శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Medchal - Mar 04, 2020 , 01:47:59

నేటి నుంచి ఇంటర్‌ పరీక్షలు

నేటి నుంచి ఇంటర్‌ పరీక్షలు

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ:    ఇంటర్మీడియెట్‌ పరీక్షలకు జిల్లా యంత్రాంగం పూర్తి ఏర్పాట్లు చేసింది. నేటి నుంచి మార్చి 4వ తేదీ వరకు నిర్వహించే ఈ పరీక్షల నిర్వహణకు సంబంధిత అధికారులు ఏర్పాట్లు చేశారు. విద్యార్థులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా తగు చర్యలు తీసుకున్నారు. కేంద్రాల్లో విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు దృష్టి సారించారు. ఈ మేరకు జిల్లా యంత్రాంగం పరీక్షల నిర్వహణపై ఇప్పటికే అధికారులు ముందస్తు చర్యలు తీసుకున్నారు.విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షలు మార్చి 4న ప్రారంభం కాగా. .21 వరకు, ద్వితీయ సంవత్సరం పరీక్షలు మార్చి 5 నుంచి 23వ తేదీ జరగనున్నాయి.ఈ పరీక్షలు నిఘా నేత్రాలు (సీసీ కెమెరాల) పర్యవేక్షణలో జరుగుతున్నాయి.జిల్లాలోని అన్ని పరీక్ష కేంద్రాల్లోనూ సీసీ కెమెరాలను అందుబాటులో ఉంచారు.విద్యార్థులు సకాలంలో పరీక్షలకు హాజరుకావాలని, నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు. పరీక్షలు రాసే సమయంలో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పకుండా చూసుకోవాలని,ఆర్టీసీ బస్సులను పరీక్ష వేళ్లలో విద్యార్థులకు సరిపడా నడిపేందుకు సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకున్నారు. వేసవి రాకముందే ఎండలు మండుతున్నాయి. ఈ నేపథ్యంలో పరీక్ష కేంద్రాల వైద్యసిబ్బందితో పాటు ప్రథమ చికిత్స కిట్లు, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లను అందుబాటులో ఉంచేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంది.            జిల్లాలోని సైబరాబాద్‌, రాచకొండ పోలీస్‌ కమిషనరేట్‌ల పరిధిలో ఈ పరీక్షలు జరుగుతున్నాయి.మొత్తం 28 పోలీస్‌ స్టేషన్ల పరిధిలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ పరీక్ష కేంద్రాల వద్ద పట్టిష్టమైన భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. 144 సెక్షన్‌ అమల్లో ఉంటుంది. ప్రతి పరీక్ష కేంద్రంపై నిరంతరం పర్యవేక్షణ జరిగేలా ఉన్నతాధికారులు కార్యచరణ రూపొదించారు. మరోవైపు ఇంటర్మీడియట్‌ బోర్డు అధికారులు విద్యార్థులకు హాల్‌ టికెట్లను ఇప్పటికే అందించారు. విద్యార్థుల పరీక్ష కేంద్రాలు ఏయే ప్రాంతాల్లో ఉన్నాయన్న దానిపై స్పష్టత వచ్చింది. రెండు రోజుల ముందేగానే కేంద్రాలను విద్యార్థులను సందర్శించారు.

పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు జరగనున్నాయి. విద్యార్థులు ఉదయం 8 గంటల వరకు కేంద్రాలకు వచ్చేలా ప్రణాళిక చేసుకున్నారు. ఉదయం 8.30 గంటలకు కేంద్రాల్లోకి అనుమతి ఉండగా.. ఉదయం 8.45 గంటల పరీక్ష నిర్వహణ పనులు మొదలు చేస్తున్నారు. 9 గంటలకు ప్రశ్నపత్రం ఇవ్వనున్నారు. పరీక్షల ప్రశ్నాపత్రాల సంచులను కెమెరాల పర్యవేక్షణలో తెరవడం, జవాబు పత్రాలను కేంద్రాలకు తరలిస్తున్నారు. 

 జిల్లాలో 141 కేంద్రాలు..

   జిల్లా వ్యాప్తంగా 141 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. అందులో 17 ప్రభుత్వ, 5టీఎస్‌డబ్ల్యూఆర్‌,2 ఎయిడెడ్‌,1టీఎంఆర్‌జేసీ,1టీఎస్‌ఎంఎస్‌,115 ప్రైవేట్‌ సెంటర్లు కళాశాలలు ఉన్నాయి. ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరంలో కలిపి మొత్తం 1,18,608 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. జూనియర్‌ విద్యార్థులు 63,548 కాగా.. ద్వితీయ సంవత్సరంలో 55,160 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇందుకోసం 141 మంది చీఫ్‌ సూపరిండెంట్లను, 141 మంది డిపార్ట్‌మెంటల్‌ అధికారులు, నాలుగురు ఫ్లయింగ్‌ స్కాడ్‌లు,5 గురు సిట్టింగ్‌ స్కాడ్‌లు, 59 కస్టోడియాన్లు, 1 హైపవర్‌ కమిటీ లను నియమించారు.పరీక్షా కేంద్రాలను సులువుగా గుర్తించేలా టీఎస్‌బీఐఈ సర్వీసెస్‌ యాప్‌ను విద్యార్థులు ఉపయోగించుకోనున్నారు. 


logo