శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Medchal - Feb 09, 2020 , 00:09:34

తప్పిపోయిన వృద్ధురాలు..ఇంటికి చేర్చిన ఆటో డ్రైవర్‌

తప్పిపోయిన వృద్ధురాలు..ఇంటికి చేర్చిన ఆటో డ్రైవర్‌
  • నగలున్నా నిజాయితీగా వ్యవహరించిన ఆటో డ్రైవర్‌
  • అభినందించిన పోలీసులు..రూ.10వేల బహుమతి అందజేతబంజారాహిల్స్‌, నమస్తే తెలంగాణ: కొడుకుతో కలిసి దవాఖానకు వచ్చి ... తప్పి పోయిన వృద్ధురాలిని క్షేమంగా ఇంటికి చేర్చిన ఆటో డ్రైవర్‌ను బంజారాహిల్స్‌ పోలీసులు అభినందించారు. శనివారం బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ కేఎస్‌ రావు, ఇన్‌స్పెక్టర్‌ కళింగరావు వివరాలు వెల్లడించారు. రాజేంద్రనగర్‌ ,  బుద్వేల్‌ బన్సీలాల్‌నగర్‌లో నివసించే ఆర్‌.సమరసింహారెడ్డి... తన తల్లి శకుంతల(65)ని ఈ నెల 6న నిమ్స్‌ దవాఖానకు తీసుకువచ్చాడు. రాత్రి 9.30 గంటల ప్రాంతంలో  పరీక్షలు చేయించుకుని బైక్‌పై బయలుదేరా రు. సమరసింహారెడ్డి తాజ్‌ బంజారా హోటల్‌ ఎదురుగా బైక్‌ ఆపి రిపోర్ట్స్‌ చూసుకుంటున్నాడు. అదే సమయంలో తల్లి కిందకు దిగింది. ఈ విషయాన్ని గుర్తించని సమరసింహారెడ్డి అలాగే బైక్‌పై ముందుకెళ్లాడు. గుడిమల్కాపూర్‌కు వెళ్లిన తర్వాత... వెనకాల తల్లి లేదన్న విషయాన్ని గుర్తించి.. తిరిగి వెనక్కి వచ్చాడు. అక్కడ మొత్తం గాలించినా ఆచూకీ తెలియక పోవడంతో బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.


ఇదిలా ఉండగా... బైక్‌ దిగిన శకుంతల.. కొడుకు ముందుకు వెళ్లిపోవడంతో ఎటువెళ్లాలో తెలియక కొద్ది దూరం ముందుకు వెళ్లి ఓ ఆటో ఎక్కింది. అప్పుడు ఆమె ఒంటిపై సుమా రు 8తులాల బంగారు ఆభరణాలు ఉన్నాయి.  అయినా ఆటోడ్రైవర్‌ సయ్యద్‌ ఖుర్షీద్‌ నిజాయితీగా.. అర్ధరాత్రి  ఆమె ఆచూకీ కనుక్కుని ఇంటివద్ద దింపేశాడు. శనివారం ఈ విషయాన్ని   సమరసింహారెడ్డి బంజారాహిల్స్‌ పోలీసులకు చెప్పాడు. అలాగే ఆటో డైవర్‌ నిజాయితీకి, చేసిన సాయానికి కృతజ్ఞతలు తెలుపుతూ రూ.10వేల నగదు బహుమతిని అందజేశారు. ఆటో డ్రైవర్‌ ఖుర్షీద్‌ను ఏసీపీ, ఇన్‌స్పెక్టర్‌ కళింగరావు అభినందించారు.


logo