శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Medchal - Mar 08, 2020 , 01:30:37

ఆలోచనే..పెట్టుబడి

ఆలోచనే..పెట్టుబడి

సిటీబ్యూరో,నమస్తే తెలంగాణ : ఆలోచనయే పెట్టుబడిగా.. హార్డ్‌వర్క్‌నే మ్యాన్‌పవర్‌గా.. సాంకేతికతను సలహాదారుగా మలుచుకుంటూ స్టార్టప్‌ రంగంలో  ధీర వనితలు తమ ప్రతిభను చాటుతున్నారు. వారి కళలను నిజం చేసుకుంటున్నారు. కేవలం కొలువు సాధించడంతోనే ఆగిపోకుండా.. వారి లక్ష్యాలను నెరవేర్చుకునే ప్రయత్నాల్లో సఫలమవుతున్నారు. వినూత్న ఆలోచనలతో ఇతరులకు ఉపాధి అందిస్తూ అసలు సిసలైన ఆడబిడ్డలు అనిపించుకుంటున్నారు. వ్యాపారవేత్తలుగా ఎదుగుతున్నారు. ఒక్క ఆలోచన.. వేల మందికి ఉపాధినిచ్చే ఆయుధంగా మహిళలు ప్రణాళికలు చేస్తున్నారు. ప్రజల అవసరాలనే అవకాశంగా చేసుకుని స్టార్టప్‌లను సృష్టిస్తున్న వారు కొందరైతే.. వ్యాపార యూనిట్లను ఏర్పాటు చేసి ఆదర్శంగా నిలుస్తున్న వారు మరికొందరు. మొత్తంగా ఆకాశమే హద్దుగా సాగుతున్నది మహిళల విజయ ప్రయాణం..                                     


లక్షల జీతం కాదని..!!

నగరంలోని అత్తాపూర్‌కు చెందిన స్వాతి భావనక యూఎస్‌లో కంప్యూటర్‌ సైన్స్‌లో ఎంఎస్‌ చేశారు. అనంతరం ఆమెకు ప్రము ఖ కంపెనీల నుంచి జాబ్‌ ఆఫర్లు వచ్చాయి. లక్షల్లో జీతం. లగ్జరీ లైఫ్‌. కానీ స్వాతి వాటిని తిరస్కరించింది. కొంతమంది దగ్గరివాళ్లు ఆమె నిర్ణయాన్ని తప్పుబట్టారు. కానీ స్వాతి వాటిని పట్టించుకోలేదు. ఆమె ఆలోచన  సొంతంగా వ్యాపారాన్ని స్థాపించి...ఇతరులకు ఉపాధి కల్పించడంపైనే ఉండేది. ఈ క్రమంలో అమెరికా నుంచి తిరిగి ఇండియాకు వచ్చింది. బెంగళూరులో నోల్స్‌స్కేప్‌ అనే స్టార్టప్‌ కంపెనీలో కొంతకాలం పనిచేసింది. గేమింగ్‌ సిమ్యూలేషన్‌ డెవలప్‌ చేసింది. అలా సాగుతున్న ఆమె ప్రయాణంలో తన లక్ష్యం  నెరవేర్చుకోవడంపైన దృష్టి పెట్టింది. ‘ఈవైబ్‌.ఇన్‌' స్టార్టప్‌ను ఏర్పాటు చేసింది. వెడ్డింగ్‌, యానివర్సరీ, బర్త్‌డే పార్టీలకు ఆన్‌లైన్‌ వేదికగా సేవలు అందించడం షూరూ చేసింది. పార్టీ సర్వీస్‌ ఇండస్ట్రీలో విశేష అనుభవాన్ని సంపాదించుకుంది. ప్రస్తుతం 20 మందికి ప్రత్యక్షంగా 200 మందికి పరోక్షంగా ఈవైబ్‌ స్టార్టప్‌తో ఉపాధిని పొందుతున్నారు. ఎమెర్జింగ్‌ వుమెన్‌ ఎంట్రప్రెన్య్రూర్‌ ఆఫ్‌ హైదరాబాద్‌గా తెలంగాణ ప్రభుత్వం నుంచి గుర్తింపు సంపాదించుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న టెక్‌మేకర్స్‌లో ఆమె టాప్‌ 10లో ఉండటం గొప్ప విషయం. 


ఇంటినే స్టార్టప్‌ కేంద్రంగా..!!

మణికొండకు చెందిన లిఖిత అంబేద్కర్‌ ఓపె న్‌ యూనివర్సిటీలో బీఏ చేశారు. చిన్నప్పటి నుంచి ఆమెకు ఒక్కటే లక్ష్యం. ఇతరులకు ఉపాధిని చూపిం చే సంస్థను స్థాపించడం. అందుకోసం ఉపాధి మార్గం చూపించే నిర్మాణ  సంస్థ గురించి తెలుసుకుంది. 3 నెలలు ఆమె బొటిక్‌లో శిక్షణ తీసుకుంది.  ఎంబ్రాయిడింగ్‌, స్టిచ్చింగ్‌లో శిక్షణ తీసుకున్నారు. చాలా మంది మహిళలు అక్కడితో ఆగిపోయి ఏదైనా షాపులో పనియడం ఎంచుకుంటారు. కానీ లిఖిత అలా చేయలేదు. సాంకేతికత సహాయంతో ‘ మై లక్కీ క్లోసెట్‌' అనే స్టార్టప్‌ను ఏర్పాటు చేసింది. ఆమె ఆలోచనను మెచ్చి నిర్మాణ్‌ అండగా నిలిచింది. డ్రై క్లీనర్స్‌ను సమకూర్చుకుంది. గృహిణిగా ఉంటూనే ఇంటిని స్టార్టప్‌ కేంద్రంగా మలుచుకుని మరి కొంత మంది మహిళలకు ఉపాధినిచ్చే స్థాయికి ఎదిగి ఆదర్శంగా నిలిచారు. 


వైద్య సేవలు సులభం..!!

జేఎన్‌టీయూకు చెందిన విద్యార్థినులు వైద్య సేవలలో ఉపయోగించే మిషన్లను తక్కువ ధరలో.. తక్కువ పరిమాణంలో తీసుకురావాలని భావించారు. మైనిగంటి శ్రీజ, దారపనేని సాయి సౌమ్య, కూడికల భవ్యశ్రీ, దుర్గం నీలిమలు ఐ నేత్ర అనే స్టార్టప్‌ను కార్యాచరణలోకి తీసుకురాబోతున్నారు. ఇప్పటికే వారు తయారు చేసిన పరికరాన్ని కొన్ని ఆసుపత్రుల్లో వినియోగిస్తున్నారు.  రెటినాకు సంబంధించిన ఏ వ్యాధినైనా ఈ పరికరంతో గుర్తించవచ్చు. దీంతో తీసిన ఫొటోతో వైద్యులు వ్యాధిని గుర్తించగలుగుతారు. గ్లకోమా, మాక్యులర్‌ డిజైనరేషన్‌, డయాబెటిక్‌ రెటినోపతి వంటి వ్యాధులను గుర్తిస్తుందని ఆవిష్కకర్తలు తెలిపారు. విద్యాభ్యాసంలోని అద్భుత ఆలోచనలను కార్యాచరణలోకి తీసుకొస్తున్న వారిని ప్రతి ఒక్కరూ శభాష్‌ అని ప్రశంసిస్తున్నారు. logo