శనివారం 04 ఏప్రిల్ 2020
Medchal - Feb 22, 2020 , 03:13:46

31 కిలోమీటర్ల మెట్రో ..

31 కిలోమీటర్ల మెట్రో ..

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ :  భవిష్యత్తులో నిర్మించనున్న మెట్రో ప్రాజెక్టులన్నీ పీపీపీ విధానంలో చేపట్టనున్నారు. విస్తరణ ప్రాజెక్టులతోపాటు కూకట్‌పల్లి మార్గంలో నిర్మించే ఎలివేటెడ్‌ బస్‌ ర్యాపిడ్‌ ట్రాన్సిట్‌ సిస్టం (ఈబీఆర్‌టీఎస్‌) ప్రాజెక్టులను పబ్లిక్‌ ప్రైవేట్‌ పార్టనర్‌షిప్‌ (పీపీపీ) విధానంలో నిర్మించనున్నారు. రాయ్‌దుర్గ్‌ నుంచి శంషాబాద్‌ ఏయిర్‌పోర్టు ఎక్స్‌ప్రెస్‌, ఇతర మార్గాల్లో ప్రతిపాదిత మెట్రో ప్రాజెక్టులను పీపీపీ విధానంలో నిర్మించాలని భావిస్తున్నారు. ఏయిర్‌పోర్టు ఎక్స్‌ప్రెస్‌వేను నిర్మించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ బిల్డ్‌ఆపరేట్‌ (బీవోటీ) పద్ధతిలో నిర్మించడం ద్వా రా ప్రభుత్వంపై భారం పడకుండా ప్రయా ణ సౌకర్యం అందించవచ్చనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతున్నది. ఏయిర్‌పోర్టు ఎక్స్‌ప్రెస్‌ వే మార్గంలో 31 కిలోమీటర్ల మార్గాన్ని నిర్మించేందుకు హైదరాబాద్‌ మె ట్రో నిర్మించిన ఎల్‌అండ్‌టీ ఆసక్తి కనబరుస్తున్నట్లు ఎల్‌అండ్‌టీ వర్గాల నుంచి విశ్వసనీయ సమాచారం. 

ప్రాజెక్టుపై ప్రణాళికలు సిద్ధం

మొదటిదశ విజయవంతంగా ప్రయాణికులను చేరవేస్తున్న నేపథ్యంలో విస్తరణతోపాటు మెట్రో రెండోదశ ప్రాజెక్టుపై ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.  బీఆర్‌టీఎస్‌తోపాటు ఏయిర్‌పోర్టు ఎక్స్‌ప్రెస్‌వే డీపీఆర్‌ కోసం ఇప్పటికే  టెండర్లు ఆహ్వానించగా, ఎయిర్‌పోర్టు ఎక్స్‌ప్రెస్‌వేకు సంబంధించి ప్రాథమిక డీపీఆర్‌ను కూడా ఢిల్లీ మెట్రోరైలు అందించింది. ఇక ఈబీఆర్‌టీఎస్‌ విషయానికి వస్తే.. కూకట్‌పల్లి హౌసింగ్‌ బోర్డు నుంచి ప్రారంభమ య్యే ఎలివేటెడ్‌ బస్‌ ర్యాపిడ్‌ ట్రాన్సిట్‌ సిస్టం (ఈబీఆర్‌టీఎస్‌) 18 కిలోమీటర్ల పొడవుతో నిర్మించిందేకు సూత్రప్రాయంగా నిర్ణయించారు. జేఎన్‌టీయూ ముందు నుంచి వయా ఫోరమ్‌మాల్‌ మీదుగా  హైటెక్‌సిటీ ఎంఎంటీఎస్‌ స్టేషన్‌ను కలుపుకొని, హెచ్‌ఐసీసీ ప్రాంగణాన్ని కలుపుతూ శిల్పారామం మీదు గా హైటెక్‌సిటీ సమీపం నుంచి, ఐటీ కంపెనీల ఐటీ కారీడార్‌ను, మెట్రోకారిడార్‌-3కు సంబంధించి మైండ్‌స్పేస్‌ మీదుగా గచ్చిబౌలి.. మెట్రో ఎయిర్‌పోర్టు స్టేషన్‌కు అనుసంధానమవుతుంది. రాష్ట్ర ప్రభుత్వ యజమాన్య సంస్థగా హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టు మె ట్రోలిమిటెడ్‌ ప్రాజెక్టు నిర్మిస్తున్నారు. ప్రభుత్వ భాగస్వామ్యం కూడా దీనిలో ఉంటుంది.  ప్రభుత్వ సంస్థలైన హెచ్‌ఎండీఏ, టీఎస్‌ఐఐసీ, హెఎంఆర్‌ఎల్‌, హెఏఎంఎల్‌ ఇందులో భాగస్వామ్యం కలిగి ఉంటాయి. 


జనసాంద్రత ఉన్న ప్రాంతాల్లో..

 జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతమైన కూకట్‌పల్లి మార్గంలో  ఎలివేటెడ్‌ ట్రాన్స్‌పోర్టు సిస్టం అందుబాటులోకి తెస్తున్నారు. నగరంలో పెరుగుతున్న జనాభా నేపథ్యంలో ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా చేయడంలో ఇప్పటికే హైదరాబాద్‌ మెట్రోరైలు దాదాపు విజయవంతం కాగా,  ఇదే కోవలో ట్రాఫిక్‌ ఇబ్బందులు లేని బస్‌ ప్రయాణాన్ని అందుబాటులోకి తెస్తున్నారు. ఎలివేటెడ్‌ బస్‌ ర్యాపిడ్‌ ట్రాన్సిట్‌ సిస్టం (ఈబీఆర్‌టీఎస్‌) పేరుతో నిర్మించనున్న ఈ ప్రాజెక్టు వల్ల ట్రాఫిక్‌ ఇబ్బంది తీరడంతోపాటు పర్యావరణ ముప్పు కూడా తప్పనున్నది. ఎలివేటెడ్‌ బస్‌ ర్యాపిడ్‌ సిస్టంలో భాగంగా నిర్మించనున్న ఈ  మార్గం గుండా ఇతర వాహనాలేవి అనుమతించరు. వయాడక్ట్‌ మీద నిర్మించే రోడ్డుపై కేవలం ర్యాపిడ్‌ సిస్టం బస్సులే నడుస్తాయి. అధికారికంగా ప్రతిపాదించిన మెట్రోరైలు మార్గాల విషయానికి వస్తే  రాయదుర్గం నుంచి గచ్చిబౌలి టచ్‌ చేస్తూ ఓఆర్‌ఆర్‌ మీదుగా, ఖాజాగూడ, రాజేంద్రనగర్‌ మీదుగా శంషాబాద్‌ ఏయిర్‌పోర్టు ఎక్స్‌ప్రెస్‌వేను నిర్మిస్తుండగా, బీహెచ్‌ఈఎల్‌ నుంచి ప్రారంభమై మియాపూర్‌ టచ్‌ చేస్తూ మదీనగూడ, హఫీజ్‌పేట్‌, కొండాపూర్‌, కొత్తగూడ జంక్షన్‌, షేక్‌పేట, మెహిదీపట్నం మీదుగా లకీడీకాపూల్‌కు చేరుకుని మొదటిదశ ప్రాజెక్టులో నిర్మించిన కారిడార్‌-1కు మరోమార్గం అనుసంధానమవుతుంది. ఇక నాగోల్‌ నుంచి ఎల్బీనగర్‌ వరకు మారో మార్గాన్ని నిర్మించతలపెట్టారు. మొదటిదశ ప్రాజెక్టులోని కారిడార్‌-3కు సంబంధించి  నాగోల్‌  మెట్రోస్టేషన్‌  నుం చి ప్రారంభమై నాగోల్‌, బండ్లగూడ జంక్షన్‌, కామినేని దవాఖాన మీదుగా ఎల్బీనగర్‌లోని మొదటిదశ కారిడార్‌-1కు అనుసంధానమవుతుంది. మరో మార్గం ఎల్బీనగర్‌ నుంచి ప్రారంభమై చాంద్రాయణ గుట్ట మీదుగా పాతబస్తీ ప్రాంతాలను టచ్‌చేస్తూ ఫలక్‌నుమాలోని మొదటిదశ ప్రాజెక్టులోని కారిడార్‌-2కు అనుసంధానమవుతుంది. అక్కడి నుంచి పాతబస్తీ ప్రాంతాలమీదుగా శంషాబాద్‌కు చేరుకుంటుంది.


logo