ఆదివారం 29 మార్చి 2020
Medchal - Mar 03, 2020 , 05:48:27

కదల్లేని వారికి ఇంటివద్దకే భోజనం

 కదల్లేని వారికి ఇంటివద్దకే భోజనం
  • క్యాంటీన్ల వద్దకు రాలేని దివ్యాంగులు, వృద్ధులకు హాట్‌ ప్యాక్‌లలో చేరవేత
  • తొలి విడుతలో రోజూ 50మందికి ఆ తర్వాత రోజూ 1200మందికి
  • మొబైల్‌క్యాంటీన్‌ను ప్రారంభించిన మంత్రి తలసాని, మేయర్‌ రామ్మోహన్‌, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌,మున్సిపల్‌ కార్యదర్శి అర్వింద్‌కుమార్‌

దారినపోయే వేలాది మంది నిత్య శ్రామికులకు ఆకలి తీరుస్తున్న     ‘అన్నపూర్ణ’.. ఇక నుంచి కదల్లేని స్థితిలో ఉన్న నిస్సహాయులకు అన్నం పంపనుంది. వేడి వేడి హాట్‌ ప్యాక్‌లలో పార్సిల్‌ చేసి మరీ ఇంటికే పంపనుంది. 5 రూపాయలకే భోజనమందిస్తున్న అన్నపూర్ణ భోజన పథకం మొదలై ఆరేండ్లు పూర్తయిన సందర్భంగా సోమవారం మొబైల్‌ క్యాంటీన్‌ ప్రారంభమైంది. ప్రస్తుతానికి ఈ పద్ధతిన 50మందికి భోజనం అందిస్తారు. ఆ తర్వాత జోన్లవారీగా 1200మంది దివ్యాంగులకు వృద్ధులకు సరఫరా చేయనున్నారు. ఈ మొబైల్‌ క్యాంటీన్లను మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌, హైదరాబాద్‌ మేయర్‌ బొంతు రామ్మోహన్‌, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్‌కుమార్‌, మున్సిప ల్‌శాఖ కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ సోమవారం ప్రారంభించారు. నగరంలో 8 కేంద్రాల నుంచి 150 కేంద్రాలకు విస్తరించిన అన్నపూర్ణ క్యాంటీన్లలో ఇప్పటివరకు 4 కోట్ల మంది భోజనం చేసినట్టు        గణాంకాలు తెలుపుతున్నాయి. 


  సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : మొబైల్‌ క్యాంటీన్లను సోమవారం అమీర్‌పేట్‌లో మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారం భించారు.  ఈ కార్యక్రమంలో మేయర్‌ బొంతు రామ్మోహన్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, మున్సిపల్‌ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. అనంతరం క్యాంటీన్‌ వద్ద భోజనాలు వడ్డించారు. ఇప్పటి వరకు ఈ పథకం ద్వారా నాలుగు కోట్లమంది భోజనం చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ మర్గనిర్దేశం ప్రకారం అన్నపూర్ణ పథకాన్ని నగరంలో ఎనిమిది కేంద్రాల నుంచి 150 కేంద్రాలకు విస్తరించడమే కాకుండా ఇతర జిల్లాలో కూడా ఏర్పాటుచేసినట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా ఎంతో గుర్తింపు పొందిన ఈ పథకం ద్వారా నగరంలో రోజూ 30 నుంచి 35వేల మంది తమ ఆకలి తీర్చుకుంటున్నట్లు, ఇందులో అమీర్‌పేట్‌ కేంద్రంలో అత్యధికంగా 1200 మంది భోజనం చేస్తున్నట్లు పేర్కొన్నారు. 


విద్యార్థులు, రోగులు, వారివెంట వచ్చేవారు, కూలీలు ఎక్కువ ప్రయోజనం పొందుతున్నట్లు తెలిపారు. 2014, మార్చి ఒకటిన అప్పటి జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ సోమేశ్‌ కుమార్‌ నాంపల్లిలో ఈ పథకాన్ని ప్రారంభించినట్లు గుర్తుచేస్తూ ఆయనతోపాటు నామమాత్ర ధరకు నాణ్యమైన భోజనాన్ని సమకూర్చుతున్న హరేరామ ఫౌండేషన్‌ నిర్వాహకులను మంత్రి అభినందించారు. పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ ఆదేశాల ప్రకారం నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. మోడల్‌ మార్కెట్లు, ఫుట్‌పాత్‌లు, వీధిలైట్లు, వైట్‌ టాపింగ్‌ రోడ్లు, వైకుంఠధామాలు తదితర పనులు ఇందులో ముఖ్యమైనవన్నారు. హైదరాబాద్‌ నగరం దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నదని, అందుకు అనుగుణంగా ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు మంత్రి తలసాని వెల్లడించారు. హరేకృష్ణ మూవ్‌మెంట్‌ చారిటబుల్‌ ఫౌండేషన్‌ అధ్యక్షుడు సత్యగౌరచంద్ర మాట్లాడుతూ అన్నపూర్ణ పథకం రాష్ట్రంలోని 16 పట్టణాల్లో 176 కేంద్రాల ద్వారా రోజుకు 45 వేలమంది ఆకలి తీర్చుతున్నట్లు తెలిపారు. ఈ పథకానికి పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ 2017, మార్చి 16న అన్నపూర్ణ పథకంగా నామకరణం చేసినట్లు తెలిపారు. 


ఎవ్వరూ ఆకలితో ఉండకూడదు..

ఎవ్వరూ ఆకలితో ఉండరాదనే ఉద్దేశ్యంతోనే అప్పట్లో అన్నపూర్ణ పథకాన్ని ప్రవేశపెట్టాం. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఈ కేంద్రాలను నగరమంతా విస్తరించాం.  ఆకలిగొన్నవారికి అన్నాన్ని సమకూర్చుకునే విద్యను నేర్పడం ఎంత ముఖ్యమో, ముందుగా వారి ఆకలి తీర్చడం కూడా అంతే ప్రధానం.  యాచకుడు కూడా తనవద్దగల రూ. 10తో ఆకలి తీర్చుకోవడంతోపాటు తోటి యాచకుడి ఆకలి తీర్చిన ఘటనలు తమ దృష్టికి వచ్చాం.   

-సోమేశ్‌ కుమార్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి 


విజయవంతంగా కేంద్రాలు ..

 నగరంలోని అన్నపూర్ణ కేంద్రాలు గడచిన ఆరేండ్లుగా ఎటువంటి చిన్న పొరపాటు లేకుండా విజయవంతంగా కొనసాగుతున్నాయి. కొన్ని ఇతర రాష్ర్టాల్లో ఇటువంటి పథకాలు ప్రవేశపెట్టినప్పటికీ విజయవంతం కాలేదు. సీఎం కేసీఆర్‌ ప్రోత్సాహంతో నగరంలో 150 కేంద్రాల ద్వారా అనేక వర్గాలకు నాణ్యమైన భోజనాన్ని ఈ కేంద్రాల ద్వారా అందిస్తున్నాం. 

-బొంతు రామ్మోహన్‌,మేయర్‌ 


 డా.కేవీ రమణాచారికి సత్కారం.. 

 శ్రీమానస ఆర్ట్స్‌ ఆధ్వర్యంలో గానసభలో ప్రముఖ కవి రఘుశ్రీ రచించిన ‘కవీంద్రమోక్షం’ కవితాసంకలనం ఆవిష్కరణ సభ సోమవారం నిర్వహించారు. తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ వీసీ  ఆచార్య ఎల్లూరి శివారెడ్డి ఆవిష్కరించి తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డా.కేవీ రమణాచారికి అంకితమిచ్చారు. డా.వోలే టి పార్వతీశం సభకు అధ్యక్షత వహించారు.డా.కేవీ రమణాచారిని  ఈ సందర్భంగా సత్కరించారు. 

-త్యాగరాయగానసభ 


 హోంమంత్రి మహమూద్‌ అలీ పుట్టిన రోజు సందర్భంగా సోమవారం నాంపల్లి దర్గాలో చింతల్‌ డివిజన్‌ టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు మహ్మద్‌ రఫీతో  పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం హోం మంత్రి చేతులు మీదుగా పేదలకు ఆహార పొట్లాలను అందజేశారు. డిప్యూటీ మేయర్‌ బాబా ఫసీయుద్దీన్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు షరీఫుద్దీన్‌, మసీ తదితరులు ఉన్నారు. 

 -జీడిమెట్ల 


యూసుఫ్‌గూడలో సోమవారం ఐదు రూపాయాల భోజనాన్ని ప్రారంభించి నేటితో ఆరు సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌ క్యాంటీన్‌ను పరిశీలించి ప్రజలతో కలసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ డివిజన్‌ అధ్యక్షుడు రాజ్‌కుమార్‌ పటేల్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.

-యూసుఫ్‌గూడ 


logo