శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Medchal - Mar 06, 2020 , 01:25:34

జ్వరం ఉంటే తప్ప..మాస్కులు అక్కర్లేదు

జ్వరం ఉంటే తప్ప..మాస్కులు అక్కర్లేదు
  • ఆరోగ్యంగా ఉన్నవారికి ఏ ఇబ్బందీ లేదు
  • ‘వర్క్‌ ఫ్రం హోం’ అవసరం లేదు
  • నగరంలో కరోనా లేదు
  • అందరూ ప్రశాంతంగా పనిచేసుకోవచ్చు
  • ఏవైనా అనుమానాలుంటే 104కు ఫోన్‌ చేయండి
  • అనధికార మెసేజ్‌లు, మెయిల్స్‌లను షేర్‌ చేయొద్దు పుకార్లను నియంత్రించండి
  • 250 ఐటీ కంపెనీలతో సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ సమావేశం


సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: నగరంలో కరోనా లేదని.. ఎవరూ కంగారు పడొద్దని  సైబరాబాద్‌ సీపీ, ‘కరోనా’ నోడల్‌ అధికారి సజ్జనార్‌ తెలిపారు. జ్వరం ఉంటే తప్ప మాస్కులు ధరించాల్సిన అవసరం లేదని సూచించారు. అధికారికంగా వెలువడిన వార్తలనే నమ్మాలని, సోషల్‌ మీడియాలో వచ్చే పుకార్లు షేర్‌ చేయవద్దని పేర్కొన్నారు.  గురువారం సొసైటీ ఫర్‌ సైబర్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌తో పాటు పలు కార్పొరేట్‌ కంపెనీల యాజమాన్యాలు, ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశంలో సీపీ మాట్లాడారు.


నగరంలో కరోనా లేదని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని, జ్వరం ఉంటే తప్ప..మాస్కులు ధరించాల్సిన అవసరం లేదని  సైబరాబాద్‌ సీపీ, కరోనా నోడల్‌ అధికారి సజ్జనార్‌ తెలిపారు. మైండ్‌ స్పేస్‌ ఐటీ సముదాయంలో ఓ ఉద్యోగికి కరోనా సోకినట్టుగా బుధవారం వెలువడిన వార్తల్లో నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. పుణె నుంచి వచ్చిన నివేదికలో ఫలితం నెగిటివ్‌గా వచ్చిందని నిర్ధారించారు. కరోనాపై ఐటీ కారిడార్‌లో నెలకొన్న గందరగోళాన్ని తొలగించేందుకు  సీపీ సజ్జనార్‌ గురువారం సొసైటీ ఫర్‌ సైబర్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌తో పాటు పలు కార్పొరేట్‌ కంపెనీల యాజమాన్యాలు, ఉన్నతాధికారులతో  సమావేశమయ్యారు. సీపీ మాట్లాడుతూ..రహేజా మైండ్‌ స్పేస్‌ ఉద్యోగికి కరోనా ఉన్నట్టుగా సోషల్‌ మీడియాలో వచ్చిన వదంతులను ఆయన తోసిపుచ్చారు. నగరంలో అసలు కరోనా లేదని అందరూ ప్రశాంతంగా ఉండాలని సీపీ స్పష్టం చేశారు. వదంతులు వచ్చినప్పుడు వాటిని నియంత్రించిడానికి, నిజాలు నిర్ధారించుకోవడానికి పలు సూచనలు చేశారు. వైరస్‌ వ్యాప్తిపై సోషల్‌ మీడియాలో వెల్లువలా వస్తున్న పుకార్లను నమ్మవద్దని ఐటీ సంస్థలకు సూచించారు. కరోనా లేదని ఉద్యోగులు భయం లేకుండా పనిచేసుకోవచ్చన్నారు. ఉద్యోగులతో ‘వర్క్‌ ఫ్రం హోం’ చేయించాల్సిన అవసరం లేదన్నారు. సమావేశంలో 250 ఐటీ కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. ఎస్‌సీఎస్‌సీ ప్రధాన కార్యదర్శి కృష్ణ , ఉపాధ్యక్షులు భరణీ కుమార్‌, హెచ్‌వైసీఈఏ అధ్యక్షులు మురళీ , సీవోవో శ్రీనివాస్‌, నాస్కామ్‌ డైరెక్టర్‌ శ్రీకాంత శ్రీనివాసన్‌, ఎస్‌టీపీఐ డైరెక్టర్‌ రామ్‌ప్రసాద్‌ పాల్గొన్నారు. 


logo