బుధవారం 08 ఏప్రిల్ 2020
Medchal - Mar 10, 2020 , 02:49:31

హోలీ రంగుల కేళి

హోలీ రంగుల కేళి

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: నగరంలో ప్రతి సారి ఘనంగా జరిగే హోలీ వేడుక ఈసారి పండుగ తేదీల్లో గందరగోళం,కరోనా వైరస్‌ వదంతుల నేపధ్యంలో ఎక్కడా పెద్ద ఎత్తున జరుపుకున్న దాఖలాలు కనిపించలేదు. నగరంలో స్టార్‌ హోటళ్లు, రెస్టారెంట్లు, పెద్ద పెద్ద అపార్టుమెంట్ల వారు, ఉన్నత వర్గానికి చెందిన వారు, విలాసవంతమైన కాలనీల వారు మాత్రమే తగు జాగ్రత్తలు తీసుకొని జరుపుకున్నారు. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, మాదాపూర్‌, మణికొండ, శేరి లింగంపల్లి, గచ్చిబౌలి, కూకట్‌పల్లి, మియాపూర్‌, ఖైరతాబాద్‌ తదితర ప్రాంతాల్లో ప్రత్యేకంగా జరుపుకున్నారు.చాలా చోట్ల సోమవారం కాముని దహనానికి ఏర్పాట్లు చేస్తుండటం కనిపించింది. అయితే కొన్ని చోట్ల సోమవారం జరుపుకోగా, మరికొన్ని చోట్ల మంగళవారం జరుపుకోవడానికి సిద్ధమవుతున్నారు.చిన్నారులు ఇండ్ల ముందు అల్లరి చేస్తూ రంగులు చల్లుకోగా, కళాశాల విద్యార్థులు, యువత బంధువులు, స్నేహితుల ఇండ్లకు వెళ్లి రంగులు చల్లుకున్నారు. 


హోలీ పండుగను పురస్కరించుకుని రంగుల విక్రయ దుకాణాల్లో కొనుగోళ్ల సందడి కనిపించలేదు. రంగులతో పాటు గులాల్‌ ప్యాకెట్‌లు, సునేర్‌ వంటి రంగుల విక్రయాలు జరుగలేదు. కానీ వినియోగదారులలో ఒక రకంగా తేదీల తర్జన భర్జన నెలకొనడం, కరోనా వైరస్‌పై ఆందోళన నెలకొనడం, దేశ వ్యాప్తంగా రంగుల పండుగకు దూరంగా ఉందామనే నినాదం, ఒక ఆలోచన ప్రతి ఒక్కరిలో రావడంతో దాదాపు ఈ హోలీ వేడుకకు లక్షలాది మంది దూరంగా ఉన్నారు. దీంతో రంగుల దుకాణాలు, పిచికారి దుకాణాలు వెలవెలబోయాయి. పెద్దగా సందడి లేక ఆయా దుకాణాదారులు డీలాపడిపోయారు. రంగులు రమ్మంటున్నా కరోనా భయం మాత్రం వెంటాడింది. 


logo