శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Medchal - Feb 08, 2020 , 01:57:52

పశువులకూ హెల్త్‌ ప్రొఫైల్‌

పశువులకూ హెల్త్‌ ప్రొఫైల్‌

పశువుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు కేంద్ర, ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. ప్రతి పశువుకూ హెల్త్‌ కార్డు జారీ చేయాలని నిర్ణయించాయి. ఈ మేరకు ప్రభుత్వం నేషనల్‌ డెయిరీ డెవలప్‌మెంట్‌ ఇంటిగ్రేడ్‌ నెట్‌వర్క్‌ ఆన్‌ యానిమల్‌ ప్రొడక్టివిటీ అండ్‌ హెల్త్‌ పోర్టల్‌ నమోదుకు శ్రీకారం చుట్టింది. పోర్టల్‌లో నమోదైన పశువులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారు. ఇందుకోసం ఆదేశాల మేరకు జిల్లా పశుసంవర్థక శాఖ అధికారులు ఈ నెల 1 నుంచి మార్చి 15 వరకు జిల్లాలో స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించి పశువుల లెక్క తేల్చనున్నారు. ఇప్పటికే వేసిన పశువులకు చెవి పోగులు (యూనిక్‌ ఐడీ ట్యాగ్‌లు) వేయడంతోపాటు వాటి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. కాగా, 20 గోశాలలు ఉండగా.. వాటిల్లో 19,830 పశువులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

  • రూపకల్పనకు శ్రీకారం.. త్వరలో అమలు
  • ప్రతి పశువుకూ యూనిక్‌ ఐడీ ట్యాగ్‌.. హెల్త్‌ కార్డు జారీ
  • ఈ నెల 1నుంచి మార్చి 15 వరకు స్పెషల్‌ డ్రైవ్‌
  • గోశాలలకు కేరాఫ్‌గా జిల్లా
  • జిల్లాలో 20 గోశాలలు.. 19,830 పశువులు పశువులకూ హెల్త్‌ ప్రొఫైల్‌

పశువుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకునేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. పశువులకు సైతం హెల్త్‌ కార్డులు జారీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సరికొత్త పథకానికి మొదలుపెట్టడంతో గోశాల నిర్వహించే వారికి ఉపశమనం లభించినట్లు అయ్యింది. గతంలో గోశాల పశువుల నిర్వహణ వారే చూసుకునే వారు..అది వారికి భారంగా పరిణమించడంతో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో ప్రభుత్వం గోశాల పశువులతో పాటు రైతుల పశువులకు సైతం అదే మాదిరిగా ఉండగా..ప్రస్తుతం గోశాలలకు కూడా పథకం వర్తింపజేశారు. ప్రస్తుతం జిల్లా పశుసంవర్ధశాఖ లెక్క తేల్చే పనిలో పడింది. గోశాల వద్దకే వెళ్లి గోవులకు చికిత్స చేసే వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. మొబైల్‌ వాహనాన్ని ప్రవేశపెట్టారు. జిల్లాలో గుర్తించిన గోశాలల్లో ఏమి చేస్తారో..వాహనంలో ఎవరెవరు అందుబాటులో ఉంటారు. ఏ మందులు అందుబాటులో ఉంటాయో వారికి అవగాహన కల్పిస్తున్నారు. అవసరమైతే ఎలా సంప్రదించాలో  పశుసంవర్థక అధికారులు సూచనలు ఇస్తున్నారు. పశు సంపదపై తీవ్ర ప్రభావం చూపే గాలికుంటు వ్యాధి నివారణకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వం ‘నేషనల్‌ డైరీ డెవలప్‌మెంట్‌'(ఎన్‌ఏడీడీబీ) ద్వారా ఇంటిగ్రేడ్‌ నెట్‌వర్క్‌ ఆన్‌ ఎనిమల్‌ ప్రొడక్టవిటీ అండ్‌ హెల్త్‌ పోర్టల్‌ నమోదుకు శ్రీకారం చుట్టారు.ప్రతి పశువుకు గాలికుంటు వ్యాధి వ్యాక్సిన్‌ వేయించుకోవాలంటే తప్పనిసరిగా ఈ పోర్టల్‌లో నమోదై ఉండాల్సిందే. పోర్టల్‌లో నమోదైన పశువుల ఆధారంగా వాటికి ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారు. సర్కార్‌ ఆదేశాల మేరకు జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారులు ఈ నెల 1 నుంచి మార్చి 15 వరకు జిల్లాలో స్పెషల్‌ డ్రైవ్‌ ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందులో ప్రస్తుతం గోశాలకు సంబంధించి ప్రత్యేక కార్యచరణ రూపొందించారు. రాష్ట్రవ్యాప్తంగా 44 గోశాలలు ఉంటే అందులో జిల్లా పరిధిలో 20 గోశాలు ఉన్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. ఇంతకు మందు కేవలం వ్యాక్సిన్‌లు, టీకాలు వేసి కొమ్ములకు రంగులు వేసి వదిలి వేసేవారు. ప్రస్తుతం మాత్రం వ్యాక్సిన్‌, టీకాలు వేసిన ప్రతి పశువుకు చెవి పోగులు పెట్టడం(యూనిక్‌ ఐటీ ట్యాగ్‌లు వేయడం)తో పాటు పశువుల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. 

20 గోశాలలు ..  19830 పశువులు.. 

    జిల్లాలో 20 గోశాలలు ఉండగా..వాటిలో 19830 పశువులు ఉన్నట్లు గుర్తించారు. శంషాబాద్‌లో 6, హయత్‌నగర్‌లో 4, శంకర్‌పల్లిలో 2, పహాడీషరీఫ్‌లో 2,నందిగామలో 2,చేవెళ్లలో 2,మొయినాబాద్‌లో1, కన్హాశాంతి వనంలో ఒకటి చొప్పున గోశాలు ఉన్నాయి. వీటిలో 3456 మగ పశువులు..16,374 ఆడ పశువులు ఉన్నట్లు గుర్తించారు. వ్యాధి నిరోధక టీకాలు వేయడానికి 300 మంది సిబ్బంది, 105 బృందాలుగా పనిచేయనున్నారు. గ్రామాల్లో పశువులకు వ్యాక్సిన్లు వేయడంతో పాటు ట్యాగింగ్‌ చేసి వాటి ఆరోగ్య వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. జిల్లా వ్యాప్తంగా 27 మండలాల్లో 896 గ్రామాల్లో 4,08, 680 మూగజీవాలుండగా, ప్రతి పశువుకు హెల్త్‌ కార్డును జారీ చేయనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తగా అన్ని మూగ జీవాల్లో రోగాల నివారణకు ఎన్‌ఏడీసీపీ(నేషనల్‌ ఎనిముల్‌ డీసీస్‌ కంట్రోల్‌ ప్రోగ్రాం) పేరుతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. జిల్లాలో ఈ వ్యాధి నివారణకు ఇప్పటి వరకు 21 సార్లు టీకాలను వేశారు. ఈ నేపథ్యంలో ఈ సారి వందశాతం పశువులకు టీకాలు వేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. 

గోశాల నిర్వాహకులు సహకరించాలి
- విజయ్‌కుమార్‌రెడ్డి,  జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి 

   జిల్లాలోని అన్ని గోశాలు నిర్వాహకులు ఈ కార్యక్రమానికి సహకరించాలి.1962 వాహనం ద్వారా గోశాలలో ఉన్న పశువులకు అత్యవసర చికిత్స అందిస్తాం. వాహనంలో డాక్టర్‌, సహాయ సిబ్బంది, అటెండర్‌, డ్రైవర్‌ ఉంటారు. మెడిసిన్‌ అందుబాటులో ఉంటాయి. వాహనం అవసరమైతే ఎలా సంప్రదించాలో గోశాల యజమానులకు సూచించాం. ఈ వాహనం పత్తర్‌ఘట్టి నుంచి మొదలు అవుతుంది. జిల్లాలో గాలికుంటు నివారణ టీకాలు కార్యక్రమం పకడ్బందీగా అమలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. 30 రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లోని పశువులకు టీకాలు వేయడం జరుగుతుంది. 


logo