శనివారం 04 ఏప్రిల్ 2020
Medchal - Mar 16, 2020 , 02:48:54

‘కరోనా’ కట్టడే.. లక్ష్యం

‘కరోనా’ కట్టడే.. లక్ష్యం
  • ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా జీహెచ్‌ఎంసీ పకడ్బందీ చర్యలు

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : రోజురోజుకూ కంగారు పెట్టిస్తున్న కరోనా వైరస్‌ను పూర్తిగా కట్టడి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. కరోనా మహమ్మారి నియంత్రణకు పకడ్బందీ చర్యలు తీసుకున్నది. ప్రధానంగా శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రమంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. విదేశాల నుంచి వచ్చే వారిని క్యారంటైన్‌ చేసేందుకు గచ్చిబౌలి స్టేడియంలో గదులను ఎంపిక చేసింది. ప్రభుత్వ దవాఖానలో ఐసోలేషన్‌ వార్డులను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రభుత్వ ఆదేశానుసారం వైరస్‌ వ్యాప్తి చెందకుండా  జీహెచ్‌ఎంసీ ఆదివారం రంగంలోకి దిగింది. జీహెచ్‌ఎంసీ ఆధీనంలోకి పార్కులను ఈ నెల 21వ తేదీ వరకు మూసివేస్తున్నట్లు ప్రకటించారు.


ప్రైవేట్‌, ప్రభుత్వ రంగానికి చెందిన ఈత కొలనులు, జిమ్‌లు, గచ్చిబౌలి స్టేడియానికి తాళాలు వేశారు. ఇదే సమయంలో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం కోచింగ్‌ సెంటర్లు, సమ్మర్‌ క్యాంపులు మూతపడ్డాయి. బార్లు, పబ్‌లు, క్లబ్‌లు తెరుచుకోలేదు.   సభలు, సమావేశాలు, ర్యాలీలు, సెమినార్లు, కల్చరల్‌ ఈవెంట్లు, వేడుకలు, ఉత్సవాలు ఎక్కడికక్కడ రద్దు చేశారు. అసలే ఆదివారం కావడంలో మెజార్టీలో నగరవాసులు బయటకు రానీ పరిస్థితి కనిపించింది. ప్రధానంగా పారిశుధ్యంపై జీహెచ్‌ఎంసీ ప్రత్యేక దృష్టి సారించింది. శానిటైజర్‌ వర్కర్లకు మాస్కులు, గ్లౌజ్‌లు ధరించాలని ఆదేశాలు జారీ చేశారు.  చెత్త, చెదారం ఏరివేతలో చర్యలు మరింత ముమ్మరం చేయనున్నారు.  కరోనా వ్యాప్తి చెందకుండా ప్రజలను అప్రమత్తం చేస్తూనే కట్టడికి అవసరమైన అన్ని చర్యలను చేపడుతున్నారు. 


 ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది : సీపీ  

 కరోనా వ్యాపించకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ సజ్జనార్‌ తెలిపారు. ప్రజలు ఫేక్‌ సమాచారాన్ని  నమ్మొద్దని, వాటిని సోషల్‌ మీడియాలో ప్రచారం చేసి ఆందోళనకరమైన వాతావరణాన్ని సృష్టించొద్దన్నారు. అలా చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. 54 డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ యాక్ట్‌-2005 కింద కేసులను నమోదు చేస్తామన్నారు.


‘వండర్‌లా’ మూసివేత

 ప్రభుత్వం చేస్తున్న నివారణ చర్యల్లో భాగంగా శనివారం ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు పలు ప్రముఖ ప్రదేశాలు కూడా తాత్కాలికంగా మూతపడుతున్నాయి. ఇందు లో భాగంగానే ఆదివారం వండర్‌లా మూసివేస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటన చేశారు. తిరిగి 21వ తేదీన తెరవనున్నట్లు అప్పటివరకు సందర్శకులు రావద్దంటూ అందులో సూచించారు.


logo