శనివారం 06 మార్చి 2021
Medchal - Mar 11, 2020 , 00:56:54

సర్వాంగ సుందరంగా..

సర్వాంగ సుందరంగా..

యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తేతెలంగాణ: కలెక్టరేట్‌ నిర్మాణ పనులు వడి వడిగా ముందుకు సాగుతున్నాయి. రాయగిరిలో నిర్మాణమవుతున్న కలెక్టరేట్‌ అటు భువనగిరి ఇటు యాదగిరిగుట్టకు మధ్యలో ఉండటంతో రెండు  పట్టణాలు భవిష్యత్తులో జంటనగరాలుగా ఆవిర్భావం చెందుతాయని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కలెక్టరేట్‌ భవనం కోసం స్థలం ఖరారు చేసిన సందర్భంగా చేసిన వ్యాఖ్యలకు ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది. ఇదిలా ఉండగా రూ. 30. 66 కోట్లతో  నాలుగు బ్లాకులుగా కలెక్టరేట్‌ నిర్మాణమవుతున్నది. ఇప్పటి వరకు 31 శాఖల అధికారులు తమ కార్యాలయాలను  కలెక్టరేట్‌లో కొనసాగించే విధంగా చర్యలు తీసుకోవాలని  కలెక్టర్‌ అనితారామచంద్రన్‌కు రాతపూర్వకంగా విన్నవించారు. అధికారులు, బాధితులకు అనేక సౌకర్యాలు కల్పిస్తూ సర్వాంగ సుందరంగా కలెక్టరేట్‌ నిర్మాణం చేస్తున్నారు. రాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి 2017 అక్టోబర్‌ 11న శంకుస్థానన పనులను అట్టహాసంగా ప్రారంభించారు. జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు పలు దఫాలుగా సందర్శించి నిర్మాణ పనులను పర్యవేక్షించారు. మంగళవారం సాయంత్రం  కలెక్టర్‌ అనితారామచంద్రన్‌, అడిషనల్‌ కలెక్టర్‌ జి. రమేశ్‌, ఆర్డీవో ఎంవీ. భూపాల్‌రెడ్డి కలెక్టరేట్‌ నిర్మాణ పనులను ఆకస్మికంగా పరిశీలించారు. త్వరగా పూర్తి చేయించేందుకు కసరత్తు చేస్తున్నట్లు కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధిని వేగిరం చేసేందుకు కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీంతో అభివృద్ధికి అడుగులు పడ్డాయి. 

12 ఎకరాల్లో అందంగా..

రాయగిరిలోని 12 ఎకరాల్లో కలెక్టరేట్‌ భవన నిర్మాణ పనులు వడి వడిగా సాగుతున్నాయి. జాతీయ రహదారికి దగ్గరగా ఉండటంతో పాటు భువనగిరి- యాదాద్రి పట్టణాలు కలిపి ప్రధాన రహదారిపైనే ఉండటంతో ప్రజలకు రవాణా సౌకర్యాలు కూడా మెండుగా ఉన్నట్లయింది. రాయగిరిలో నిర్మాణం చేస్తున్న కలెక్టరేట్‌ కోసం రాయగిరి గ్రామాన్ని భువనగిరి మున్సిపాలిటీలో కూడా కలిపారు. గ్రామస్తుల నుంచి నిరసనలు రాకుండా వారికి అనేక రకాల సౌకర్యాలు మెరుగుపడనున్న విషయాన్ని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి ద్వారా తెలిసేలా చర్యలు తీసుకున్నారు. 12 ఎకరాల విస్తీర్ణంలో లక్షా 20 వేల స్కేర్‌ ఫీట్ల స్లాబుతో కలెక్టరేట్‌ నిర్మాణం జరుగుతున్నది. కలెక్టరేట్‌ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.30.66 కోట్లను విడుదల చేసింది.

31 కార్యాలయాల ఏర్పాటు..

నూతన కలెక్టరేట్‌లో 31 శాఖలను వేర్వేరుగా ఏర్పాటు చేసేందుకు  పక్కా ప్రణాళికలతో ముందుకు సాగుతున్నారు. జిల్లా అధికారికి చాంబర్‌, స్టాఫ్‌, టాయిలెట్స్‌, మరుగుదొడ్లను కూడా ప్రతి కార్యాలయానికి వేర్వేరుగా ఏర్పాటు చేస్తున్నారు. ఏ కార్యాలయం అధికారుల నిర్వహణ బాధ్యత ఆ కార్యాలయంలో ఉండే విధంగా ప్రణాళికలు రూపొందించారు. మరో రెండు మూడు నెలల్లో పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.కొత్తగా జిల్లా ఏర్పడిన సందర్భంగా భువనగిరి పట్టణంలోని అనేక ప్రాంతాల్లో కార్యాలయాలను ఏర్పాటు చేయడం వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీన్ని అధిగమించేందుకు ప్రభుత్వం సమీకృత కలెక్టరేట్లకు శ్రీకారం చుట్టింది. సమావేశాల నిర్వహణకు కన్వెన్షన్లను పోలిన పెద్దపెద్ద హాళ్ల నిర్మాణం కూడా జరుగుతున్నది. ఈవీఎంలు భద్రపర్చడానికి ప్రత్యేక హాళ్లు నిర్మిస్తున్నారు. ఇక సమావేశాల కోసం ఫంక్షన్‌హాళ్ల చుట్టూ తిరగాల్సిన పని లేదని జిల్లా అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. 


VIDEOS

logo