శనివారం 04 ఏప్రిల్ 2020
Medchal - Feb 12, 2020 , 03:37:37

మహిళలే కీలకం..

మహిళలే కీలకం..

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : ఈ పోటీ ప్రపంచంలో పోటీని తట్టుకుని ఆడవారు అవార్డులు పొందే స్థాయికి చేరడం అంత సాధారణ విషయం కాదన్నారు తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందర్‌ రాజన్‌. మంగళవారం లోయర్‌ ట్యాంక్‌బండ్‌లోని హోటల్‌ మారియట్‌లో జరిగిన ‘ఫోరం ఆఫ్‌ ఉమెన్‌ ఇన్‌ పబ్లిక్‌ సెక్టార్‌' 30వ జాతీయ సమావేశ వేడుకలకు ముఖ్య అతిథిగా గవర్నర్‌ తమిళిసై సౌందర్‌ రాజన్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్నత స్థానాల్లో పనిచేస్తున్న మహిళల ఆధ్వర్యంలో ‘పవర్‌ ట్రాన్స్‌ఫార్మేషన్‌- డెసిషన్‌ టు యాక్షన్‌' అంశంతో మహిళా సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్‌ మాట్లాడుతూ అనేక కష్టాలను, సవాళ్ళను అదిగమించినప్పుడే అవార్డులు వస్తాయన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు అవకాశాలు దొరికినప్పుడు బాగా రాణించారని, రాష్ట్రంలోని ఇతర మహిళలు కూడా దొరికిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని గొప్ప స్థానానికి చేరుకోవాలని సూచించారు. తల్లి నుంచి ఒక అధికారి వరకూ ప్రతీ పాత్రలో మహిళ దిగిపోతుందన్నారు. 


మహిళకు తన తల్లి మారదర్శకం అవుతుందన్నారు. నేటి ఆర్థిక వ్యవస్థలో మహిళలు ఆర్థిక వృద్ధి చోదకులుగా ఎదిగారని, దేశ అభివృద్ధికి మహిళా సాధికారత చాలా అవసరమన్నారు. మహిళలు తమ మానసిక, శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో శ్రద్ద చూపాలన్నారు. ప్రతీ మహిళ తన దైనందిన జీవితంలో యోగాను భాగంగా చేసుకోవాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో స్టాండింగ్‌ కాన్ఫరెన్స్‌ ఆఫ్‌ పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజెస్‌(స్కోప్‌) డీజీ అతుల్‌ సోబ్టి మాట్లాడుతూ మహిళల సామర్థ్యాలను పెంపొందించేందుకు స్కోప్‌ తీసుకున్న చర్యలను వివరించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మహిళల భాగస్వామ్యం మరింత అవసరమన్నారు. అనంతరం పలు సంస్థల్లో ఉత్తమ ప్రతిభ చూపిన మహిళలకు గవర్నర్‌ అవార్డులను ప్రదానం చేశారు.


logo