గురువారం 02 ఏప్రిల్ 2020
Medchal - Mar 15, 2020 , 02:40:42

పిల్లల పార్కులు..పిక్నిక్‌ స్పాట్‌లు

పిల్లల పార్కులు..పిక్నిక్‌ స్పాట్‌లు

చెరువులు సుందరంగా మారి.. పిల్లల పార్కులు.. పిక్నిక్‌ స్పాట్‌లుగా అభివృద్ధి చెందుతున్నాయి. హైదరాబాద్‌, మేడ్చల్‌, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని సుమారు 19 చెరువులను రూ.282.63 కోట్ల నిధులతో అభివృద్ధి చేస్తున్నారు. ఇప్పటికే 17 చెరువులను సంపూర్ణంగా శుద్ధి చేశారు. పార్కులు, వాకింగ్‌ట్రాక్‌లు, సైకిల్‌ ట్రాక్‌లు, రీక్రియేషన్‌ సెంటర్లు, బోటింగ్‌, ఓపెన్‌ జిమ్‌లు, ఇతర సుందరీకరణ పనులు చేపట్టారు. దీంతో అవి ఆహ్లాదకరంగా మారి పిక్నిక్‌ స్పాట్‌లుగా అందుబాటులోకి రానున్నాయి.

  • 19 చెరువులు సంపూర్ణంగా శుద్ధి.. ఆ పై సుందరీకరణ పనులు
  • అక్కడే బోటింగ్‌, ఓపెన్‌ జిమ్‌ వసతులు
  • ఆహ్లాదంగా మార్చుతున్న బల్దియా
  • 80శాతం పూర్తయిన పనులు
  • జూలై నాటికి సిద్ధంచేయాలని లక్ష్యం
  • ఇప్పటికే 17చెరువులు అందుబాటులోకి

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ :  మిషన్‌ కాకతీయ పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా వేలాది చెరువులను అభివృద్ధి చేసి సత్ఫలితాలను సాధించిన ప్రభుత్వం గత ఏడాది మిషన్‌ కాకతీయ-4వ దశలో హైదరాబాద్‌, మేడ్చల్‌, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని పట్టణ చెరువులను అభివృద్ధి చేసేందుకు చర్యలు ప్రారంభించింది.  అధికారిక లెక్కల ప్రకారం హెచ్‌ఎండీఏ పరిధిలో 3130 చెరువులు ఉండగా, జీహెచ్‌ఎంసీ పరిధిలో 185 చెరువులు ఉన్నా యి. దశలవారీగా ఈ చెరువులను కబ్జాలబారి నుంచి కాపాడడంతోపాటు వాటిని పునరుద్ధరించి, సుందరీకరణ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఏప్రిల్‌ 2018లో మూడు జిల్లాల పరిధిలోని సుమారు 19 చెరువులను అభివృద్ధి చేసేందుకు ప్రభు త్వం  రూ.282.63కోట్ల నిధులతోపాటు సాంకేతిక అనుమతులను జారీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ 19 చెరువులను అభివృద్ధి చేయడం వల్ల నగర పరిధిలోని సుమారు 10 నియోజకవర్గాల పరిధిలో భూగర్భ జలాలు పెరగడమే కాకుండా ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం లభించే అవకాశం కలుగుతుంది.  వాస్తవానికి రూ. 287.97 కోట్ల వ్యయంతో 20 చెరువుల అభివృద్ధికి జీహెచ్‌ఎంసీ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా, అందులో ఖైరతాబాద్‌ నియోజకవర్గం పరిధిలోని సున్నంకుంట చెరువు మినహా మిగిలిన 19 చెరువుల అభివృద్ధికి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. కొన్ని సాంకేతికపరమై న అంశాల కారణంగా సున్నంకుంట చెరువుకు అనుమతులు రాలేదని అధికారులు తెలిపారు.


 శుద్ధి, సుందరీకరణ పనులు ఇలా.. 

 అభివృద్ధిలో భాగంగా చెరువు/చెరువు కట్టల మరమ్మతులు, పూడికతీత పనులతో పాటు మురుగునీటిని చెరువులో కలవకుండా పక్కనుంచి కెనాల్స్‌ నిర్మాణం, అలాగే ఈ మురుగునీటిని పక్కకు మళ్లించి వాటిని శుద్ధిచేసేందుకు ఎస్‌పీలు నిర్మించడం తదితర పనులను మొదటిదశలో నిర్వహిస్తున్నారు. రెండోదశలో పిల్లల ఆటలకు సంబంధించిన పార్కులు, ఇతర ఏర్పాట్లు, వాకింగ్‌ ట్రాక్‌లు, సైకిల్‌ ట్రాక్‌లు, రీక్రియేషన్‌ సెంటర్లు, బోటింగ్‌, ఓపెన్‌ జిమ్ములు, పిక్నిక్‌ స్పాట్లు, ఇతర సుందరీకరణ పనులను చేపట్టారు. దీంతో ఆయా ప్రాంతాలు ఆహ్లాదకరమైన ప్రదేశాలుగా ఏర్పడి ప్రజలకు పిక్నిక్‌  స్పాట్లుగా అందుబాటులోకి వచ్చే అవకాశముంది. చందానగర్‌లోని రాయదుర్గం చెరువు, బోయిన్‌చెరువు మినహా మిగిలిన చెరువుల పనులు శరవేగంగా కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. రాయదుర్గం చెరువు సాంకేతికపమైర కారణాలతో నిలిచిపోగా, బోయిన్‌చెరువు కోర్టు కేసు కారణంగా పనులు నిలిపివేసినట్లు వారు పేర్కొన్నారు. మిగిలిన 17చెరువుల్లో సగానికిపైగా చెరువుల పనులు 80 శాతం వరకు పూర్తయినట్లు వారు పేర్కొన్నారు. వచ్చే జూలైనాటికి దాదాపు అన్ని పనులూ పూర్తిచేసి చెరువులను అందుబాటులోకి తెస్తామని భరోసానిస్తున్నారు. మురుగునీరు అందులోకి ప్రవేశించకుండా చేసి వచ్చే వర్షాకాలంలో వచ్చే నీటితో చెరువులను నింపాలని, అలాగే శుద్ధిచేసిన నీటిని మాత్రమే చెరువులోనికి వదలాలని సంకల్పించారు. ఈ చెరువులన్నీ పూర్తిగా సుందరీకరణ పూర్తయితే ఆయా ప్రాంతాల్లో చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం, పిక్నిక్‌  స్పాట్లు అందుబాటులోకి వచ్చినట్లవుతుంది. 


logo