మంగళవారం 31 మార్చి 2020
Medchal - Feb 12, 2020 , 03:29:07

కొన్ని యాప్‌లతో..మీ ఖాతాలు ఖాళీ..

కొన్ని యాప్‌లతో..మీ ఖాతాలు ఖాళీ..

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: ఒకరి సెల్‌ఫోన్‌తోని విషయాలు మరొకరికి తెలిస్తే ఎలా ఉంటుంది.. మీరు ఎవరితో మాట్లాడుతున్నారు.. ఫోన్‌లో మీరు చేసే బ్యాంకింగ్‌ లావాదేవీలన్నీ ఈజీగా తెలుస్తాయి.. టీమ్‌ వ్యూహార్‌ సంబంధిత అప్లికేషన్లతో ఒకచోట ఉన్న కంప్యూటర్‌ను.. మరొకరు తమ అధీనంలోకి తీసుకొని అవసరమైన పనులు చేసేవారు.. అయితే డెస్క్‌టాప్‌, ల్యాప్‌టాప్‌లతో ఇలాంటి అప్లికేషన్లను ఉపయోగించేవారు ఆయా కంప్యూటర్లలో ఉండే డాటాను చోరీ చేయడం చాలా అరుదు.. ఇప్పుడు అంతా సెల్‌ఫోన్లతోనే బ్యాంకింగ్‌ లావాదేవీలు చేస్తుండడంతో ఇలాంటి యాప్స్‌ ఉంటే సెల్‌ఫోన్లో ఉంటే ఎప్పటికైన హాని జరిగే అవకాశాలుంటాయి. తెలిసి ఈ యాప్‌లను ఉపయోగించేవారు కొందరుండగా.. సైబర్‌నేరగాళ్లు చెప్పే సూచనలతో ఈ యాప్‌ను తమ సెల్‌ఫోన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకొని మోసపోతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. ఇలాంటి సందర్భాల్లో సైబర్‌నేరగాళ్లు బాధితుడి సెల్‌ఫోన్‌లో జరిగే ఆర్థ్ధిక లావాదేవీలను పూర్తిగా తెలుసుకుంటూ.. ఆయా ఖాతాలను లూటీ చేస్తున్నారు. 


బుట్టలో పడేస్తారు..!

అధికారులమని, మార్కెటింగ్‌ ముసుగులో గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్‌ చేస్తుంటారు. మీ బ్యాంకింగ్‌ ఖాతాను అప్‌గ్రేడ్‌ చేస్తున్నాం.. కేవైసీకి సం బంధించిన వివరాలు పూర్తిగా మా వద్ద లేవు.. మీరు ఆ విషయాలను పొందుపరిస్తే ఖాతాను అప్‌డేట్‌ చేసేస్తామంటూ సైబర్‌ నేరగాళ్లు మాట్లాడుతుంటారు. అయితే ఆ వివరాలు నింపే ముందు ఈ యాప్‌ను మీరు డౌన్‌లోడ్‌ చేసుకోండంటూ లింక్‌ను పంపిస్తారు. అయితే లింక్‌ క్లిక్‌ చేయగానే డౌన్‌లోడ్‌ అవుతుంది. ఈ సమయంలోనే సైబర్‌నేరగాడు బాధితుడి సెల్‌ఫోన్‌కు వచ్చే ఓటీపీని అడుగుతాడు. అవతలి వ్యక్తి అధికారి అనే భ్రమలో ఆ విషయాన్ని  చెప్పేస్తాడు. ఎప్పుడైతే బాధితుడి సెల్‌ఫోన్‌ సైబర్‌నేరగాడి చేతిలోకి వెళ్లిపోతుంది. 


యాప్‌లతో జాగ్రత్త 

సైబర్‌ నేరాల చేతిలో చిక్కి మోసపోయిన వారు సైబర్‌క్రైమ్‌ పోలీసులను ఆశ్రయిస్తుంటారు. ఆ సమయంలో ఒక్కొక్కరు ఒకో రకంగా మోసపోయిన వాళ్లున్నారు. అందులోభాగంగా కొన్ని యాప్‌లతో జాగ్రత్తగా ఉండాలంటూ సైబర్‌క్రైమ్‌ పోలీసులు సూచిస్తున్నారు. యాడ్‌సన్‌, క్విక్‌ వ్యూవర్‌, ఎనీ డెస్క్‌, టీమ్‌ వ్యూవర్‌, యూనిఫై రిమోట్‌, ఎయిర్‌ మిర్రర్‌, వీఎన్‌సీ వ్యూవర్‌, రిమోట్‌ సపోర్టు, పీసీ రిమోట్‌, ఎయిర్‌ డ్రైడ్‌, రిమోట్‌ వ్యూ తదితర మొబైల్‌ అప్లికేషన్లతో అప్రమత్తంగా ఉండాలి. మొబైల్‌ ఫోన్లలో కేవలం సైబర్‌నేరగాళ్లే కాకుండా తమనకు తెలిసిన వారు కూడా ఇలాంటి అప్లికేషన్లను సమయం దొరికినప్పుడు మరొకరి సెల్‌ఫోన్‌లో డౌన్‌లోడ్‌ చేసే అవకాశాలున్నాయి. సెల్‌ఫోన్లలో అనుమానిత యాప్స్‌ ఉంటే డిలిట్‌ చేయడం మంచిది.

- సైబర్‌క్రైమ్స్‌ ఏసీపీ, కేవీఎం ప్రసాద్‌ 


ఫోన్‌లో ఉన్న విషయం తెలియక..

చింతల్‌లో నివాసముండే నారాయణ కావాడిగూడలో ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తుంటాడు. ఆయన సెల్‌ఫోన్‌ ద్వారా అప్పుడప్పుడు ఆర్థిక లావాదేవీలు చేస్తుంటాడు. అనుకోకుండా మంగళవారం ఆయన క్రెడిట్‌ కార్డు నుంచి రెండు దఫాలుగా రూ.లక్షా 30 వేలు డ్రా అయ్యాయి. తనకు ఓటీపీ కూడా రాలేదు. నా క్రెడిట్‌ కార్డును గుర్తుతెలియని వ్యక్తులు ఉపయోగించారంటూ బాధితుడు సైబర్‌క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించాడు. మీ ఫోన్‌లో ఏమైనా గుర్తుతెలియని యాప్‌లు ఉన్నాయా? సైబర్‌క్రైమ్స్‌ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ ప్రశ్నించాడు. తనకు తెలియదు సార్‌ అంటూ.. బాధితుడు సమాధానం చెప్పడంతో..ఆయన బాధితుడి సెల్‌ఫోన్‌ పరిశీలించడంతో అందులో ‘క్విక్‌ వ్యూ’ యాప్‌ ఒకటి ఉంది. ఇది ఎవరు డౌన్‌లోడ్‌ చేశారంటే తనకు తెలియదంటూ ఆయన సమాధానం ఇవ్వడంతో దానిన డిలీట్‌ చేశా రు... ఇలా కొందరు తెలిసి, మరికొందరు తెలియక ఇలాంటి అప్లికేషన్లను తమ సెల్‌ఫోన్లు ఉంచుకోవడం వల్ల ఎప్పుడో ఓ సారి నష్ట పోవాల్సి వస్తుంది.


logo
>>>>>>