శనివారం 04 ఏప్రిల్ 2020
Medchal - Feb 20, 2020 , 00:20:39

నిరక్షరాస్యులు ఎంతమంది..?

నిరక్షరాస్యులు ఎంతమంది..?

బంజారాహిల్స్‌: రాష్ట్రవ్యాప్తంగా 24 నుంచి పట్టణ ప్రగతి కార్యక్రమం ప్రారంభం కానున్నది. ఇందులో భాగంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో  చేపట్టనున్న నిరక్షరాస్యుల సర్వేకు  అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సంపూర్ణ అక్షరాస్యత సాధించాలంటే బడి ఈడు పిల్లలంతా స్కూల్‌కు వెళ్లడంతో పాటు వయోజనులంతా చదువుకోవాల్సి ఉంటుంది. పట్టణప్రగతిలో భాగంగా అక్షరాస్యతను పెంచేందుకు స్వచ్ఛంద సంస్థలను భాగస్వామ్యం చేయనున్నారు. ఇందులో భాగంగా ఎంతమంది నిరక్షరాస్యులు ఉన్నారనే విషయాన్ని గుర్తించి...డేటాను సేకరించేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని 150 డివిజన్ల పరిధిలో నిర్వహించనున్న నిరక్షరాస్యుల వివరాల సేకరణ కార్యక్రమానికి చెందిన మార్గదర్శకాలను ఇప్పటికే  డిప్యుటీ మున్సిపల్‌ కమిషనర్లకు అందించారు.


జీహెచ్‌ఎంసీ యూసీడీ విభాగంతో పాటు అన్ని విభాగాల సిబ్బందిని సర్వేలో భాగస్వామ్యం చేస్తున్నారు. 250 నుంచి 300 గృహాలను ఒక లొకాలిటీగా పరిగణిస్తూ.. సర్వేను చేయడానికి ఎన్యుమరేటర్లను నియమిస్తున్నారు. మహిళా పొదుపు సంఘాల సభ్యులు, శానిటరీ ఫీల్డ్‌ అసిస్టెంట్ల సేవలను  వినియోగించుకోనున్నారు. రోజుకు 30 నుంచి 50 ఇండ్లను సందర్శించి నిరక్షరాస్యుల వివరాలను సేకరించేలా ప్రణాళిక రూపొందించారు. ఆయా ప్రాంతాల్లో కార్పొరేటర్లను, ప్రజాప్రతినిధులను కూడా భాగస్వామ్యం చేస్తున్నారు. ఎన్యుమరేటర్లుగా నియమితులైన వారికి శిక్షణను ఇవ్వడంతో పాటు సేకరించిన డేటాను ప్రభుత్వానికి అందజేయనున్నారు. 


logo