శనివారం 04 ఏప్రిల్ 2020
Medchal - Feb 11, 2020 , 01:12:43

ఆల్‌రౌండర్‌ కావ్యశ్రీ

ఆల్‌రౌండర్‌ కావ్యశ్రీ
  • క్రికెట్‌తోపాటు కూచిపూడిలో రాణిస్తున్న కావ్యశ్రీ
  • బౌలింగ్‌, బ్యాటింగ్‌లో అద్భుత ప్రతిభ
  • ‘బీసీసీఐ అండర్‌ 19’కు ఎంపిక

రామంతాపూర్‌ : క్రికెట్‌తో పాటు కూచిపూడి నృత్యంలోనూ రాణిస్తూ ఆల్‌రౌండర్‌గా అదరగొడుతున్నది కావ్యశ్రీ. చదువుతో పాటు క్రికెట్‌, కూచిపూడి నృత్యంలో రాణిస్తుంది. 12 సంవత్సరాల గుగులోతు కావ్యశ్రీ చిన్నప్పటి నుంచే కళలంటే మక్కువ పెంచుకుంది. అందులో క్రికెట్‌లో మరింత ఆసక్తి కనబర్చింది. ఇది గమనించిన తల్లి సుజాత, తండ్రి శ్రీనివాస్‌నాయక్‌లు క్రికెట్‌ శిక్షణ ఇప్పించేందుకు అశ్విని అకాడమీలో చేర్చించారు. కోచ్‌ అశ్విని కుమార్‌రాజ్‌ వద్ద గత మూడు సంవత్సరాలుగా శిక్షణ తీసుకుంటున్న కావ్యశ్రీ రెట్టింపు ఉత్సాహంతో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో క్రికెట్‌ టోర్నమెంట్స్‌లో మంచి ప్రతిభ కనబర్చింది. నాగోల్‌లో విస్పోర్ట్స్‌ ఆధ్వర్యంలో జరిగిన పోటీల్లో కావ్యశ్రీ మంచి ప్రతిభ కనబర్చింది. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌లో ఆల్‌ రౌండర్‌ ప్రతిభతో అవార్డు అందుకుంది. గత డిసెంబర్‌లో హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియంలో బీసీసీఐ ఆధ్వర్యంలోఅండర్‌ 16 కు ఎంపికైంది. పుదుచ్చేరిలో ఆంధ్ర, కేరళ, తమిళనాడు, పాండిచ్చేరి, కర్ణాటక, గోవా రాష్ర్టాలతో డొమెస్టిక్‌ టోర్నమెంట్‌లో మంచి ప్రతిభ చూపినందుకు గాను బీసీసీఐ మళ్లీ అండర్‌ 19 ప్రాబబుల్స్‌ పోటీలకు కావ్యశ్రీని ఎంపిక చేశారు. 


కావ్యశ్రీకి ఘన సన్మానం 

క్రికెట్‌లో అండర్‌ 19 క్రికెట్‌ పోటీలకు ఎంపికైన కావ్యశ్రీని పీర్జాదిగూడ మేయర్‌ జక్కవెంకట్‌రెడ్డి, డిప్యూటీ మేయర్‌ కుర్రా శివ, పలువురు కార్పొరేటర్లు ,కమిషనర్‌ శ్రీనివాసరెడ్డి క్రికెట్‌ క్రీడాకారిణి కావ్యశ్రీని ఘనంగా సన్మానించి అభినందించారు.


ఆల్‌రౌండర్‌ కావాలని..

నా పట్టుదలకు తోడుగా తల్లిదండ్రులు ప్రోత్సాహి స్తున్నారని కావ్యశ్రీ తెలిపారు. ప్రతిరోజు అకాడమీకి తీసుకుపోతున్నారన్నారు. ఆల్‌ రౌండర్‌ కావాలన్న ఆసక్తితో గురువు ఆశ్వినికుమార్‌ రాజ్‌ వద్ద నాకు మంచి శిక్షణ ఇస్తున్నారని అండర్‌ 19 పోటీలకు ఎంపికయ్యానని పేర్కొన్నారు.


logo