గురువారం 02 ఏప్రిల్ 2020
Medchal - Feb 09, 2020 , 00:49:11

నగరంలో ఆమె భద్రం

నగరంలో ఆమె భద్రం
  • తెలంగాణలో మహిళల భద్రతకు పటిష్ట చర్యలు
  • ఐజీ, షీటీమ్స్‌ ఇన్‌చార్జి స్వాతి లక్రా


శేరిలింగంపల్లి : తెలంగాణ ప్రభుత్వం మహిళల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ పటిష్ట చర్యలు చేపడుతుందని తెలంగాణ రాష్ట్ర మహిళా భద్రత ఐజీ, షీ టీమ్స్‌ ఇన్‌చార్జి స్వాతి లక్రా అన్నారు. సైబరాబాద్‌ పోలీసులు, సైబరాబాద్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం రాత్రి గచ్చిబౌలి స్టేడియం వద్ద ‘షీ సేఫ్‌ నైట్‌ వాక్‌' పేరిట నడక కార్యక్రమాన్ని ఆమె జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐజీ స్వాతి లక్రా మాట్లాడుతూ రాష్ట్రంలో ఐటీ ఉద్యోగులు అధిక సంఖ్యలో ఐటీ కారిడార్లలో విధులు నిర్వర్తిస్తున్నారని అన్నారు. ముఖ్యంగా నగరంలోని ఐటీ జోన్‌ ప్రాంతాల్లో అత్యధికంగా మహిళలు తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి భయాందోళనలు లేకుండా స్వేచ్ఛగా వారు విధులు నిర్వర్తించుకునేలా రాత్రిళ్లు ఒంటరిగా రహదారులపై నడిచేలా రాష్ట్ర పోలీసు శాఖ బందోబస్తు చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం మహిళల భద్రతలో రాజీ లేకుండా విశిష్ట చర్యలు చేపడుతుందన్నారు. సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ మాట్లాడుతూ కమిషనరేట్‌ పరిధిలో మహిళా ఐటీ ఉద్యోగులు అత్యధికంగా ఉన్నారని, వారి భద్రతకు అవసరమైన అన్ని రకాల చర్యలు చేపడుతామన్నారు.  


ఆపదలో ఉన్నప్పుడు డయల్‌ 100కు కాల్‌ చేసిన క్షణాల వ్యవధిలోనే వారికి అన్ని రకాలుగా పోలీసులు అండగా ఉంటారన్నారు. ప్రత్యేకంగా షీ టీమ్స్‌ను ఏర్పాటు చేసి మహిళల భద్రతను మరింత కట్టుదిట్టం చేశామన్నారు. అనంతరం ప్రముఖ న్యూస్‌ యాంకర్‌ బిత్తిరి సత్తి తనదైన శైలిలో మహిళల భద్రతకు సంబంధించి కామెడీ చేసి అందరినీ కడుపుబ్బా నవ్వించారు. ‘తొవ్వలపొంటి ఆడోళ్ల జోలికి పోతే షీ టీమ్స్‌ పోలీసులు బొక్కలు ఇరగ్గొడతారంటూ’ హాస్యం పండించాడు. ఈ కార్యక్రమంలో ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధు, కోచ్‌ పుల్లెల గోపీచంద్‌, ప్రముఖ పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్‌ మంజుల అనగాని, ప్రముఖ వర్ధమాన తెలుగు నటి ఇషా తతరెబ్బా, సైబరాబాద్‌ పోలీస్‌ ఉన్నతాధికారులు అనసూయ, ఇందిరలతోపాటు పలువురు డీసీపీలు, ఏసీపీలు, సైబరాబాద్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ కార్యదర్శి భరణి, వివిధ ఐటీ సంస్థల మహిళా ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 


logo
>>>>>>