శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Medchal - Feb 19, 2020 , 00:25:20

‘వీడీఎస్‌'కు మరో మూడు రోజులే..!

‘వీడీఎస్‌'కు మరో మూడు రోజులే..!

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : అక్రమ నల్లాల క్రమబద్ధీకరణ దరఖాస్తుల స్వీకరణకు మరో మూడు రోజులు మాత్రమే అవకాశం ఉన్నది. 90 రోజుల వీడీఎస్‌(వాలంటరీ డిస్‌క్లోజ్‌ స్కీం) పథకం ఈనెల 21వ తేదీతో ముగియనున్నది. క్రమబద్ధీకరణ పథకం దరఖాస్తులను గడిచిన కొన్ని రోజులుగా ఆన్‌లైన్‌తో పాటు స్థానిక డివిజన్‌ కార్యాలయాలలో వీడీఎస్‌ దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఇంటింటి సర్వే జరుపుతున్న సిబ్బందితోపాటు మీటర్‌ రీడర్లకు అక్రమ నల్లాల క్రమబద్ధీకరణకు దరఖాస్తులు స్వీకరించేలా చర్యలు తీసుకుంటున్నారు. నగర వ్యాప్తంగా ఉన్న హోర్డింగ్‌లు, ప్రసార మాద్యమాలు/రేడియా ద్వారా ఈ పథకంపై విస్తృత ప్రచారం చేశారు. ఇందులో భాగంగానే మంగళవారం వరకు 20డివిజన్లలో కలిపి 6955 దరఖాస్తులను స్వీకరించినట్లు అధికారులు తెలిపారు. త్వరలోనే ఈ దరఖాస్తులను పరిశీలించి నిబంధనల ప్రకారం రెగ్యులర్‌ చేస్తామని తెలిపారు. నిర్ణీత గడువులోగా ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని, అక్రమ నల్లాలు దరఖాస్తులు చేసుకోకుండా ఉండి ఆ తర్వాత అధికారుల పరిశీలనలో అక్రమ నల్లా ఉన్నట్లు తేలితే సంబంధిత యజమానులపై కేసులు నమోదు చేసి జైలుకు పంపించడం ఖాయమని అధికారులు హెచ్చరిస్తున్నారు.


పాత నగరంలోనే అత్యధికం 

క్రమబద్ధీకరణ పథకానికి సంబంధించి గడిచిన 87రోజుల దరఖాస్తుల స్వీకరణలో పాతనగరం నుంచే అత్యధికంగా దరఖాస్తులు వచ్చాయి. ఒక్క డివిజన్‌-2 అస్మాన్‌ఘడ్‌ నుంచే 1824 దరఖాస్తులు రావడం గమనార్హం. అన్ని డివిజన్లలో పరిశీలిస్తే  చార్మినార్‌ డివిజన్‌లో 718 దరఖాస్తులు, అస్మాన్‌ఘడ్‌ 1824, ఆసిఫ్‌నగర్‌ 473, రెడ్‌హిల్స్‌ 339, నారాయణగూడ 310,ఎస్‌ఆర్‌నగర్‌ 428, మారేడ్‌పల్లి 283, కూకట్‌పల్లి 284, ఎల్బీనగర్‌ 57, కుత్బుల్లాపూర్‌లో 286, అల్వాల్‌ మల్కాజిగిరి 205, కాప్రా ఎన్‌ ఉప్పల్‌ 625, రామచంద్రాపురం 372, రాజేంద్రనగర్‌ 721, మణికొండలో మూడు దరఖాస్తులు, బోడుప్పల్‌ 23, షాహేబ్‌నగర్‌ నాలుగు కలిపి మొత్తం 6955 దరఖాస్తులను స్వీకరించారు.


logo