్వయంవరం వేదికగా ఒక్కటవ్వాలని భావించామని వాళ్లు తెలిపారు. ఈ రోజే విజయమ్మను చూశానని ఉదయం నుంచి ఆమెతో మాట్లాడి ఒక అభిప్రాయానికి వచ్చానని ఈశ్వర్‌ప్రసాద్‌ చెప్పారు. ఇదిలా ఉంటే మిగిలిన సభ్యులు వారి వివరాలతో పరిచయ కార్యక్రమంలోపాల్గొన్నారు. చాలా వరకు ఇంట్లో చెప్పకుండానే స్వయంవరానికి హాజరైనట్లు తెలుపడం విశేషం. కొంతమంది స్వయంవరం ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి వచ్చామన్నారు. కాగా, పెండ్లికి ముందు వారిచ్చిన వివరాలను ఎల్డర్స్‌ క్లబ్‌ సభ్యులు పరిశీలించాకే..వివాహాన్ని నిర్ణయించనున్నారు. అన్ని సక్రమంగా ఉంటేనే చట్టబద్ధంగా ఒక్కటయ్యేలా ఏర్పాట్లు చేస్తారు. 


చివరి దశలో మనోవేదనకు..

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ జి. చంద్రయ్య మాట్లాడుతూ.. వృద్ధుల సమస్యలు ఎవరూ పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. చివరి దశలో వారు  తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని ఆవేదన చెందారు. పెద్దలు ఒకటి కావాలనుకోవడం శుభపరిణామని, వివాహం చేసుకుంటేనే జీవితానికి ఓ అర్థం ఉంటుందన్నారు. తప్పుడు సమాచారం ఇచ్చి పెండ్లి చేసుకుని మోసం చేయాలని చూసే వారు స్వయంవరంలో పాల్గొన వద్దని హితవుపలికారు. ఇప్పటికే వారి జీవితాల్లో ఎన్నో కష్టాలను, మోసాలను చూశారని.. మళ్లీ మోసపోవాలని వారు అనుకోవడం లేదన్నారు. కుటుంబంలో ఎలాంటి గొడవలు, బాధలు లేకుండా వారిని మెప్పించి పెండ్లి చేసుకోవాలన్నారు. ఎవరైనా కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోతే ఎల్డర్స్‌ క్లబ్‌ బాధ్యత తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎల్డర్‌ క్లబ్‌ ప్రతినిధులు కృష్ణారెడ్డి, ఎం. రాజేశ్వరీ తదితరులు పాల్గొన్నారు. 


 వివరాలు తెలుసుకున్నాకే....

తోడు కోరుకోవడం అంటే భరోసా కావాలనుకోవడం. అయితే పెండ్లి నిర్ణయించే ప్రక్రియలో ఇరువురు చెప్పే విషయాలను పరిశీలించాకే చట్ట బద్ధంగా ఎలాంటి సమస్యలు లేవనుకున్నప్పుడే వివాహం చేసుకోవడం మంచిది. భార్య ఉండగా, మరో పెండ్లి చేసుకోవడం నేరం. స్వయంవరంలో పాల్గొన్న వాళ్లందరి వివరాలు తెలుసుకున్నాకే ముందుకు వెళితే బాగుంటుందని నా అభిప్రాయం. ఒక్కొక్కరికీ ఒక్కో అభిప్రాయం ఉంటుంది. వారు ఏ పరిస్థితుల్లో తోడు కావాలనుకుంటారో తెలుసుకోవాలి.  

- ఎం. వెంకటేశ్వరీ, ప్రముఖ న్యాయవాది


అందరూ స్థిరపడ్డాకే...

కుటుంబంలో అందరూ స్థిరపడ్డాక.. తనకు తోడు అవసరమనుకున్నప్పుడు భాగస్వామి కోసం ప్రయత్నాలు చేయడంలో తప్పులేదు. అయితే మనల్ని నమ్ముకున్న పిల్లల విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నాకే నిర్ణయం తీసుకోవాలి. కొంతమంది తమ పిల్లల గురించి ఆలోచించరు. పెండ్లి చేసుకోవడానికే ఆసక్తి చూపిస్తారు. అలాంటి మనస్తత్వం ఉన్న వాళ్లు ఒక్క పెండ్లితో ఆగరు. అలాంటి వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

- డాక్టర్‌ అదురి రాయ్‌, సీనియర్‌ జర్నలిస్టు


అనుమతి తప్పనిసరి.. 

మలిదశలో సహచరి లేకుండా జీవించడం చాలా కష్టం. పిల్లలు ఎక్కడో స్థిరపడుతారు. ఇంట్లో ఒక్కరే మిగులుతారు. అలాంటి పరిస్థితులు వారికి నరకం చూపిస్తాయి. అందుకే తోడు కోరుకోవడంలో తప్పు లేదని నా అభిప్రాయం. అయితే పిల్లల అనుమతి తప్పనిసరి. ఈ వయసులో వారికి నచ్చని పనులు చేసి వారిని బాధించడం సరైనది కాదు. కొందరు పిల్లలు వారి తల్లిదండ్రులకు వివాహాలు చేస్తున్నారు. ఇది మంచిదే. అయితే అబద్ధాల పునాదుల మీద జీవితాలు నిలబడవు.

- రాధాకృష్ణ, కోదాడ


logo
>>>>>>