శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Medchal - Mar 15, 2020 , 02:38:03

గగనతలం.. విహంగ మైదానం

గగనతలం.. విహంగ మైదానం

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : గగనతలం.. విహంగాల ఆట పాటలకు క్రీడా వేదికైంది. హెలికాప్టర్లు, చిన్నా, పెద్ద, ఒక మోస్తారు జెట్‌ విమానాలు ఆకాశంలో ఎగిరి తమ నృత్య విన్యాసాలను ఆవిష్కరించాయి.  ఫిక్కీ, ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా, భారత ప్రభుత్వం - పౌర విమానయాన శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నగరంలోని బేగంపేట ఎయిర్‌పోర్టులో ‘వింగ్స్‌ ఇండియా - 2020’  ప్రదర్శన, వివిధ దేశాలకు చెందిన పైలెట్లు చేసిన ఎయిర్‌ షో వీక్షకులను ఆకట్టుకుంది.   కేంద్ర విమానయాన శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరి విచ్చేసి స్టాళ్లను సందర్శించారు.  ఈ నేపథ్యంలో సీఎస్‌ఐఆర్‌ - ఎన్‌ఏఎల్‌ స్టాల్‌ వద్దకేగి వారి  ‘హన్స - ఎన్జీ’  శిక్షణ విహం గం యొక్క బ్రోచర్‌ను ఆవిష్కరించారు.  కాగా, ఈ వైమానిక ప్రదర్శన నేటితో ముగియనున్నది. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కే.టీ.రామారావు, హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ ప్రదర్శనలో పాల్గొన్నారు.  


ఆకాశ వీధిలో అబ్బురపరుస్తున్న విన్యాసాలు

  • వైమానిక రంగం వృద్ధిలోకి రావాలి..

తెలంగాణలో సైతం ఏవియేషన్‌ రంగం వృద్ధిలోకి రావాలి. హైదరాబాద్‌ నగరం కూడా ఇందుకు సిద్ధంగా ఉండాలి. రాష్ట్రంలో ఇది ఆర్థికపరమైన ఎదుగుదలకు ఇది ఉపయోగపడుతుంది. ఈ ప్రదర్శన వల్ల పెద్ద పెద్ద హెలికాప్టర్లు, విమానాలు వస్తుంటాయి. దీని వల్ల వైమానిక రంగంలో ఏమున్నాయి... మనమేం చేయాలనే ఒక జిజ్ఞాస ఆసక్తి గలవారిలో కలుగుతుంది. అదే విజ్ఞానం స్థానికుల్లో చోటు చేసుకుంటుంది.  ఈ అవకాశాన్ని యువత, ఆసక్తి గలవారు ఉపయోగించుకొని వారు ఆశించిన రంగంలో రాణించాలి. అప్పుడే ఈ ప్రదర్శనలు విజయవంతమైనట్టు. 

 - అభిషేక్‌, పైలెట్‌, నేషనల్‌ ఫ్లయింగ్‌ ఇనిస్టిట్యూట్‌  


logo