బుధవారం 01 ఏప్రిల్ 2020
Medchal - Feb 29, 2020 , 02:53:06

మత్స్యావతారం పుష్పాలంకృతం

మత్స్యావతారం పుష్పాలంకృతం
  • దివ్యరూపాన్ని దర్శించి.. తరించిన భక్తజనం
  • నయన మనోహరమైన యాదాద్రి పుణ్యక్షేత్రం
  • యాదాద్రి పుణ్యక్షేత్రం నయన మనోహరమైంది. భక్తజనం పులకించిపోయింది.

లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన శుక్రవారం దివ్యతేజస్సుతో పుష్పాలంకృతుడైన స్వామివారు మత్స్యావతారంలో కటాక్షించారు. వేదరక్షణ కోసం భగవానుడు రూపుదాల్చిన అవతార ఘట్టాన్ని ్ర పధానార్చకులు కండ్లకు కట్టినట్లు వివరించారు. ఇక కల్యాణ ఘట్టానికి  సిద్ధమైన నరసింహుడు పెళ్లి కొడుకుగా, అమ్మవారిని పెళ్లికూతురుగా అందంగా అలంకరించారు. ఆ దివ్యమంగళరూపాన్ని దర్శించుకున్న భక్తులు..  తన్మయత్వం పొందగా, ఆలయం గోవింద నామస్మరణతో మార్మోగిపోయింది. 


శేషవాహనంపై శ్రీవారు

వాహనసేవలో భాగంగా శేషవాహనంపై స్వామి వారిని శుక్రవారం రాత్రి ఊరేగించారు. దేవదేవుడిని దర్శించుకున్న భక్తులు ఆనంద కర్పూర నీరాజనాలు సమర్పించారు. మూడో రోజు బ్మ్రహ్మోత్సవాల కార్యక్రమాలకు భువనగిరి ఆర్డీవో ఎంవీ. భూపాల్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆలయ ఈవో ఎన్‌.గీత, అనువంశిక ధర్మకర్త భాస్కరాయణి నర్సింహామూర్తి, ఏఈవో మేడి శివకుమార్‌, దోర్బల భాస్కర్‌, వేముల రామ్మోహన్‌, పర్యవేక్షకులు వేముల వెంకటేశ్‌, సార నర్సింహ, బాలాజీ తదితరులు పాల్గొన్నారు. 


ఉచిత వైద్య శిబిరం

బ్రహ్మోత్సవాల సందర్భంగా హైదరాబాద్‌ ఏఎస్‌రావునగర్‌కు చెందిన ధన్వంతరి ఆయుర్వేద వైద్యశాల వారి ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఆయుర్వేదిక్‌ డాక్టర్‌ సీహెచ్‌ విజయపాల్‌రెడ్డి ఆధ్వర్యంలోని పలువురు వైద్యులు ఉచితంగా భక్తులకు కావాల్సిన మందులు, వైద్యసలహాలు అందజేశారు. ఆలయ వైద్యాధికారి డాక్టర్‌ ప్రవీణ్‌, సిబ్బంది యాదగిరి, చందు తదితరులు పాల్గొన్నారు. 


నేడు శ్రీకృష్ణుడిగా..

శనివారం ఉదయం 11 గంటలకు మురళీకృష్ణుడి అలంకరణలో స్వామివారు దర్శనమివ్వనున్నారు. రాత్రి 9గంటలకు హంస వాహన సేవలో భక్తులకు దర్శనమిస్తారు 


నిత్యపారాయణాలు..

రుత్వికులు నిత్యపారాయణాలు, జపాలను నిర్వహించారు. ఆలయ స్థానాచార్యులు సందుగుల రాఘవాచార్యులు, యాజ్ఞికులు శేషం ప్రణీతాచార్యులు, ప్రధానార్చకులు నల్లందీగల్‌ లక్ష్మీనరసింహాచార్యులు, కారంపుడి నరసింహాచార్యులు, ఉప ప్రధానార్చకులు కాండూరి వెంకటాచార్యులు, చింతపట్ల రంగాచార్య, ఏఎం మోహనాచార్యులు, బట్టర్‌ సురేంద్రాచార్యులు ఆధ్వర్యంలో ఉత్సవ కైంకర్యాలు 

జరిగాయి. 


అలంకార సేవలు ప్రారంభం..

బాలాలయంలో వేదమంత్రాల పఠనం... మంగళవాయిద్యాలు.. భక్తజనుల కోలాహలం మధ్య అలంకార సేవలు ప్రారంభమయ్యాయి. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు కోరిన కోర్కెలు తీర్చే శ్రీలక్ష్మీనరసింహస్వామి వారు లోక రక్షణార్థం శ్రీలక్ష్మీ అమ్మవారితో జరిగే కల్యాణ మహోత్సవంలో పాల్గొనాలని జాతరకు వచ్చే భక్తులను రక్షించాలని.. గరుత్మంతుడితో పాటు 33కోట్ల దేవతలకు ఆహ్వానం పంపగా... వారంతా శ్రీవారి పెళ్లికొడుకయ్యే వేళలో విచ్చేసినట్లుగా భావించి.. ప్రత్యేక పూజలు చేశారు. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు రూపంలో శ్రీవారు, అమ్మవారిని దర్శించుకున్న భక్తులు దివ్యానుభూతిని పొందారు. 


logo
>>>>>>