గురువారం 02 ఏప్రిల్ 2020
Medchal - Mar 07, 2020 , 06:14:01

మిషన్‌ భగీరథ ఫలం తీరిన నీటి కష్టం

మిషన్‌ భగీరథ ఫలం తీరిన నీటి కష్టం
  • ఆనాడు భగీరథుడు గంగను భూవికి తెస్తే...
  • నేడు సీఎం కేసీఆర్‌ ‘మిషన్‌ భగీరథతో పట్టణాలు, గ్రామాలను సస్యశ్యామలం చేశారు

ఒకప్పుడు వేసవి వచ్చిందంటే..తరుముకొచ్చే నీటి కష్టాలను చూసి.. హడలిపోయిన ఆడబిడ్డలు.. తరలివచ్చిన జలసిరితో ఇప్పుడు ఉప్పొంగిపోతున్నారు. ఇంటింటికీ శుద్ధ జలాలు అందించాలన్న ప్రభుత్వ సంకల్పంతో చేపట్టిన ‘మిషన్‌ భగీరథ’ పథకం మేడ్చల్‌ పట్టణంతో పాటు గ్రామాల్లో నీటి కష్టాలను 

శాశ్వతంగా దూరం చేసింది. సమ్మర్‌లోనూ ఎలాంటి ఢోకా లేకుండా.. సమృద్ధిగా సరఫరా ఉంటున్నది.


మేడ్చల్‌ రూరల్‌ : ఒకప్పుడు వేసవి వచ్చిదంటే చాలు...  నీటి కష్టాలు తరుముకొచ్చేది. బోర్లు ఎండపోయేవి... బావులు బోసిపోయేవి.. గుక్కెడు నీటి కోసం మండుటెండలో ఆడబిడ్డలు మైళ్ల దూరం ఖాళీ బిందెలతో వెళ్లాల్సి వచ్చేది. పెద్ద లైను కడితేకానీ... నీళ్లు దొరికేది కాదు..ఇప్పుడు పరిస్థితి పూర్తిగా భిన్నం. ‘మిషన్‌ భగీరథతో గ్రామాలన్నీ సస్యశ్యామలమయ్యాయి. ‘ఆమె’కు నీటి ఇబ్బందులను శాశ్వతంగా దూరం చేశాయి. మండువేసవిలోనూ జలకళ సంతరించుకున్నది.


ఏండ్లుగా అవస్థలు 

ఎంతో కాలంగా మేడ్చల్‌ వాసులు నీటి కోసం అష్టకష్టాలు పడ్డారు. జిల్లాలోనే భూగర్భ జలాలు అడుగంటిన మండలంగా మేడ్చల్‌ను గుర్తించారంటే.. నీటి కటకట ఎంతగా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. బోరుబావులు పని చేయక అధికారులు దూర ప్రాంతాల నుంచి ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసేవారు. ఆ జలాలు అవసరాలకు ఏ మాత్రం సరిపోయేది కాదు. ప్రైవేటు వారు సైతం ఒక్కో ట్యాంకర్‌కు రూ.600 నుంచి రూ.800 వరకు చెల్లించి, నీరు కొనుగోలు చేయాల్సి వచ్చేది. గృహావసరాలు, పరిశ్రమలకు నీటిని అమ్మి విక్రయదారులు పెద్ద ఎత్తున డబ్బు సంపాదించే వారు. ఒక్కో ట్యాంకర్‌ యజమాని కనీసం రోజుకు 12 నుంచి15 ట్రిప్పులను స్థానికంగా సరఫరా చేసేవారు. మిషన్‌ భగీరథతో కష్టాలన్నీ తీరిపోయాయి. 


శ్రీరంగవరంలో..  

మిషన్‌ భగీరథ పథకంలో సీఎం కేసీఆర్‌ నియోజకవర్గం గజ్వేల్‌తో పాటు మేడ్చల్‌ నియోజకవర్గానికి మొదటగా గోదావరి నీళ్లు వచ్చాయి. దాదాపు రూ.219 కోట్లతో పూర్తి చేసిన పనులతో మేడ్చల్‌ పట్టణంతో పాటు గ్రామాలకు నీటి కష్టాలు తీరాయి. తీవ్ర నీటి సమస్యతో గోస పడిన గ్రామాల్లో ఒకటైన శ్రీరంగవరంలో ఎవరిని అడిగినా...  అప్పటి, ఇప్పటి పరిస్థితులను బేరీజు వేస్తూ.. సీఎం  కేసీఆర్‌ నీళ్లిచ్చి ఎంతో మేలు చేశారని కొనియాడుతున్నారు. మిషన్‌ భగీరథ నీళ్లు రాక ముందు గ్రామంలో సమస్య ఫ్రిబవరి మొదటి వారంలో ప్రారంభమై జూలై వరకు కొనసాగేది. వర్షాలు పడ్డాకే సమస్య తీరేది. వేసవి ఆరంభానికి ముందే గ్రామ పంచాయతీ డబ్బులను వెచ్చించి ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసేది. రెండు రోజులకోసారి ఒక్కో ఇంటికి ఒకటి, రెండు డ్రమ్ముల నీళ్లను ఇచ్చే వారు.


ఆ ట్యాంకర్‌ ఎప్పుడు వస్తుందా అని ప్రజలు ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చేది. అవి ఏమాత్రం సరిపోకపోవడంతో డబ్బులు చెల్లించి ట్యాంకర్‌ తెప్పించుకునేవారు.ఆర్థికంగా ఉన్న పెద్ద కుటుంబాలైతే రెండు రోజులకోసారి రూ.600 చొప్పున చెల్లించి ఐదు నెలల కాలంలో కనీసం 70 ట్యాంకర్లను కొనుగోలు చేసేవారు. ఈ లెక్కన ఊరు మొత్తంగా లక్షలాది రూపాయలను నీటి కోసం వెచ్చించాల్సిన పరిస్థితి ఉండేది.శ్రీరంగవరంలో ప్రస్తుత జనాభా 5వేల వరకు ఉండగా, ప్రతి రోజు 3 లక్షల లీటర్ల నీటిని సరఫరా చేస్తున్నారు. దీంతో ఇబ్బందులు తలెత్తడం లేదు. వేసవి ప్రభావం తీవ్రంగా ఉండి, పై నుంచి నీళ్లు తక్కువగా ఇస్తే నీటి సరఫరా తగ్గినా..కొరత వచ్చే అవకాశమైతే లేదు. మిషన్‌ భగీరథలో 2 లక్షల లీటర్ల సామర్థ్యం కలిగిన ఓఆర్‌హెచ్‌ఎస్‌ నిర్మించగా, 90వేల లీటర్ల నీటి సామర్థ్యం కలిగిన పాత ట్యాంకు ఉంది. వీటి ద్వారా నిరంతరం సరఫరా జరుగుతున్నది. మిషన్‌ భగీరథ నీళ్లు వచ్చిన మూడేండ్లలో ఇబ్బందులు తలెత్తిన దాఖలాలు లేవు.


ట్యాంకర్లను తెప్పించుకునేవాళ్లం

నీళ్లు సరిపోకపోవడంతో ట్యాంకర్లను తెప్పించుకునేవాళ్లం. ఐదారు కుటుంబాలు కలిసి ఒక ట్యాంకర్‌ నీటిని కొనుగోలు చేసేవాళ్లం. వేసవి కాలం వచ్చిదంటే ఈ బాధ ఉండేది. వ్యవసాయ బోర్లు ఉన్న వారు నీళ్లను విక్రయించి, డబ్బు సంపాదించుకునే వాళ్లు. అక్కడికి వెళితే నీటి పట్టుకోవడానికి అంగీకరించే వారు కాదు. -బాబు, శ్రీరంగవరం


 చాలా తేడా ఉంది

అప్పటికి ఇప్పటికీ చాలా తేడా ఉంది. నీళ్ల కోసం ఎన్నో బాధలు పడేవాళ్లం. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మిషన్‌ భగీరథ నీళ్లు ఇచ్చి బాధలు తీర్చింది. ఎండాకాలం వస్తుందంటే భయపడేవాళ్లం. ఐదారు నెలలు నీళ్ల బాధ ఉండేవి. గ్రామ పంచాయతీ ట్యాంకర్ల ద్వారా నీళ్లిచ్చినా సరిపోకపోవడంతో ఇబ్బంది పడేవారు. ఇప్పుడు నీరు పుష్కలంగా వస్తుండడంతో మహిళలకు బాధలు తప్పాయి. -కొర్వి బాలరాజు, శ్రీరంగవరం


నీళ్లు కొనేటోళ్లం 

మిషన్‌ భగీరథ నీళ్లు ఇయ్యక ముందు నీళ్లు కొనేటోళ్లం. పంచాయతీ నుంచి వచ్చే నీళ్లు సరిపోయేది కాదు. డ్రమ్ము నీళ్లు రూ.10 నుంచి రూ.30 వెచ్చించి కొనేటోళ్లం. ఐదు నెలలు ఇబ్బంది పడేవాళ్లం. ఇప్పుడు ఏ ఇబ్బందీ లేదు. ఇంటికి నీళ్లు వస్తున్నాయి. చాలా నయమైంది. -సకినాల అనుసూయ, శ్రీరంగవరం


బాధలు తప్పాయి

నీళ్ల కోసం అప్పుడు చాలా కష్టాంగా ఉండేది. ఎండాకాలం వచ్చిదంటే నీళ్ల కోసం అరిగోస పడేటోళ్లం. దినం తప్పించి దినం నీళ్లు ఇచ్చేటోళ్లు. అవి సరిపోక ఇబ్బంది పడ్డాం. కేసీఆర్‌ వచ్చినంక నీళ్లు ఇయ్యడంతో బాధలు తప్పాయి. ఇండ్లకే నీళ్లు వస్తుండడంతో కష్టాలు తీరాయి.

-కుమ్మరి భారతమ్మ, శ్రీరంగవరం


logo