మంగళవారం 31 మార్చి 2020
Medchal - Mar 02, 2020 , 06:05:14

వెంటనే వైద్యం.. నిలిచేను ప్రాణం

వెంటనే వైద్యం..  నిలిచేను ప్రాణం
  • ప్రథమ చికిత్సపై 5 వేల మంది పోలీసులకు శిక్షణ
  • 50 మందికి అత్యవసర వైద్యం అందించి ప్రాణరక్షణ
  • గోల్డెన్‌ అవర్‌లో రాచకొండ పోలీసుల వైద్య సేవలు

రోడ్డు ప్రమాదాల్లో తీవ్ర గాయాలపాలై.. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి.. పోలీసులు వెంటనే వైద్య సాయం అందించి ప్రాణభిక్ష పెడుతున్నారు. గోల్డెన్‌ అవర్‌లోనే ప్రాథమిక చికిత్స అందించి.. వారిని ప్రాణాపాయం నుంచి కాపాడుతున్నారు. రాచకొండ పరిధిలోని 5000 మంది పోలీసులకు ప్రాథమిక వైద్య చికిత్సలో శిక్షణ అందించి, వారి వద్ద మెడికల్‌ కిట్లను అందుబాటులో ఉంచారు. దీంతో పోలీసులు ప్రమాదం జరిగిన వెంటనే బాధితులకు చికిత్స చేసి వారిని రక్షిస్తున్నారు.


(సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ): శాంతి భద్రతలను నిర్వహించడం.. దొంగలను పట్టుకోవడం.. వాహనాలను సరైన మార్గంలో నడిపించడమే కాదు.. ప్రమాదాల్లో గాయపడ్డ వారికి అత్యవసర వైద్య  సేవలు అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు పోలీసులు. రోడ్డు ప్రమాదాల్లో తీవ్ర గాయాలైన వారికి, అకస్మాత్తుగా రహదారిపై కుప్పకూలిపోతున్న వారికి, పాముకాటుకు గురైన వారికి, అగ్నిప్రమాదంలో గాయాలకు గురైన వారికి గోల్డెన్‌ అవర్‌ (ఎమర్జెన్సీ సమయంలో) ప్రాథమిక చికిత్సను అందించి వారిని ప్రాణాపాయం నుంచి రక్షిస్తున్నారు.


పోలీసులకు శిక్షణ..

 పౌరులకు అవసరమయ్యే పోలీసు సేవలతో.. అత్యవసర పరిస్థితుల్లో వైద్యులుగా మారుతున్నారు. స్వచ్ఛంద సంస్థతో కలిసి రాచకొండ పోలీసులు పొందిన ప్రాథమిక వైద్య శిక్షణ 50 మందిని ప్రాణాపాయం నుంచి కాపాడింది.  దీంతో ఆ కుటుంబాల్లో ఇప్పుడు సంతోషం వెల్లివిరిసింది. రాచకొండ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో సీపీ మహేశ్‌ భగవత్‌ దాదాపు 5000 మందికి ప్రాథమిక వైద్యంపై శిక్షణ ఇవ్వడంతో ఆ సిబ్బంది ఎమర్జెన్సీలో  పోలీసు డాక్టర్‌లుగా మారుతున్నారు. పెట్రోలింగ్‌ మొబైల్‌ సిబ్బంది, ట్రాఫిక్‌ పోలీసుల వద్ద మెడికల్‌ కిట్‌లను అందుబాటులో ఉంచడంతో రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు తీవ్రంగా రక్త స్రావం కాకుండా వెంటనే మెడికల్‌ కిట్‌ ద్వారా వాటిని నియంత్రించి నిమిషాల్లో దవాఖానలకు తరలిస్తున్నారు. హార్ట్‌ ఎటాక్‌తో రోడ్డు పైన పడిపోయిన వారికి సీపీఆర్‌(కార్డియాక్‌ పల్‌మనరీ రెసిస్‌ట్యూషన్‌) సేవలను అందించి వారిని విషమ పరిస్థితి నుంచి కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. 


తల తిరిగి..కింద పడిపోయింది...

ఎల్బీనగర్‌ ప్రాంతంలో ఇటీవల పోచంపల్లి గ్రామానికి చెందిన ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌(23) సాయంత్రం సమయంలో బస్సు దిగి మరో బస్సు ఎక్కడానికి రోడ్డు దాటుతుంది. ఇంతలో ఒక్కసారిగా ఆ యువతి కళ్లు తిరిగి రోడ్డు పై ఉన్న సిమెంట్‌ బ్లాక్‌ మీద పడిపోయింది. దీంతో తలకు తీవ్ర గాయమై రక్తం కారిపోతుంది. అక్కడ ఉన్న వాళ్లు అందరూ చూస్తున్నారు. అదే సమయంలో విధుల్లో ఉన్న ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ నాగమల్లు వెంటనే ఆయన నేర్చుకున్న ప్రాథమిక వైద్య చిట్కాలతో తన దగ్గర ఉన్న మెడికల్‌ కిట్‌ ద్వారా ప్రాథమిక వైద్యం చేశాడు. ఆటోలో స్థానిక దవాఖానలో చేర్పించారు. వెంటనే వైద్యులు తమ సేవలు అందించి ఆ యువతిని ప్రాణాపాయస్థితి నుంచి కాపాడారు. వైద్యులతో పాటు, కుటుంబ సభ్యలు ఇన్‌స్పెక్టర్‌ను అభినందించారు.


స్కూల్‌ విద్యార్థి..

ఇబ్రహీంపట్నం ప్రాంతంలోని ఓ ప్రైవేట్‌ స్కూల్‌లో  చదువుతున్న విద్యార్థి(11) అకస్మాత్తుగా తీవ్రమైన చెమటలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అంబులెన్స్‌కు ఫోన్‌ చేసినా.. అందరూ బిజీగా ఉండటంతో యాజమాన్యం వెంటనే డయల్‌ 100కు ఫోన్‌ చేశారు. అక్కడికి వెళ్లిన పెట్రోలింగ్‌ సిబ్బంది ముందుగా విద్యార్థిని పరిశీలించి ఆస్తమా కారణంగా ఆక్సిజన్‌ స్థాయి తగ్గిపోవడంతో చెమటలు పట్టాయని గుర్తించింది. ముందుగా గుంపును తొలగించి వెలుతురు, గాలి వచ్చేలా చేశారు. అనంతరం వెంటనే పాఠశాలలో ఉన్న ఏసీ గదిలోకి తీసుకువెళ్లి  రిలాక్స్‌ చేయించారు. విద్యార్థికి ఆ గదిలో ఆక్సిజన్‌ సరైన మోతాదులో అందడంతో కొంత చెమటలు తగ్గాయి. వెంటనే పెట్రోలింగ్‌ మొబైల్‌ దవాఖానకు తరలించి విద్యార్థికి మెరుగైన వైద్య సేవలు అందించారు. పోలీసులు ప్రాథమిక వైద్య చికిత్సలు నేర్చుకోవడంతో ముందస్తుగా కారణాన్ని గుర్తించి అందించిన ప్రాథమిక వైద్య సేవలకు అందరూ హ్యాట్సాప్‌ తెలిపారు.


మొదటి గంట కీలకం..

రోడ్డు ప్రమాదాలు,  ఇతర అత్యవసర సేవల్లో మొదట ప్రాథమిక చికిత్స చాలా కీలకం. ఈ మొదటి గంటలో సమయానికి వైద్య సేవలు అందితే కచ్చితంగా ప్రాణం నిలబడుతుంది.  ఈ నేపథ్యంలోనే స్వచ్ఛంద సంస్థ G1 తో కలిసి వివిధ అనారోగ్య కారణాలకు సంబంధించిన వైద్య అంశాలపై సిబ్బందికి అవగాహన కల్పించడంతో పాటు వారికి ప్రాథమిక చికిత్స ఎలా అందించాలనే విషయాలపై శిక్షణ ఇస్తున్నాం. దీంతో నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే పోలీసులకు ఈ శిక్షణ ఉపయోగపడుతుందని భావించి మా పోలీసులను ఫస్ట్‌ రెస్పాండర్‌గా తీర్చిదిద్దుతున్నాం. ఈ శిక్షణతో మా పోలీసు సిబ్బంది గోల్డెన్‌ అవర్‌లో ప్రాథమిక వైద్య చికిత్సలను అందించి చాలా మంది ప్రాణాలను నిలిపారు.

-మహేశ్‌ భగవత్‌, రాచకొండ పోలీసు కమిషనర్‌


రోడ్డు ప్రమాదంలో గాయమైన వ్యక్తికి  వైద్యం అందిస్తున్న 

ఎల్బీనగర్‌ ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ (ఫైల్‌)


తల్లీబిడ్డ క్షేమం...

మల్కాజిగిరి ప్రాంతంలో భార్యాభర్తలు గొడవపడ్డారు. భార్య 4 నెలల గర్భం దాల్చడంతో దానిని తొలగించాలని భర్త గొడవపడ్డాడు. ఇలా ఇద్దరి మధ్య ఇటీవల పెద్ద గొడవ అయింది. మరో నాలుగు సంవత్సరాల వరకు పిల్లల వద్దంటూ భర్త భార్య కడుపు పై పిడిగుద్దులతో దాడి చేశాడు. ఆ మహిళ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. స్థానికులు చూస్తున్నారే తప్పా ఎవరు సాయం చేయడానికి ముందుకు రాలేదు. చివరకు డయల్‌ 100కు ఫోన్‌ చేయడంతో పోలీసులు వెంటనే చేరుకొని ఆ మహిళకు ప్రాథమిక వైద్య సేవలు అందించి అంబులెన్స్‌లో గాంధీ దవాఖానకు తరలించారు. 12 గంటల్లో పర్యవేక్షణలో పెట్టి గాంధీ వైద్యులు మెరుగైన సేవలను అందించడంతో కడుపులోని పాపతో పాటు తల్లి క్షేమంగా బయటపడ్డారు. ఈ మాట మహిళ కుటుంబ సభ్యులతో పాటు పోలీసులకు చాలా సంతోషాన్ని కలిగించింది. ఈ విధంగా హార్ట్‌ ఎటాక్‌తో కూడా కుప్పకూలిపోయిన వారికి పోలీసులు వైద్య సేవలను అందించి దవాఖానలకు తరలించి ఆ కుటుంబాల్లో సంతోషాన్ని నింపారు. ప్రాథమిక వైద్య చికిత్స చిట్కాలతో ప్రాణాలను నిలపడంలో ఫ్టస్ట్‌ రెస్పాండర్‌గా పోలీసులు ప్రాథమిక వైద్య సేవలను అందిస్తున్నారు.


ఇద్దరిని కాపాడాను..

మాకు అవగాహన కల్సించిన వైద్య సేవలతో ఇద్దరిని కాపాడాను. ఆ కుటుంబాలు మమ్మల్ని అభినందిస్తుంటే చాలా ఆనందం వేసింది. దవాఖానలో వైద్య సేవలు అందేవరకు ఓ మనిషిని కాపాడగలుగుతామనే నమ్మకం ఉంది. సమయానికి మీరు తీసుకురావడం వల్ల ఓ ప్రాణం నిలిపారని  వైద్యులు అనే మాటలు మా సేవలకు దక్కిన గౌరవంగా భావిస్తాం. ప్రజల మధ్యలో ఉండే మేము పౌరుల ప్రాణాలను కాపాడడంలో కీలకంగా మారేలా మాకు అందించిన వైద్య శిక్షణ చిట్కాలు ఇప్పుడు మా ప్రతిష్టను మరింతగా పెంచాయి.   

-నర్సింహులు,  పోలీసు కానిస్టేబుల్‌,మల్కాజిగిరి పీఎస్‌


logo
>>>>>>