ఆదివారం 29 మార్చి 2020
Medchal - Mar 04, 2020 , 01:51:00

పరిశుభ్రంగా పట్టణాలు

పరిశుభ్రంగా పట్టణాలు

షాద్‌నగర్‌, నమస్తే తెలంగాణ, షాద్‌నగర్‌టౌన్‌: ప్లాస్టిక్‌ రహిత పట్టణంగా షాద్‌నగర్‌ మున్సిపాలిటీని తీర్చిదిద్దుకుందామని మున్సిపల్‌ చైర్మన్‌ కొందూటి నరేందర్‌ అన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా  మున్సిపాలిటీలోని 28వ వార్డు గాంధీనగర్‌కాలనీలో మంగళవారం ప్రత్యేకాధికారి, ఆర్డీఓ రాజేశ్వరి, మున్సిపల్‌ కమిషనర్‌ లావణ్యతో కలిసి విద్యార్థులచే ప్లాస్టిక్‌ నియంత్రణ, తడి,పొడి చెత్తపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మానవాళికి ముప్పుగా మారిన ప్లాస్టిక్‌ భూతాన్ని తరిమికొడదాం పర్యావరణాన్ని కాపాడుదామని పిలుపునిచ్చారు.  నిషేధిత ప్లాస్టిక్‌ను ఎవరూ విక్రయించరాదని సూచించారు. ప్లాస్టిక్‌తో కూడిన వస్తువులకు భూమిలో కరిగిపోయే స్వభావం ఉండదని, అవి ఎన్ని సంవత్సరాలైనా అలాగే ఉంటాయనే విషయాన్ని అందరూ తెలుసుకోవాలన్నారు. వీలైనంత వరకు ఆ వస్తువులను విక్రయించకుండా, వినియోగించకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. వీటి వల్ల భూమి, నీరు, గాలి కాలుష్యమవుతుందన్నారు. ప్లాస్టిక్‌ను పూర్తిగా నిర్మూలించే విధంగా అందరూ అవగాహన పెంచుకోవాలన్నారు. పర్యావరణానికి, ఆరోగ్యానికి హాని కలిగించే కవర్లను వినియోగించకుండా పేపర్‌, జనపనార, బట్టతో తయారు చేసిన బ్యాగులను వినియోగించాలన్నారు. అదే విధంగా మున్సిపాలిటీలోని 26వ వార్డు కౌన్సిలర్‌ వెంకట్రాంరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన ర్యాలీలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా 16వ వార్డులో వైస్‌ చైర్మన్‌ ఎంఎస్‌ నటరాజ్‌తో పాటు  28వార్డుల్లో స్థానిక కౌన్సిలర్లు ప్లాస్టిక్‌ నిర్మూలనపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శరత్‌బాబు, ఎంఈఓ శంకర్‌రాథోడ్‌, కౌన్సిలర్‌ ప్రతాప్‌రెడ్డి, వార్డు ప్రత్యేకాధికారి, కమిటీ సభ్యులు, వార్డు వాసులు పాల్గొన్నారు. 

పట్టణ పరిశుభ్రతకు అందరూ కలిసి రావాలి..  

పట్టణ పరిశుభ్రత అందరి బాధ్యతనే విషయాన్ని పట్టణవాసులు గ్రహించాలని మున్సిపల్‌ చైర్మన్‌ కొందూటి నరేందర్‌ అన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ప్రతి వార్డులో అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించి శుభ్రం చేయడం జరిగిందన్నారు. అదే విధంగా శుభ్రం చేసిన వార్డుల్లో, ఖాలీ స్థలాలలో స్థానికులు ఎవరు కూడ ఎలాంటి చెత్తాచెదారం వేయరాదని సూచించారు.  ఎక్కడ ఎలాంటి సమస్య ఉన్న వార్డు ప్రత్యేకాధికారి, వార్డు కమిటీ సభ్యులు స్థానిక కౌన్సిలర్‌, అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. పట్టణ ప్రగతితో ప్రతి వార్డు శుభ్రంగా మారిందన్నారు.   తడి, పొడి చెత్తను వేర్వేరుగా వేయాలని సూచించారు. తడి చెత్తతో ఎరువును తయారు చేయడంతో పాటు పొడి చెత్తను తిరిగి ఉపయోగించే విధంగా రీసైకిలింగ్‌ చేయడం జరుగుతుందని సూచించారు. 


logo