శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Medchal - Feb 29, 2020 , 02:56:33

నోరూరించి.. మైమరిపించి..

నోరూరించి.. మైమరిపించి..
  • ఎన్టీఆర్‌ స్టేడియంలో ‘ఫిష్‌ ఫుడ్‌ ఫెస్టివల్‌'
  • ప్రారంభించిన మంత్రి తలసాని
  • వందకు పైగా వెరైటీలు.. ప్రత్యేక డిష్‌లు
  • రుచులను ఆస్వాదిస్తున్న నగరవాసులు
  • మార్చి 1 వరకు ఉదయం 11 నుంచి రాత్రి 11 గంటల వరకు అందుబాటులో..

నెక్లెస్‌రోడ్‌లోని పీపుల్స్‌ ప్లాజాలో చికెన్‌, కోడిగుడ్డు మేళా ఘుమఘుమలాడింది.  ఎన్టీఆర్‌ స్టేడియంలోనూ ఫిష్‌ ఫుడ్‌ ఫెస్టివల్‌ కను‘విందు’ చేసింది. శుక్రవారం ఏర్పాటైన ఈ రెండు ఉత్సవాలు నగరవాసులకు నోరూరించాయి.  తమకు ఇష్టమైన పదార్థాలను కడుపునిండా ఆరగించి మైమరిచిపోయారు. ఆహా ఏమి రుచి అంటూ.. కితాబిచ్చారు. 


సిటీబ్యూరో/కవాడిగూడ, నమస్తే తెలంగాణ :ఫిష్‌ ఫుడ్‌ ఫెస్టివల్‌లో.. వందకు పైగా వెరైటీలు..పసందైన రుచులు..నోరూరించే ప్రత్యేక డిష్‌లు..నగరవాసులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఒక్క చోటే విభిన్న రకాల చేపల వంటకాలు అందుబాటులో ఉన్నాయి. ఎన్టీఆర్‌ స్టేడియంలో హైదరాబాద్‌ జిల్లా మత్య్సపారిశ్రామిక సహకార సంఘం ఆధ్వర్యంలో ‘ఫిష్‌ ఫుడ్‌ ఫెస్టివల్‌'ను శుక్రవారం రాష్ట్ర పశు సంవర్థక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖామంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గంగపుత్రులు, ముదిరాజుల గోసను ఎవ్వరూ పట్టించుకోలేదన్నారు. మహిళలంతా కలిసి ఫిష్‌ ఫుడ్‌ ఫెస్టివల్‌ ఏర్పాటు చేసుకుని చేప వంటకాలపై అందరికి అవగాహన కలిగిస్తుండడం మంచి పరిణామమని పేర్కొన్నారు. వారిని మరింత ప్రోత్సహించడానికి ప్రభుత్వం ప్రతి మున్సిపాలిటీ పరిధిలో ఔట్‌లెట్‌ ఏర్పాటు చేయబోతున్నట్టు హామీ ఇచ్చారు. చేపలు విక్రయించుకోవడానికి ఈ ఔట్‌లెట్స్‌ ఉపయోగపడుతాయని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఫిష్‌ మార్కెట్లు ఏర్పాటు చేస్తామన్నారు. చేపల ఉత్పత్తి తెలంగాణలో ఎక్కువగా ఉందని.. ప్రపంచమంతా ఎగుమతి చేసే స్థాయికి చేరుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. రాంనగర్‌ ఫిష్‌ మార్కెట్‌ ఇరుకుగా ఉందని నిర్వాహకులు తమ ఇబ్బందులను తమ దృష్టికి తీసుకొచ్చారని, వాటిని త్వరలోనే పరిష్కరిస్తామని చెప్పారు. గంగపుత్రులంతా కలిసి మాట్లాడుకుని..తమ వద్దకు వస్తే ఆ మార్కెట్‌ను విశాలంగా ఆర్టీసీ క్రాస్‌రోడ్డు సమీపంలో నిర్మించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. అనంతరం ముషీరాబాద్‌ ఎమ్మెల్యే ముఠాగోపాల్‌ మాట్లాడుతూ రాంనగర్‌ ఫిష్‌ మార్కెట్‌ సమస్యలను పరిష్కరించాల్సిందిగా మంత్రిని కోరారు. కార్యక్రమంలో మత్స్యశాఖ కమిషనర్‌ సువర్ణ, ఎన్‌ఎఫ్‌డీబీ డైరెక్టర్‌ జనార్దన్‌, జాయింట్‌ డైరెక్టర్‌ రాథోడ్‌, ఏడీ రజని, జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షురాలు కొప్పు పద్మ, డైరెక్టర్లు తులసి, పద్మ, లలిత, అరుణ, విజయకుమార్‌, నాగమణి తదితరులు పాల్గొన్నారు.


20 స్టాల్స్‌.. అదిరే రుచులు..

ఫిష్‌ బిర్యానీ, ఫ్రాన్స్‌ బిర్యానీ, జొన్నరొట్టె చేపల పులుసు, రాగి సంకటి, ఫిష్‌ కట్లెట్‌, ఫిష్‌ లాలీపాప్‌, ఫిష్‌ దిల్‌ పసంద్‌, ఫిష్‌రోల్‌, ఫిష్‌ సమోసా, ఫిష్‌ బాల్స్‌, అపోలో ఫిష్‌, ఫింగర్‌ ఫిష్‌, ఫిష్‌ వడియాలు, ఫిష్‌ జంతికలు, ఫిష్‌ చపాతి, ఫిష్‌ అప్పడాలు, హోల్‌ ఫిష్‌ ప్రై, ఫిష్‌ హలీం, ఫిష్‌ కాకరకాయ తదితర వెరైటీలు ఫెస్టివల్‌లో అందుబాటులో ఉన్నాయి. మొత్తం 20 స్టాల్స్‌ ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌కు చెందిన గంగపుత్ర మహిళలు.. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ ఫెస్టివల్‌ను ఏర్పాటు చేశారు. మార్చి 1వరకు ఫెస్టివల్‌ ఉంటుంది. ఉదయం 11నుంచి రాత్రి 11గంటల వరకు కొనసాగుతుంది. తక్కువ ధరల్లో అద్భుత చేప వంటకాలను నగరవాసులకు పరిచయం చేయడమే ఈఫెస్టివల్‌ ముఖ్య ఉద్దేశం. సంప్రదాయ రుచులు, ప్రోజెన్‌ సీ ఫుడ్‌, ఎం డు చేపలు, రెడీటూఈట్‌ ఫిష్‌ను అందుబాటులో ఉంచారు.  


గంగపుత్రులకు ప్రభుత్వం అండగా ఉంది

చేపలు మంచి పోషకాహారం. చేపలను ఏ రూపంలో తీసుకున్నా ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఫిష్‌ ఫుడ్‌ ఫెస్టివల్‌ను ఏర్పాటు చేయడం ఇదే ప్రథమం. గంగపుత్రులకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంది. సీఎం కేసీఆర్‌ ప్రోత్సాహంతోనే మేము ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. 6 నెలలకోమారు ఫెస్టివల్‌ను ఏర్పాటు చేస్తాం.  - కొప్ప పద్మ, జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షురాలు 


రుచిని పరిచయం చేయడమే లక్ష్యం

చేపలతో ఎన్ని వెరైటీలు చేయొచ్చో ..అన్ని ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. చేపల రుచులను నగరవాసులకు పరిచయం చేయడమే ఈ ఫెస్టివల్‌ ప్రధాన ఉద్దేశం. చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. డాక్టర్లు కూడా చేపలు తినాలని రెఫర్‌ చేస్తారు. ఏ స్టాల్‌ వంటకాలు బాగున్నాయోనని కస్టమర్లు ఇచ్చిన ఫీడ్‌బ్యాక్‌ ఆధారంగా వారికి మహిళా దినోత్సవం రోజున బహుమతులు కూడా ప్రదానం చేస్తాం. 

- కన్నం తులసి, డైరెక్టర్‌


ఫెస్టివల్‌కు ఆదరణ బాగుంది

నగరవాసులు చేపల వంటకాలను ఇష్టంగా తింటున్నారు. వారికి నచ్చిన రుచులన్నీ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. చేపలతో ఎన్ని వెరైటీలు చేయొచ్చో అన్నీ ఇక్కడ లభిస్తాయి. మా చేపల వంటకాలను పరిచయం చేసుకునేందుకు అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు.

- సంధ్య, స్టాల్‌ నిర్వాహకురాలు


logo