ఆదివారం 24 మే 2020
Medchal - Feb 11, 2020 , 01:23:51

మెట్రో వచ్చింది..‘సమయం’ తగ్గింది

మెట్రో వచ్చింది..‘సమయం’ తగ్గింది
  • 16 నిమిషాల్లోనే ఎంజీబీఎస్‌ నుంచి జేబీఎస్‌కు
  • హర్షం వ్యక్తం చేస్తున్న ప్రయాణికులు

సుల్తాన్‌బజార్‌/మారేడ్‌పల్లి: హైదరాబాద్‌ మణిహారంగా నిలుస్తున్న మెట్రో కారిడార్‌-2 ప్రారంభంతో ఎంజీబీఎస్‌ నుంచి సికింద్రాబాద్‌కు తక్కువ సమయంలోనే చేరుకుంటున్నారు. మెట్రో కారిడార్‌-2 ప్రారంభం కంటే ముందు ఎంజీబీఎస్‌ నుంచి సికింద్రాబాద్‌ వెళ్లాలంటే కనీసం 40 నిమిషాలకు పైగా పట్టేది. అంతే కాకుండా ఏదైనా క్యాబ్‌ లేదా బస్సులో ప్రయాణం చేయవలసి వచ్చేది. ప్రస్తుతం మెట్రో కారిడార్‌-2 ప్రారంభంతో  ఎంజీబీఎస్‌లో బస్సు దిగిన వెంటనే ఎంజీబీఎస్‌ ప్రాంగణంలోనే ఉన్న మెట్రో స్టేషన్‌లో రైలు ఎక్కి కేవలం 16 నిమిషాల్లో చేరుకోవడంతో సమయంతో పాటు డబ్బులు ఆదా అవుతున్నాయని ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఎంజీబీఎస్‌ నుంచి జేబీఎస్‌ పరేడ్‌గ్రౌండ్‌ వరకు మెట్రో కారిడార్‌-2ను రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రారంభించిన విషయం విధితమే.


నేరుగా ఎంజీబీఎస్‌కు..

మహబూబ్‌నగర్‌, శ్రీశైలం, కర్నూలు, బెంగళూరుతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఎంజీబీఎస్‌కు చేరుకొని అక్కడి నుంచి సికింద్రాబాద్‌ వైపు వెళ్లేందుకు ఆటోలు, క్యాబ్‌లను, బస్సులను ఆశ్రయిస్తారు. మెట్రో రైలును జేబీఎస్‌ నుంచి ఎంజీబీఎస్‌ వరకు  ప్రారంభించడంతో ఎంజీబీఎస్‌కు చేరుకునే ప్రయాణికులకు సికింద్రాబాద్‌ వైపు వెళ్లేందుకు అది కూడా తక్కువ సమయంలో చేరుకునే వీలుకలిగిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


logo