సోమవారం 30 మార్చి 2020
Medchal - Feb 25, 2020 , 05:05:19

ఎంఈలో శిక్షణ..సిపాయిల రక్షణ

ఎంఈలో శిక్షణ..సిపాయిల రక్షణ
  • 2,000 మంది సిపాయిలు

ప్రతి సంవత్సరం సుమారు 2,000 మంది సిపాయిలు ఇక్కడ శిక్షణ పొందుతుంటారు. ప్రత్యేకంగా ఎయిర్‌ రైఫిల్‌ పిస్టల్‌, షూటింగ్‌ రేంజ్‌, స్మాల్‌ ఆర్ట్స్‌ ట్రైనింగ్‌ సిమ్యూలేటర్‌ కాంప్లెక్స్‌లో ఫైటింగ్‌లో సిపాయిలకు ప్రత్యేక శిక్షణ ఇస్తుంటాం. ఇక్కడ శిక్షణ పొందినవారు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో జరిగే పోటీల్లో ప్రతిభను కనబరిచారు.  -బ్రిగేడియర్‌ సందీప్‌ భల్లా, ఈఎంఈ సెంటర్‌ కమాండెంట్‌


బొల్లారం ఈఎంఈ కేంద్రంలో ప్రాథమిక అంశాలపై అవగాహన

మెకానికల్‌ విభాగంలో స్పెషల్‌ ట్రైనింగ్‌


బొల్లారం: దేశ రక్షణ కోసం అహర్నిషలు శ్రమించే సిపాయిలు, ఆర్మీ అధికారులను వివిధ రంగాల్లో సుశిక్షుతులుగా తయారు చేస్తున్నది బొల్లారంలోని 1ఈఎంఈ (ఎలక్ట్రానిక్‌ మెకానికల్‌ ఇంజినీర్స్‌) కేంద్రం. ఈ కేంద్రంలో వివిధ విభాగాల్లో అప్పుడే ఆర్మీలో చేరిన యువకులకు మెళకువలు నేర్పించి, దేశ రక్షణలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనే విధంగా ప్రత్యేక శిక్షణ ఇస్తారు. 


ప్రేరణ గది..

కొత్తగా ఆర్మీలో చేరే వారికి ప్రాథమిక సమాచారంపై ప్రేరణ గదిలో అవగాహన కల్పిస్తుంటారు. సిపాయిల దుస్తులు, త్రివిధ దళాల్లో వివిధ ర్యాంకుల అధికారులు ధరించే బ్యాడ్జిలు, వారికి ఇవ్వాల్సిన గౌరవం, అత్యున్నత అవార్డులు పొందిన అధికారుల  చిత్రాలు పొందుపరుస్తారు. ఇక్కడ 19 వారాల పాటు ప్రాథమిక విషయాలపై శిక్షణ ఇస్తుంటారు. శిక్షణ కాలంలో ఉండగానే 15వ వారం సిపాయిలకు ఒక పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో వారికి ఏ రంగంలో ఆసక్తి ఉందనే విషయాన్ని గ్రహించి వారి సామర్థ్యానికి అనుగుణంగా సిగ్నల్స్‌, ఎలక్ట్రానిక్స్‌, ఎలక్ట్రికల్‌, మెకానికల్‌ విభాగాల్లో తర్ఫీదు ఇస్తారు. 


ఆటోమొబైల్‌ ఇంజినీరింగ్‌ గ్రూపు..

 సిపాయిల సామర్థ్యానికి అనుగుణంగా ఆటోమొబైల్‌ ఇంజినీరింగ్‌ గ్రూపు విభాగంలో ద్విచక్ర, త్రిచక్ర, భారీ వాహనాలు, యుద్ధనౌకలు, హెలికాప్టర్లకు సంబంధించిన మెకానిజంలో శిక్షణ ఇస్తారు. సిపాయిలు రాటుదేలేందుకు లోయలు, కాల్వలు, ఇసుక, బండరాళ్లతో ఏర్పాటు చేసిన ప్రత్యేక ట్రాక్‌పై  శిక్షణ ఇస్తారు. దట్టమైన అడవులు కొండప్రాంతాల నుంచి గమ్యస్థానాలకు చేరుకునేందుకు  మ్యాప్‌ రీడింగ్‌లో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. 


ఈఎంఈ సెంటర్‌ క్వార్టర్‌ గార్డ్‌..

 ప్రతి ఆర్మీ యూనిట్‌లో ఉన్నట్లే ఈ కేంద్రంలోనూ క్వార్టర్‌ గార్డ్‌ ఉంది. జాతీయ సమగ్రత భావాన్ని పెంపొందించడంతో పాటు క్రమ శిక్షణకు మారుపేరుగా నిలుస్తున్న ఈ క్వార్టర్‌ గార్డ్‌లో నిబంధన ప్రకారం సూర్యోదయం వేళ సిపాయిలు ఈ కేంద్రానికి సంబంధించిన పతాకాన్ని ఆవిష్కరించి సూర్యస్తమయం వేళ తీసేస్తుంటారు. ఇక్కడే స్మాల్‌ ఆర్ట్స్‌ మ్యూజియం అండ్‌ కలర్స్‌ పేరిట ఉన్న ప్రాంతంలో యూకే, యూఎస్‌, ఇంగ్లండ్‌, రష్యా, చైనా, బెల్జియం, ఆస్ట్రేలియా తదితర దేశాలు మెదటి, రెండో ప్రపంచ యుద్ధాల సమయంలో తయారు చేసిన ఆయుధాల నుంచి మొదలుకొని మన దేశం తాజాగా తయారుచేసిన 5.56 ఎంఎం ఆయుధం వరకు పొందుపరిచారు. అయితే వీటిలో పలు ఆయుధాలను వివిధ దేశాలు ఇప్పటికీ వినియోగిస్తున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. కాగా 1941 నుంచి 2004 వరకు వివిధ సందర్భాల్లో వీర మరణం పొందిన సైనికుల సంస్మరణార్థం స్మారక స్తూపం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. 


logo