గురువారం 02 ఏప్రిల్ 2020
Medchal - Feb 20, 2020 , 00:17:49

వైభవంగా కీసరగుట్ట బ్రహ్మోత్సవాలు ప్రారంభం

వైభవంగా కీసరగుట్ట బ్రహ్మోత్సవాలు ప్రారంభం
  • - ముఖ్యఅతిథులుగా మంత్రి మల్లారెడ్డి , జిల్లా కలెక్టర్‌ వి.వెంకటేశ్వర్లు హాజరు

కీసర: తెలంగాణలో సుప్రసిద్ధ శైవక్షేత్రంగా పేరొందిన కీసరగుట్ట శ్రీ భవాని రామలింగేశ్వరస్వామి దేవస్థానంలో మహా శివరాత్రి జాతర బ్రహ్మోత్సవాల వేడుకలు వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య  విఘ్నేశ్వరపూజతో బుధవా రం అత్యంత వైభోపేతంగా ప్రారంభం అయ్యాయి.  కీసరగుట్ట జాతర బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని కీసరగుట్ట దేవాలయ ప్రాంగణ మందిరంలో వేదపండితులు శ్రీ భవాని రామలింగేశ్వరస్వామి వారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలను నిర్వహించారు. మొదటి రోజు పూజ కార్యక్రమాలకు రాష్ట్ర కార్మికశాఖ మంత్రి  మల్లారెడ్డి, జిల్లా కలెక్టర్‌ వి.వెంకటేశ్వర్లు ముఖ్యఅతిథులుగా విచ్చేశారు. మంత్రి చేతుల మీదుగా  ఈ పూజ కార్యక్రమాలు లాంఛనంగా ప్రారంభం చేశారు. ఆలయ చైర్మన్‌ తటాకం శ్రీనివాస్‌శర్మ స్వామి వారి కి విఘ్నేశ్వరపూజ, పుణ్యాహవాచనము, ఋత్విక్‌ వరణం, యాగశాల ప్రవే శం, ఆఖండ జ్యోతి ప్రతిష్టాపనం వంటి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. అనంతరం వేదపాఠశాలకు చెందిన వేదపండితులు, కీసరగుట్ట వేదపండితులు మారుతి సత్యనారాయణశర్మ, బాల్‌రాంశర్మ, రవిశర్మ, వీరేశంశర్మలు చైర్మన్‌తో కలిసి యాగశాల ప్రవేశాన్ని నిర్వహించారు. అనంతరం స్వామి వారికి అగ్నిప్రతిష్టాపనము, భేరిపూజ, ధ్వజారోహణ, ద్వాత్రింశతి రాగా లాపన, హారతి, మంత్రపుష్పం, పరాకస్తవం, తీర్థ్ర ప్రసాద వినియోగం వంటి కార్యక్రమాలను అత్యంత వైభోపేతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ చైర్మన్‌ మలిపెద్ది శరత్‌చంద్రారెడ్డి, దేవస్థానం వంశపార్యంపర్య ధర్మకర్తలు తటాకం నారాయణశర్మ, టి.రమేశ్‌శర్మ, టి.ఉమాపతిశర్మ, టి. వెంకటేశ్‌,  టి. నాగలింగంలతో పాటు పలువురు పాల్గొన్నారు. 


ఎగ్జిబిషన్‌ స్టాల్స్‌ ప్రారంభం

కీసరగుట్ట జాతర బ్రహ్మోత్సవాలకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రూ.30లక్షల నిధులు మంజూరు చేసిందని  మంత్రి  మల్లారెడ్డి పేర్కొన్నారు. కీసరగుట్టలోని ఎగ్జిబిషన్‌గ్రౌండ్‌లో  తెలంగాణ ప్రభు త్వం, మేడ్చల్‌ జిల్లా యువజన  క్రీడలశాఖ వారిచే ఏర్పాటు చేసిన ప్రభుత్వస్టాల్స్‌ను,  గ్రామీ ణ క్రీడోత్సవాలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా  మంత్రి  మాట్లాడుతూ  జిల్లా కలెక్టర్‌ కూడా కీసరగుట్ట జాతరకు తన నిధి నుం చి రూ.60లక్షలు మంజూరు చేశారని తెలిపారు.  జిల్లా పరిషత్‌ చైర్మన్‌ మలిపెద్ది శరత్‌చంద్రారెడ్డి మాట్లాడుతూ ఈ పుణ్యక్షేత్రంలో స్వామి వారిని దర్శించుకుంటే సకల పాపాలు పోతాయన్నారు. కలెక్టర్‌ వి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జాతర పూర్తి అయ్యేంత వరకు జిల్లా యంత్రాంగం కీసరగుట్టలోనే ఉంటుందన్నారు. 


logo
>>>>>>