బుధవారం 08 ఏప్రిల్ 2020
Medchal - Mar 10, 2020 , 03:55:48

మాస్కులు అధిక ధరకు విక్రయిస్తే.. సీజ్‌ చేస్తాం

మాస్కులు అధిక ధరకు విక్రయిస్తే.. సీజ్‌ చేస్తాం

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : ఓ వైపు ప్రపంచ దేశాలను కొవిడ్‌ 19(కరోనా) వైసర్‌ వణికిస్తుండగా ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. దీని ప్రభావంతో మార్కెట్లు సైతం దివాలా తీస్తున్నాయి. కాని గ్రేటర్‌లోని మెడికల్‌ షాపులు లాభాల బాట పట్టాయి. ఇదేమిటనుకుంటున్నారా.. అవును.. వైరస్‌ బారిన పడకుండా ప్రజలు మాస్కులు ధరిస్తున్నారు. ఇదే అదునుగా భావించిన పలు మెడికల్‌ షాపుల నిర్వాహకులు 5 రూపాయల మాస్కును ఏకంగా రూ.80కి విక్రయిస్తున్నారు. కొనుగోలుదారుల ఫిర్యాదు మేరకు కూకట్‌పల్లి పోలీసులు నిర్వాహకుడిపై కేసు నమోదు చేశారు. మరికొన్ని ప్రాంతాల్లో మెడికల్‌ షాపులపై జీహెచ్‌ఎంసీ అధికారులు దాడులు నిర్వహించి జరిమానాలు విధిస్తున్నారు. ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా అధిక ధరలకు విక్రయిస్తే షాపులను సీజ్‌ చేస్తామని అధికారులు హెచ్చరించారు. 


శేరిలింగంపల్లి : నిబంధనలకు విరుద్ధంగా అధిక ధరలకు మాస్కులు విక్రయిస్తున్న మెడికల్‌ షాపులపై శేరిలింగంపల్లి సర్కిల్‌ అధికారులు సోమవారం దాడులు నిర్వహించారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను కలవరపెడుతున్న (కొవిడ్‌-19) కరోనా వైరస్‌ పరిస్థితులను ఆసరాగా చేసుకొని అధిక ధరలకు మాస్కులు, శానిటైజర్లు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్న వ్యాపారులపై ప్రభుత్వం చర్యలకు ఆదేశాలివ్వడంతో సర్కిల్‌ అధికారులు రంగంలోకి దిగారు. శేరిలింగంపల్లి సర్కిల్‌ అంజయ్యనగర్‌లోని కాకతీయ హాస్పిటల్‌ సమీపంలోని సాయిదుర్గం మెడికల్‌ అండ్‌ జనరల్‌ స్టోర్‌లో సోమవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అధిక ధరలకు మాస్కులు విక్రయిస్తున్న సదరు షాపు నిర్వాహకులకు రూ.20వేల జరిమానా విధించారు. శేరిలింగంపల్లి సర్కిల్‌ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సర్కిల్‌ ఏఎంఓహెచ్‌ డాక్టర్‌ రంజిత్‌ నేతృత్వంలో ఎస్‌ఆర్‌పీ రాజయ్య తదితర సిబ్బంది ఈ దాడుల్లో పాల్గొన్నారు. అధిక ధరలకు విక్రయిస్తే షాపులను సీజ్‌ చేస్తామని అధికారులు హెచ్చరించారు.


కూకట్‌పల్లి, మార్చి9(నమస్తే తెలంగాణ): అధిక ధరకు మాస్కులు విక్రయిస్తున్న మెడికల్‌ దుకాణాల నిర్వాహకులను కూకట్‌పల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కూకట్‌పల్లి సీఐ లక్ష్మీనారాయణరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కొంత మంది మెడికల్‌ దుకాణాల యజమానులు పది రూపాయలకు విక్రయించాల్సిన మాస్కులను రూ.80కి విక్రయిస్తున్నారని బాలాజినగర్‌ కాలనీకి చెందిన ఫోరం ఫర్‌ అగినెస్ట్‌ కరప్షన్‌ సంస్థ ఉపాధ్యక్షుడు కాట్రగడ్డ సాయి తేజ సోమవారం కూకట్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మెడికల్‌ షాపు వద్ద మాస్కులు కొనుగోలు చేసిన సమయంలో తీసుకున్న బిల్లులను సైతం ఫిర్యాదుతో జతచేశాడు. దీని ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు ఎక్కువ ధరలకు మాస్కులు విక్రయిస్తున్న శ్రీ సాయి మెడికల్‌, మారుతి మెడికల్‌ షాప్‌ యజమానులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 18 ప్యాకెట్ల మాస్కులను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ లక్ష్మీనారాయణరెడ్డి తెలిపారు.


రెడ్‌ క్రాస్‌ ఆధ్వర్యంలో బట్టమాస్క్‌ల తయారీ 

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : కరోనా వైరస్‌ వ్యాపిస్తుందన్న వార్తల నేపథ్యంలో జిల్లా రెడ్‌క్రాస్‌ సొసైటీ అప్రమత్తమయ్యింది. మాస్క్‌లకు డిమాండ్‌ పెరుగడం.. బహిరంగ మార్కెట్‌లో మాస్క్‌ల కొరత ఏర్పడడంతో చర్యలకు ఉపక్రమించింది. ప్రత్యామ్నాయంగా బట్టమాస్క్‌లను తయారుచేసేందుకు సన్నాహకాలు చేస్తున్నది. ఇలా లక్ష బట్టమాస్క్‌లను తయారుచేయించాలని లక్ష్యంగా పెట్టుకున్నది. జిల్లా రెడ్‌క్రాస్‌ సొసైటీ ఆధ్వర్యంలో పలు ప్రాంతాల్లో 10 కుట్టుమిషన్‌ శిక్షణకేంద్రాలు నడుస్తున్నాయి. వీటి ద్వారా నిరుపేద మహిళలకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. ఈ నెల 16వ తేదీ నుంచి కొత్త బ్యాచ్‌ ప్రారంభంకాబోతున్నది. ఈ కుట్టుమిషన్‌ కేంద్రాల ద్వారా బట్టమాస్క్‌లు తయారుచేయాలని రెడ్‌క్రాస్‌ సొసైటీ పాలకవర్గం నిర్ణయం తీసుకున్నది. తయారుచేయించిన మాస్క్‌లను ప్రజలు గుమిగూడే ప్రాంతాలు, పేదలుండే బస్తీల్లో ఉచితంగా పంపిణీచేయాలని బావిస్తున్నది. ఇదే విషయంపై మంగళవారం జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులతో సమావేశంకానున్నట్లు రెడ్‌క్రాస్‌ సొసైటీ అధ్యక్షుడు మామిడి భీంరెడ్డి ‘నమస్తే తెలంగాణ’కు తెలిపారు. 


గాంధీలో కోలుకుంటున్న కరోనా బాధితుడు

నమస్తే తెలంగాణ-సిటీబ్యూరో : తెలంగాణ రాష్ట్రంలో నమోదైన తొలి కరోనా బాధితుడు క్రమంగా కోలుకుంటున్నట్లు గాంధీ దవాఖాన కరోనా విభాగం నోడల్‌ అధికారి డా.ప్రభాకర్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రస్తుతం బాధితుడి ఆరోగ్యం పూర్తి నిలకడగా ఉందని, అతడిలో కరోనా లక్షణాలు సైతం తగ్గుముఖం పట్టినట్లు వెల్లడించారు. ఇదిలా ఉండగా ఆదివారం ఉదయం నుంచి రాత్రి 7గంటల వరకు మరో 8మంది అనుమానితులు గాంధీ దవాఖానను ఆశ్రయించినట్లు తెలిపారు. వీరికి కోవిడ్‌-19 పరీక్షలు నిర్వహించామని మంగళవారం మెడికల్‌ రిపోర్టు వస్తుందన్నారు. ప్రస్తుతం ఐసోలేషన్‌ వార్డులో మొత్తం 25మంది వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు నోడల్‌ అధికారి డా.ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. 


భయం వద్దు.. అప్రమత్తత అవసరం

వాతావరణం చల్లబడినా ఎలాంటి భయం అవసరం లేదు. కాని ముందుజాగ్రత్త చర్యలు తప్పనిసరి. వ్యాధి సోకిన తరువాత చికిత్స కోసం పరుగులు తీయడం కంటే అది రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ప్రస్తుతం గాంధీలో చికిత్స పొందుతున్న కోవిడ్‌-19 పాజిటివ్‌ కేసు కోలుకుంటున్నది. అతడి నుంచి వైరస్‌ ఇతరులెవరికీ సోకనందున ఎలాంటి భయం వద్దు. కాని అప్రమత్తం అవసరం. మూతికి మాస్కులు ధరించాలి. విదేశాలకు వెళ్లి వచ్చిన వారు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి.

- డా.రాజారావు, జనరల్‌ మెడిసిన్‌ విభాగాధిపతి, గాంధీ దవాఖాన


logo