సోమవారం 06 ఏప్రిల్ 2020
Medchal - Feb 27, 2020 , 02:20:44

ప్రభుత్వ భూముల జోలికొస్తే జైలుకే

ప్రభుత్వ భూముల జోలికొస్తే జైలుకే

మేడ్చల్‌ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ప్రభుత్వ భూములను కబ్జాచేయడంతోపాటు నకిలీ పత్రాలను సృష్టించి ఇతరులకు విక్రయించి రూ.కోట్లు పోగుచేసుకుంటున్న ల్యాండ్‌ మాఫియా వెన్నులో వణుకుపుడుతోంది. కలెక్టర్‌ ఆదేశాల మేరకు జిల్లాలో రెండు రోజులు గా జరుగుతున్న అక్రమ నిర్మాణాల కూల్చివేతలు, కబ్జాలను తొలగించి ప్రభుత్వ సూచికబోర్డుల ఏర్పాటు, ల్యాండ్‌ మాఫియాపై క్రిమినల్‌ కేసుల నమోదు చేస్తుండడంతో జిల్లా పరిధిలోని ల్యాండ్‌ మాఫియాకు ముచ్చెమటలు పడుతున్నాయి. జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన కొద్ది రోజులవరకు కూల్‌గా ఉన్న కలెక్టర్‌ డా. వాసం వెంకటేశ్వర్లు ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రభుత్వ భూముల సంరక్షణపై ప్రత్యేక నజర్‌ పెట్టారు. ఈ క్రమంలోనే గత రెండురోజులుగా భూకబ్జాదారుల భరతం పడుతున్నారు. ప్రభుత్వ భూముల జోలికి వచ్చిన వారు ఎంతటి వారైనా జైలుకు వెళ్లాల్సిందేనని స్పష్టం చేస్తున్నా రు. అంతేకాదు నిబంధనలకు విరుద్ధంగా ఉన్న అక్రమ వెంచర్లను, అక్రమ నిర్మాణాలను సైతం నేలమట్టం చేయాలని రెవెన్యూ, పంచాయతీ అధికారులకు స్పష్టమై న ఆదేశాలను జారీ చేయడంతో జిల్లాలో అక్రమ వెంచర్లను కూడా అధికారులు పూర్తిగా తొలగిస్తున్నారు. 


కొనసాగుతున్న కూల్చివేతలు...

కలెక్టర్‌ ఆదేశాల మేరకు జిల్లాలో రెండు రోజులుగా  ప్ర భుత్వ భూముల్లో వెలసిన అక్రమ నిర్మాణాల కూల్చివేతలు జరుగుతున్నాయి. ముఖ్యంగా కాప్రా మండలపరిధిలోని జవహర్‌నగర్‌లో, కుత్బుల్లాపూర్‌ మండలపరిధిలోని కొంపల్లిలో ఘట్‌కేసర్‌ మండల పరిధిలో ప్రభుత్వ భూములపై జరిగిన ఆక్రమణలను కీసర ఆర్డీవో రవి, స్థానిక ఎమ్మార్వోల ఆధ్వర్యంలో కూల్చివేస్తున్నారు. జవహర్‌నగర్‌లోని సర్వేనంబర్‌ 648లో అక్ర మ నిర్మాణాలను, బేస్‌మెంట్లను, సర్వేనంబర్‌ 815, 816లో ఆక్రమణలను తొలగించి ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ సూచకబోర్డులను ఏర్పాటు చేశారు. ఈ స్థలాన్ని క్రీడామైదానం నిర్మాణం కోసం కేటాయించేందుకు ప్రతిపాదిస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. అలాగే రాజీవ్‌ గృహకల్ప సమీపంలో పార్కు కోసం కేటాయించిన స్థలంలో, మహిళల మూత్రశాలల కోసం కేటాయించిన స్థలాల్లో వెలసిన అక్రమనిర్మాణాలను అధికారులు పూర్తిగా తొలగించి ప్రభుత్వభూమిగా సూచిక బోర్డులను ఏర్పాటు చేశారు. అలాగే కొర్రెములలో నిబంధనలకు విరుద్ధంగా సర్వేనంబర్‌ 627లో వెలసిన అక్ర మ నిర్మాణాలను, అక్రమ వెంచర్లను అధికారులు పూర్తిగా తొలగించారు. ఇవి నిరంతరం కొనసాగుతాయని కలెక్టర్‌ స్పష్టం చేస్తున్నారు. ల్యాండ్‌ మాఫియాతో  అధికారులు చేతులు కలిపితే వారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. 


క్రిమినల్‌ కేసులు నమోదు...

కలెక్టర్‌ సూచనల మేరకు ప్రభుత్వ భూములను ఆక్రమించిన, నకిలీ పత్రాలతో ఇతరులకు విక్రయించిన వ్యక్తులపై స్థానిక రెవెన్యూ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈక్రమంలోనే భూకబ్జాదారుపై 427, 447, 427 సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేస్తున్నా రు. అలాగే మరికొందరిపై పోలీసులు సెక్షన్‌-3 పీడీపీపీ యాక్టు కింద కూడా కేసులను నమోదు చేశారు. ఇప్పటి వరకు నలుగురు భూకబ్జాదారులపై కేసులు నమోదు చేశామని, మున్ముందు మరింతమందిపై కేసులను నమోదు చేయనున్నట్లు కలెక్టర్‌ వెల్లడించారు. కలెక్టర్‌ చర్యలతో జిల్లా పరిధిలోని భూ కబ్జాదారులతోపాటు అవినీతి అధికారులకు ముచ్చెమటలు పడుతున్నాయని స్థానిక ప్రజ లు చర్చించుకుంటున్నారు.


ల్యాండ్‌ మాఫియా ఆగడాలు సాగనివ్వం

జిల్లాలో ప్రభుత్వ భూములను ఆక్రమించి ఇతరుల కు విక్రయించడం, నిర్మాణాలు చేస్తున్న ల్యాండ్‌ మాఫియా ఆగడాలు ఇక నుంచి సాగ వు. ప్రభుత్వ భూములను సంపూర్ణంగా సంరక్షిస్తాం. ప్రభుత్వ భూముల సంరక్షణ విషయంలో క్షేత్రస్థాయి అధికారుల నిర్లక్ష్యం ఉంటే వారిపై శాఖాపరమైన చర్య లు తీసుకుంటాం. రెవెన్యూ అధికారులు బాధ్యతాయుతంగా, పారదర్శకమైన విధులు నిర్వర్తించాలి.  

- డా.వాసం వెంకటేశ్వర్లు, మేడ్చల్‌ జిల్లా కలెక్టర్‌


logo